కులాంత‌ర వివాహాల‌ను ఆపడం ఆసాధ్యం: కేర‌ళ సీఎం విజ‌య‌న్‌

నవతెలంగాణ హైదరాబాద్: కులాంత‌ర వివాహాల‌(Inter-caste marriages)ను నిరోధించ‌లేమ‌ని, అవి ఈ రాష్ట్రంలో జ‌రుగుతున్న మార్పులో భాగ‌మే అని కేర‌ళ సీఎం విజ‌య‌న్ అన్నారు. కోజికోడ్ జిల్లాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విజయన్ మాట్లాడుతూ యువతి యువ‌కులు ఒక‌ర్ని ఒక‌రు ఇష్ట‌ప‌డి.. పెండ్లి చేసుకోవాల‌నుకుంటే, వారి కులం, మ‌తంతో సంబంధం లేదు, ఆ బంధాన్ని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని విజ‌య‌న్ అన్నారు. కులాంత‌ర వివాహాల‌కు ఎప్పుడూ తల్లిదండ్రుల నుంచే వ్య‌తిరేక‌త వ‌స్తూనే ఉంద‌ని, కానీ ఎప్పుడు కూడా అలాంటి పెండ్లిళ్లు ఆగ‌లేద‌ని ఆయ‌న అన్నారు.
సీపీఐ(ఎం)తో పాటు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు.. కులాంత‌ర, మ‌తాంత‌ర వివాహాల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు ఇటీవ‌ల ఆ రాష్ట్రానికి చెందిన ఓ ఇస్లామిక్ మత గురువు ఆరోపించారు. సెక్యుల‌రిజం పేరుతో ఆ పెండ్లిళ్లు జ‌రిపిస్తున్న‌ట్టు విమ‌ర్శించారు. దీనిపై విజ‌య‌న్ స్పందిస్తూ.. ఎస్ఎఫ్ఐ కానీ, డీవైఎఫ్ఐ కానీ.. కులాంత‌ర వివాహాల‌కు బ్యూరోలుగా వ్య‌వ‌హ‌రించ‌డంలేద‌న్నారు. ఈ మార్పుల‌న్నీ కాలానుగుణం జ‌రుగుతున్న‌ట్టు చెప్పారు. ఏ సంస్థ కానీ, ప్ర‌భుత్వం కానీ ఇలాంటి వివాహాల‌ను ప్రోత్స‌హించ‌డం లేద‌న్నారు.

Spread the love