భవన నిర్మాణ కార్మికులకు కేరళ అండ

– రెట్టింపు ఖర్చు చేసిన ‘సంక్షేమ’ నిధులు
– ఉన్నవాటినే ఖర్చు చేయని ఇతర రాష్ట్రాలు
తిరువనంతపురం : కార్మికులను ఆదుకోవడంలో సీపీఐ(ఎం) అధికారంలో ఉన్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదర్శంగా నిలిచింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న నిధుల కంటే రెట్టింపు స్థాయిలో అదనపు నిధులను ఖర్చు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పన్ను చట్టం ప్రకారం ఆయా రాష్ట్రాల్లో రోడ్లు, భవనాల నిర్మాణదారులు, కంపెనీల నుంచి ఒక శాతం పన్ను వసూలు చేయాలి. వీటిని భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల ద్వారా ఆయా రాష్ట్రాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఖర్చు చేయాలి. కేరళ రాష్ట్రంలో 20,45,538 మంది కార్మికులు ఆ రాష్ట్ర భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. కేరళ సంక్షేమ బోర్డుకు పన్నుల రూపంలో రూ.2,740.95 కోట్ల నిధులు వచ్చాయి. ఈ నిధులతోపాటు కేరళ ప్రభుత్వం అదనంగా రూ.1,648.83 కోట్లు కలిపి మొత్తం రూ.4,399.78 కోట్లను కార్మికుల కోసం ఖర్చు చేసింది. కార్మికుల సంక్షేమం కోసం ఉన్న నిధులతోపాటు అదనంగా ఖర్చు చేసింది కేరళ ప్రభుత్వం ఒక్కటేనని ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి రామేశ్వర్‌ తేలి వెల్లడించారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పన్ను చట్టం ప్రకారం పన్ను ద్వారా వచ్చిన నిధులను బోర్డులో సభ్యులుగా నమోదైన కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినా, అంగవైకల్యం కలిగినా రూ.5 లక్షల వరకు బీమా కల్పించాలి. కార్మికుల ఆరోగ్యానికి, కార్మికుల ఆడిపిల్లల పెళ్లి ఖర్చులు, మెటర్నటీ, పిల్లల చదువుల కోసం బోర్డు నుంచి ఆర్థికసాయం అందించాలి. కార్మికుల ఇంటి నిర్మాణం కోసం రుణాలు అందించాలి. 60 ఏళ్లు దాటిన కార్మికులకు పెన్షన్‌ సౌకర్యం కూడా చట్ట ప్రకారం కల్పించాలి. దేశవ్యాప్తంగా 5.06 కోట్ల భవన నిర్మాణ కార్మికులు ఆయా రాష్ట్రాల వారీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బోర్డుల్లో మొత్తం రూ.87,478 కోట్ల నిధులు ఉన్నాయి. అయితే ఇందులో రూ.49,269 కోట్లు మాత్రమే రాష్ట్రాలు కార్మికుల కోసం ఖర్చు చేశాయని మంత్రి చెప్పారు. భవనాలు, రోడ్లు ఇతర నిర్మాణదారులు, కంపెనీల నుంచి పన్ను వసూలు చేసి కార్మికుల సంక్షేమం కోసం బోర్డులు ఖర్చు చేయడం నిరంతర ప్రక్రియ. కేరళలో తప్ప మిగతా ఏ రాష్ట్రంలోనూ కార్మికుల కోసం ఈ నిధులను వినియోగించిన దాఖలాలు లేవు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా కార్మికుల సంక్షేమానికి వెచ్చించిన పాపాన పోలేదు. బిజెపి అధికారంలో ఉన్న గోవా, ఉత్తరప్రదేశ్‌, త్రిపురలోనూ ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి.

Spread the love