తగ్గుతున్న నిరుద్యోగం

ఇది కేరళ విజయం
– 12 శాతం నుంచి 5 శాతానికి…

–  రెండేండ్ల పాలనపై సీఎం ‘ప్రగతి నివేదిక’
తిరువనంతపురం : కేరళలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. విజయన్‌ సర్కారు పనితీరుతో రాష్ట్రంలో నిరుద్యోగం 12 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం గత రెండేండ్లలో సాధించిన విజయాలను తెలియజేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రగతి నివేదికను విడుదల చేశారు. వచ్చే 25 ఏండ్లలో ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి కేరళలో జీవన ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సూచించారు. గత ఏడేండ్లుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఈ లక్ష్యానికి చేరువ చేస్తున్నాయని ఆయన వివరించారు.కరళలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతూ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. వారిలో మహిళల నుంచి అధికంగా ఉండటం గమనార్హం. దాదాపు రూ. 8500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. దీని ద్వారా దాదాపు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని సీఎం వివరించారు.ప్రపంచంలోనే అత్యుత్తమ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌గా కేరళ స్టార్టప్‌ మిషన్‌ ఎంపికైందన్నారు. కేరళ సొంత ప్రాజెక్ట్‌ కొచ్చి వాటర్‌ మెట్రో, రూ.1500 కోట్ల డిజిటల్‌ సైన్స్‌ పార్క్‌ ప్రాజెక్ట్‌, వివిధ ఐటీ పార్కులు కేరళ ప్రగతికి సూచికలు. బహుళజాతి కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు.
2016కు ముందు రాష్ట్రంలో తీవ్ర నిరాశే ఉండేదని వివరించారు. ”ఇక్కడ ఎలాంటి మార్పు ఉండదనీ, ఎలాంటి మార్పును ఆశించకూడదని భావించేవారు చాలా మంది ఉన్నారు. దేశానికే గర్వకారణమైన విద్య, ఆరోగ్య రంగాల వెనుకబాటుతనం, సంస్కతిలో కుళ్లిపోవడం, అవినీతి కారణంగా ఇది జరిగింది. ఈ పరిస్థితి నుంచి నేటి కేరళ పునరుజ్జీవం పొందింది. అన్ని విపత్తులను తట్టుకుని కేరళ పురోగమిస్తున్నది. ఈ ఉద్యమాన్ని తక్కువ చేసేందుకు అసత్యాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని విజయన్‌ పేర్కొన్నారు.
2016లో కేరళలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వివిధ పెన్షన్‌ పథకాల్లో రూ. 1473.67 కోట్లు బకాయిలు ఉన్నాయి. అప్పట్లో రెండేండ్లుగా పింఛను రాని వారు ఉన్నారు. విజయన్‌ సర్కారు పెన్షన్‌ మొత్తాన్ని 600 నుంచి 1600కి పెంచింది. రూ. 18997 కోట్ల మొత్తాన్ని సామాజిక పింఛన్‌గా పంపిణీ చేశారు. పేదల పట్ల నిబద్ధత కలిగిన ప్రభుత్వం కాబట్టి తమను మళ్లీ అంగీకరించారనీ, అదే ప్రభుత్వ విధానం అని సీఎం పేర్కొన్నారు. కేరళను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళి నవ కేరళకు సాధ్యపడాలని కోరుకుంటున్నాననీ, ఐక్యతతోనే దీనిని సాధించగలమని వివరించారు. కేరళలో గత ఆరేండ్లలో వచ్చిన మార్పులను దాచిపెట్టి కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు. కేరళ ఏ రంగంలోనూ వెనుకంజ వేయలేదనీ, ఎక్కడా ఆగిపోలేదని ఆయన స్పష్టం చేశారు.

Spread the love