దేశానికే కేరళ ఆదర్శం

Kerala is an ideal for the country– మతోన్మాదులపై పోరాటంలో ముందడుగు..
– వారిని నిలువరించడంలో గొప్ప స్ఫూర్తి

భారతీయ సమాజ మనుగడ ఎలా ఉండాలో చెబుతున్న మలయాళ సమాజం
– పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేరళ తరహా రాజకీయాలు ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. సైద్ధాంతికంగా ఎన్ని వైరుధ్యాలున్నప్పటికీ అక్కడి రాజకీయ పార్టీలు, ప్రజలు మతోన్మాదులకు మాత్రం అవకాశమివ్వలేదని కొనియాడారు. సోమవారం కేరళలోని కోజికోడ్‌లో ఇండియన్‌ యూనియన్‌ ముస్లీం లీగ్‌ (ఐయూఎంఎల్‌) కేరళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్నేహ సదస్సు’లో రేవంత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సయ్యద్‌ సాదిఖలీ షాహీబ్‌ తంగల్‌ రాసిన ‘స్నేహ సదస్స్‌’ పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేరళ ప్రజలు మతోన్మాదులను ఏ మాత్రం భరించరనీ, తమ నాయకుడు ఈ రాష్ట్రం నుంచే పోటీ చేస్తున్నారని చెప్పారు. కేరళలో యునైటెడ్‌ డెమెక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఇండియా అలయెన్స్‌కు మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. ఐయూఎంఎల్‌ గత 40 ఏండ్లుగా కాంగ్రెస్‌ వెంటే ఉందనీ, ఇలాంటి నమ్మకమైన స్నేహితుడు పక్కన ఉంటే మోడీ అయినా, అంతకు మించిన మతోన్మాదినైనా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రేమతో నిండిన మార్కెట్‌లో ద్వేషమనే దుకాణాన్ని తెరిచేందుకు మతోన్మాదులు ప్రయత్నిస్తున్న సమయంలో స్నేహ సదస్సును నిర్వహించడం, అదే సందేశంతో పుస్తకాన్ని విడుదల చేయడంపట్ల సీఎం ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. మతోన్మాదులపై పోరాటానికి సంబంధించి తాను కేరళ నుంచి నేర్చుకోవాలను కుంటున్నట్టు చెప్పారు. కేరళకు వచ్చిన ప్రతిసారీ మతోన్మాదులను ఓడించేందుకు వీలుగా ఏదో ఒక రకమైన స్ఫూర్తిని పొంది వెళ్తున్నానని తెలిపారు. ప్రధానమంత్రి హౌదాలో ఉండి మోడీ పదే పదే దేశాన్ని విచ్ఛిన్నం చేసే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని కాకముందే ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులుగా వారి భావజాలలకు అనుగుణంగా వ్యాఖ్యలు చేస్తే అది వారికే పరిమితమవుతుందని తెలిపారు. అయితే ప్రధాని అయిన వ్యక్తి ప్రజలందరి ఆసక్తిని గుర్తించి కాపాడేవారై ఉండాలని హితవు పలికారు. కేరళలోకి చొచ్చుకొచ్చేందుకు మోడీ బాధ్యాతారహితంగా మాట్లాడారనీ, ఇక్కడి ప్రజలు మాత్రం ఇంచు కూడా మతోన్మాదులకు దక్కకుండా అడ్డుకున్నారని అభినందించారు. ఇలాంటి చర్యలతో కేరళ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. సమాజాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని భారతదేశం, కేరళ నుంచి నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. స్నేహ సదస్సు మినీ ఇండియాను, ఇండియా అలయెన్స్‌ను, సెక్యులర్‌ ప్లాట్‌ ఫాంను తలపిస్తున్నదని ప్రశంసించారు. ఇలాంటి సందేశాన్ని కోట్లాది మందికి చేర్చాలని ఆకాంక్షించారు.
దిగజారిన రాజకీయాలు
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. అయితే మతోన్మాదులు ఎన్నికల్లో గెలిచేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని వారు అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ నేతలు 400 ఎంపీ సీట్లు తమకు వస్తాయని ఊదరగొడుతున్నారనీ, రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ఈ తతంగమని, అయితే వారి కలలు కల్లలు కాబోతున్నాయని రేవంత్‌ వ్యాఖ్యానించారు. 130 వరకు స్థానాలున్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలు కలిపి మతోన్మాదులు 20 కూడా దాటబోరని చెప్పారు. ఇక గతంలో ఏకపక్షంగా ఎన్డీఏ గెలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాల్లో వారి బలం సగానికి సగం తగ్గిపోబోతున్నదని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా పదేండ్లపాటు తెలంగాణను పాలించి ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్‌ మాదిరిగానే, పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోడీ కూడా దుర్భాషలాడారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయినట్టుగానే, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఓడిపోబోతుందని చెప్పారు.
నెహ్రూకు ఘన నివాళి
మాజీ ప్రధాని పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నెహ్రూ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, ఎమ్మెల్యే శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love