– ఫిబ్రవరి 8న జంతర్ మంతర్ వద్ద సీఎం సహా ప్రజా ప్రతినిధులంతా భారీ ధర్నా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తమ రాష్ట్రం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ఆందోళనకు పూనుకుంది. అలాగే బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించనుంది. ఫిబ్రవరి 8న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయ న్‌తో సహా రాష్ట్ర మంత్రులు, ఎల్‌డీఎఫ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఎల్‌డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ కాంగ్రెస్, ఇతర యూడీఎఫ్ భాగస్వామ్య పార్టీలను ధర్నాలో పాల్గొనవలసిందిగా కోరారు. కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నదనీ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నదని విమర్శించారు. కాగా,
ధర్నాలో పాల్గొనాలన్న ఎల్‌డీఎఫ్ ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరస్కరించింది. యూడీఎఫ్ తీసుకున్న నిర్ణయంపై కేరళ రాజకీయ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.