జమ్మూ కాశ్మీర్‌ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జీగా కిషన్‌ రెడ్డి

– నాలుగు రాష్ట్రాలకు ఇన్‌చార్జి, కో ఇన్‌చార్జిల నియామకం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బీజేపీ చీఫ్‌ జేపి నడ్డా పార్టీ తరపున ఎన్నికల ఇన్‌చార్జీలను నియమించారు. అందులో భాగంగా కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికల బాధ్యతలను కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు సోమవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్‌లోగా జమ్మూ కాశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
దీంతో ఆయా రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ తరపున ఎన్నికల బాధ్యతలను కేంద్ర మంత్రులు, సీఎం, మాజీ సీఎంలకు అప్పగిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇందులో మహారాష్ట్రకు ఇన్‌చార్జి, కో ఇన్‌చార్జీలుగా కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌, అశ్వినీ వైష్ణవ్‌ను నియమించింది. హర్యానాకు ఇన్‌చార్జి, కో ఇన్‌చార్జీలుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, మాజీ సీఎం బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ను, జార్ఖండ్‌ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, సహ ఇన్‌చార్జిగా అస్సాం సీఎం హేమంతా విశ్వ శర్మకు బాధ్యతలు అప్పగించింది. కాగా, జమ్మూ కాశ్మీర్‌కు కేవలం ఇన్‌చార్జినే నియమించిన హైకమాండ్‌, ఆ బాధ్యతలను కిషన్‌ రెడ్డికి మాత్రమే అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Spread the love