కార్మిక, రైతాంగ సమస్యలే ఎన్నికల ఎజెండా

Labor and peasant issues are the election agenda– 73వ షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలు కరువు
– 1500 పరిశ్రమల్లో 2.50 లక్షల మంది కార్మికులు
– లేబర్‌ కోడ్‌లు తెచ్చిన మోడీ పట్ల తీవ్ర వ్యతిరేకత
– పంటలకు దక్కని కనీస మద్దతు ధరలు
– మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రభావం చూపుతున్న సమస్యలు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ రాబోతుంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. మెతుకు సీమగా పేరొందిన మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటీ చేయనున్నాయి. రెండు దశాబ్దాలుగా మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో జాతీయ పార్టీల అభ్యర్థులు గెలవలేకపోయారు. బీఆర్‌ఎస్‌ వరుసగా ఐదు పర్యాయాలు గెలుస్తూ వచ్చింది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్‌ఎస్‌ను ఓడించి గెల్చి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌, బీజేపీలున్నాయి. పార్టీల బలాబలాల పరిస్థితి పక్కన పెబడితే.. పారిశ్రామిక, వ్యవసాయక ప్రాంతంగా ఉన్న మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కార్మిక, రైతాంగ సమస్యలే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయి. నియోజకవర్గం పరిధిలో ఉన్న వేలాది పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులున్నారు. వీరికి సంబంధించి షెడ్యూల్‌ పరిశ్రమల్లో కనీస వేతనాల సవరణ జరగట్లేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్ని రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను తేనుంది. బీడీ కార్మికుల సమస్యలూ ఉన్నాయి. వీటిపైనా కార్మిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అదే విధంగా పంటలకు కనీస మద్ధతు ధర లేకపోవడం, కేంద్రం నల్ల చట్టాల్ని తెచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చేస్తున్న నిర్ణయాల ప్రభావం కూడా తీవ్రంగా ఉండనుంది.
మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 18.12 లక్షల మంది ఓట్లున్నారు. వీరిలో కార్మికులు, రైతులే పది లక్షల వరకు ఉన్నారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్‌, మెదక్‌, గజ్వేల్‌, సిద్దిపేట అసెంబ్లీ నియోకజవర్గాల్లో భారీ, మధ్యతరహా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. దుబ్బాక, మెదక్‌ నియోజకవర్గాల్లో బీడీ పరిశ్రమ విస్తరించింది. అదే విధంగా మెదక్‌, నర్సాపూర్‌, సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉంది. కాళేశ్వరం, సింగూరు జలాల వినియోగంతో పటాన్‌చెరు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ వరి, పత్తి, చెరకు, మామిడి వంటి పంటలు 10 లక్షల ఎకరాల్లో పండుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనే విషయాలపై అసెంబ్లీ ఎన్నికలు నిర్ణయించినా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్ల ఆలోచన వేరుగా ఉండనుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకు మేలు చేకూరుతుందనే విషయాల్ని ఓటర్లు ఆలోచించే అవకాశముంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంత కాలం తీసుకున్న నిర్ణయాలు మేలు చేశాయా.. కీడు చేశాయా..? అనే ఆంశాలను కూడా ఓటరు పరిశీలన చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.
73వ షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలు.. నాలుగు లేబర్‌కోడ్స్‌
పటాన్‌చెరు మినీ ఇండియాగా మారింది. పటాన్‌చెరు నియోజకవర్గంలోని పాశమైలారం, పటాన్‌చెరు, బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి, ఆర్‌సీపురం ప్రాంతంలోనే 1300 పరిశ్రమలున్నాయి. సంగారెడ్డి, నర్సాపూర్‌, మెదక్‌, గజ్వేల్‌, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వందలాది పరిశ్రమలున్నాయి. 73 షెడ్యూల్‌ పరిశ్రమల్లో కనీస వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది. 2 నెలల గడువిచ్చి అభ్యంతరాలను కోరింది. ప్రిన్సిపల్‌ అడ్వైజరీ ప్లానింగ్‌ కమిషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఇచ్చిన రికమండేషన్స్‌, కనీస వేతనాల సలహా మండలి సూచనలు, పెరుగుతున్న ధరలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని కార్మిక వర్గం అభిప్రాయపడుతోంది. ఇప్పటికే అమల్లో ఉన్న పాత జీవోల వేతనాలకు కొత్తగా ప్రతిపాదించిన వేతనాలకు ఒక్క రూపాయి కూడా పెరకపోగా కొన్ని షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌లో వేతనాలు తగ్గుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యకం చేస్తున్నారు. పెరిగిన ధరలు, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస వేతనాలను నిర్ణయించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. మరో పక్క కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చేందుకు పూనుకుంది. లేబర్‌కోడ్‌లు అమల్లోకి వస్తే మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న రెండున్నర లక్షల మంది కార్మికులు రోడ్డున పడనున్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్‌కోడ్‌లు తెచ్చి కార్మికుల పొట్టగొట్టాలని చూస్తున్న బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనే ప్రశ్న కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండు కూడా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహారిస్తున్నాయనే చర్చ ఉంది. దుబ్బాక, మెదక్‌, సిద్దిపేట ప్రాంతాల్లో 30 వేల మంది బీడీ కార్మికులున్నారు. వీరంతా శ్రమ దోపిడికి గురవుతున్నారు.
రైల్వే లైన్లు, విద్యా సంస్థల సమస్యలు
మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కేంద్రీయ విద్యాలయాల్ని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో పొట్లాడుతున్నా పదేండ్ల పాలనలో మోడీ ఒక్క పాఠశాలను కూడా మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం మూడు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల్ని నెలకొల్పినప్పటికీ కేంద్రం ఎలాంటి సాయమూ చేయలేదు. అదే విధంగా కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబుల్‌ లైన్ల విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి. గతంలో బీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రైల్వేకు సంబంధించి కొన్ని పనులు పూర్తి చేసినట్టు తెలిపారు.
నల్ల చట్టాల ప్రభావం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తేవాలనుకుంటున్న నల్ల చట్టాల ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. రైతులు పండించిన పంటలకు కనీస మద్ధతు ధర రావట్లేదు. ప్రాజెక్టుల నిర్మాణం, ఉచిత కరెంట్‌, రైతు భరోసాతో పంటల సాగు విస్తీర్ణం రెండింతలైంది. పది లక్షల ఎకరాల్లో పత్తి, వరి ఇతర పంటలు సాగవుతున్నాయి. వరికి మద్ధతు ధర, బోనస్‌ దక్కట్లేదు. ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరణ జరిగే ప్రక్రియను కేంద్రం ఆపేసింది. దాంతో ధాన్యం రైతులకు ధర రాకుండా పోయింది. సిద్దిపేట జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైతే సీసీఐ చేతులెత్తేసి వ్యాపారుల లాభాల కోసం ఏజెంట్‌గా పనిచేసింది. 15 వేల ఎకరాల్లో చెరకు సాగుతున్నా కేంద్రం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో చెరకు రైతులు నష్టాల పాలయ్యారు. సన్న, చిన్నకారు రైతుల్ని వ్యవసాయానికి దూరం చేసి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు నల్ల చట్టాలు చేస్తున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని రైతులు విమర్శిస్తున్నారు.

Spread the love