భూ సంస్కరణలు అమలు చేయాలి

– రైతు స్వరాజ్యవేదిక సెమినార్‌లో వక్తలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఆన్‌లైన్లో మంగళవారం ‘తెలంగాణ భూసమస్యలు అనే అంశంపై చర్చా గోష్టి నిర్వహించింది. ఈ సందర్భంగా సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డి. నర్సింహారెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ టి. గోపాల్‌ రావు మాట్లాడుతూ భూముల సంస్కరణ విషయంలో దేశానికి పశ్చిమ బెంగాల్‌లో ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భూ పంపిణీ జరిగింది కానీ అది ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. ఇచ్చిన భూములు ఆ పేద ప్రజల చేతుల్లో ఉన్నదీ లేనిదీ ప్రభుత్వం పర్యవేక్షణ చేయటం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి ఎప్పుడు భూమి అవసరం ఉన్నా…వెంటనే అసైన్డ్‌ భూములు తీసుకుంటోందని విమర్శించారు. దీంతో ఆ కుటుంబాలకు జీవన భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతుల హక్కుల వేదిక నేత ఉష సీతాలక్ష్మి మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని డిమాండ్‌చేశారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి వారి భూమి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పంట రుణాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. భూములను రీ సర్వే చేయాలనీ, ధరణి సమస్యలు పరిష్కరించాలని న్యాయవాది సునీల్‌ కోరారు. కౌలు రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. 2011 భూ ఆధీకృత సాగుదారుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని విస్సా కిరణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. కన్నెగంటి రవి, ఆశాలత సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

Spread the love