రైతులపై లాఠీ

Lathi on farmers– హర్యానాలో రైతుల ఆందోళనపై పోలీసుల దాడి
– రైతులకు గాయాలు… ధ్వంసమైన ట్రాక్టర్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతులపై హర్యానా పోలీసులు లాఠీలు ప్రయో గించారు. ఈ దాడిలో రైతులకు గాయాలయ్యాయి. వారి వాహనాలు సైతం పోలీసు దాడిలో ధ్వంసమ య్యాయి. ఖాప్‌ పంచాయతీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఖానౌరీ సరిహద్దు మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం హర్యానాలోని హిస్సార్‌ జిల్లా నార్నాండ్‌ సబ్‌ డివిజన్‌లోని ఖేరీ చోప్తా వద్ద నిరసన తెలుపుతున్న రైతుల సమూహంపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కొంతమంది పోలీసులు ట్రాక్టర్ల తాళాలు లాక్కోవడం ప్రారంభించడంతో పోలీసుల కు, నిరసన తెలిపిన రైతులకు మధ్య తోపులాట జరిగింది. సుమారు రెండు గంటల పాటు జరిగిన హింసాత్మక ఘర్షణలో పలువురు రైతులు గాయపడ్డారు. ఈ ఘర్షణలో కొన్ని ట్రాక్టర్లు ధ్వంసమయ్యాయి. ఎస్పీ హన్సీ మక్సూద్‌ అహ్మద్‌ ఖేరీ చోప్తా వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మరో రైతు మృతి
‘ఢిల్లీ చలో’ పిలుపు మేరకు నిరసన తెలుపు తున్న రైతుల్లో మరో రైతు ఖానౌరీ సరిహద్దులో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకి చేరుకుంది. భటిండా జిల్లాలోని అమర్‌పురా గ్రామానికి చెందిన రైతు దర్శన్‌ సింగ్‌ (62) ఫిబ్రవరి 13 నుండి ఖానౌరీ సరిహద్దులో ఉన్నాడు. గురువారం అర్ధరాత్రి సమ యంలో ఆయన అసౌకర్యానికి లోనయ్యారు. పాటియాలాలోని రాజింద్ర మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించాక మృతి చెందారు.
రైతు నాయకులపై ఎన్‌ఎస్‌ఎ ప్రయోగం…వెంటనే ఉపసంహరణ
అంబాలా జిల్లాకు చెందిన కొంతమంది రైతు నాయకులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ), 1980 విధింపును శుక్రవారం హర్యానా పోలీసులు ప్రకటించారు. వెంటనే ఉపసంహరించుకున్నామని అధికారులు తెలిపారు. వ్యవసాయ నేతలపై ఎన్‌ఎస్‌ఎ ప్రయోగించబోమని అంబాలా రేంజ్‌ ఐజీపీ సిబాష్‌ కబీరాజ్‌ తెలిపారు. ‘ఎన్‌ఎస్‌ఏ విధించే ముందు మాకు చెప్పలేదు. రద్దు చేసే ముందు చెప్పలేదు’ అని రైతు నాయకులు అన్నారు.
ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం జరిగినా రైతులే చెల్లించాలి
‘రైతుల నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం జరిగినా రైతులే చెల్లించాలి’ అని హర్యానా పోలీసులు తెలిపారు. ”రైతుల వల్ల ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్తులకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఈ ఉద్యమంలో రైతులు ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్తులకు నష్టం కలిగిస్తే, వారి ఆస్తులు, బ్యాంకు ఖాతాల నుంచి స్వాధీనం చేసుకుని ఈ నష్టాన్ని భర్తీ చేస్తాం. ఈ విషయంలో అడ్మినిస్ట్రేషన్‌ ఇప్పటికే తెలియజేసింది. ఉద్యమ సమయంలో రైతులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే నిరోధక చట్టం 1984 (పిడిపిపి చట్టం)లో సవరణ ఉంది. దీని ప్రకారం ఉద్యమ సమయంలో ప్రజల ఆస్తులకు నష్టం జరిగితే, ఉద్యమానికి పిలుపునిచ్చిన సంస్థ నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని అంబాలా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆందోళనలో పాల్గొనాలంటే అనుమతి తీసుకోవాలి.. ఇంటి గోడకు పోలీసుల నోటీసు
రైతు నాయకుడు నిరసన నిర్వహించే ముందు అనుమతి తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు పోలీసులు బీకేయూ (షహీద్‌ భగత్‌ సింగ్‌) అధ్యక్షుడు అమర్జీత్‌ సింగ్‌ మొహ్రీ నివాసం వెలుపల ఒక నోటీసును అతికించారు. నిరసన నిర్వహించే ముందు జిల్లా యంత్రాంగం నుండి అనుమతి తీసుకోవాలని హెచ్చరించారు. ఫిబ్రవరి 21న ఆయన శంభు సరిహద్దులో జరిగిన ఆందోళనలో పాల్గొన్నప్పుడు ఆయన ఇంటి వెలుపల నోటీసు అతికించబడిందని ఆయన సహచరులు పేర్కొన్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 23)లోగా తన ఆస్తి, భూమి వివరాలను సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు.

Spread the love