మోడీ సర్కార్‌పై రైతు, కార్మిక గర్జన

మోడీ సర్కార్‌పై రైతు, కార్మిక గర్జన– ప్రజా వ్యతిరేక మోడీ సర్కార్‌ ను గద్దెదించాలి : జంతర్‌ మంతర్‌ ఆందోళనలో రైతు, కార్మిక నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక మోడీ సర్కార్‌ పై రైతు, కార్మికులు గర్జించారు. రైతుల గ్రామీణ భారత్‌ బంద్‌, కార్మికుల పారిశ్రామిక సమ్మెకు సంఘీభావంగా శుక్రవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌, ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా, ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌ జిత్‌ కౌర్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక మోడీ సర్కార్‌ ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరిస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. రైతులను, కార్మికులను మోడీ మోసం చేస్తున్నారని, ఉత్పత్తి వర్గాలపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్మిక కోడ్‌ లతో కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రైతుల పండించిన పంటలకు ఎంఎస్పీ ఇవ్వటం లేదని, రుణమాఫీ చేయలేదని అన్నారు. రైతుల ఆత్మహత్యలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 పెంచాలని, పట్టణాలకు కూడా ఉపాధి హామీని విస్తరించాలని డిమాండ్‌ చేశారు. హర్యానాలోని పల్వాల్‌ లో ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌, ఎఐఎడబ్ల్యుయు సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌, మహారాష్ట్రలోని ముంబయిలో ఎఐకెఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ ధావలే, సీనియర్‌ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ పాల్గొన్నారు.

Spread the love