– తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
– ఈ అంశంపై శాసనసభలో సుదీర్ఘ చర్చ
– తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం
– బలహీన వర్గాల బలోపేతం కోసమేనన్న సీఎం రేవంత్
– వారిని ఆర్థికంగా నిలబెట్టటమే తమ లక్ష్యమని వెల్లడి
– సర్కారు చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్య
– సందేహాలను నివృత్తి చేసిన డిప్యూటీ సీఎం, పొన్నం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కులగణన తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక, ఇంటింటి సర్వేకు సంబంధించి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు అధికార, ప్రధాన ప్రతిపక్షం, ఇతర పక్షాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ… బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టడంతోపాటు జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించటమే తమ ప్రభుత్వ ఉద్దేశమని నొక్కి చెప్పారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్ సభ్యుల తీరు సరికాదన్నారు. మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో తీర్మానాన్ని సభలో చర్చకు పెట్టామన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బహిర్గతం చేయకుండా ఒక కుటుంబం తన దగ్గర దాచుకుని రాజకీయ అవసరమున్నప్పుడు ఆ వివరాలను వాడుకున్నదని ఆరోపించారు. ఆ సర్వే వివరాలను బయటపెట్టారా? అని ప్రశ్నించారు. బీసీ కులగణన విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. కులగణన తీర్మానంపై ప్రతిపక్షాలకు అనుమానముంటే సూచనలు సలహాలివ్వాలనీ, దానిపై ఏదైనా న్యాయపరమైన చిక్కులు వస్తాయనే అనుమానాలుంటే ప్రతిపక్షాలు సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప ఈ తీర్మానానికే చట్టబద్ధత లేదనేలా చర్చ చేయటం మంచిది కాదన్నారు. కుల గణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ సభ్యుడు కడియం శ్రీహరిని ఆయన పార్టీ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ తీర్మానం బలహీన వర్గాలను బలంగా తయారు చేయడమే తమ ఉద్దేశమనీ, బాధితులుగా ఉన్న వాళ్లను పాలకులుగా చేయాలన్నదే తమ ఆలోచన అన్నారు. ఆయా వర్గాలకు అండగా నిలబడాలంటే వారి లెక్కలు ఏంటో తెలియాలంటూ సుప్రీంకోర్టు వరకు చర్చలు జరిగాయని గుర్తు చేశారు. బలహీన వర్గాల లెక్కలు తేల్చి, వారి నిధులు, నియామకాల విషయంలో సహేతుకమైన వాటా ఇచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం 2011లో ప్రయత్నం చేసిందన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని తొక్కిపెట్టిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వచ్చి ఈ అంశంపై సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు.
కులగణనను తాము ఆహ్వానిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ చెప్పారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదని చెబుతూ.. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. చర్చ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ .. తీర్మానంలో జన, కులం, అంటూ ద్వంద వైఖరి కనిపిస్తోందనీ, జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదని గుర్తు చేశారు. కేవలం కులగణన మాత్రమే చేసే హక్కు రాష్ట్రాలకు ఉంటుందన్నారు. తీర్మానానికి చట్టబద్ధత కల్పించాలనీ, అది లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండబోదన్నారు. ఎన్నికల ముందు తీర్మానం చేసి దాని తర్వాత ఏం చేస్తారని ప్రశ్నించారు. కులగణన చేపట్టిన ప్రకారం తమకు రాజ్యాధికారం కావాలనీ, ఉద్యోగావకాశాలు కల్పించాలని గంగుల డిమాండ్ చేశారు.
సర్వే సర్వరోగ నివారిణి భట్టి
రాష్ట్రంలో కులగణన మాత్రమే కాదనీ, ప్రతి ఇంటి సర్వే నిర్వహించి వారి ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు…రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాలపై సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. తాము చేపట్టబోయే సర్వే వీటన్నింటికీ సర్వరోగ నివారిణిగా ఉండబోతోందని వివరించారు. ఆ సర్వే ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులకు పునాదిగా మారనుందని తెలిపారు. సర్వే విషయంలో బీఆర్‌ఎస్ సభ్యులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని చెప్పారు.
అక్కడ మాట్లాడలేకే ఇక్కడ…
ప్రతిపక్షాల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత తమదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గంగుల కమలాకర్ గత ప్రభుత్వంలో పదేండ్లు మంత్రిగా ఉండి బీసీల గురించి ఏమీ మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆ బాధనంతా ఇప్పుడు వెళ్లబోసుకుంటున్నారని తెలిపారు. ఎవరు ఏం చెప్పినా విని, తాము జవాబు చెబుతామని వ్యాఖ్యానించారు.
ఓబీసీలకు మంత్రిత్వశాఖ కావాలని కోరింది మేమే : కేటీఆర్
కులగణనపై అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టిన బిల్లును స్వాగతిస్తూ, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) అన్నారు. 2004లో కేంద్ర మంత్రి హౌదాలో తమపార్టీ అధినేత కేసీఆర్ ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోరారని గుర్తుచేశారు. దీనిపై రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు. అయితే బీహార్ తరహాలో న్యాయసమస్యలు తలెత్తకుండా, బిల్లు రూపొందించి, చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం జ్యుడీషియరీ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 2011లో చట్టం చేయకుండానే కులగణన జరిగిందనీ, చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. 2014లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఇప్పటి వరకు బయటపెట్టలేదని గుర్తుచేశారు. 2014 నుంచి 2023 వరకు తొమ్మిదిన్నరేండ్లలో బీసీల కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.23వేల కోట్లు అని చెప్పారు. ఎమ్‌బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీహార్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో కులగణనపై చట్టం చేయలేదనీ, ఎక్కడా న్యాయస్థానాలు స్టే విధించలేదని చెప్పారు.
అఖిలపక్షంతో నిర్వహించండి : కూనంనేని
ఇదే అంశంపై సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కులగణనపై విస్తృత చర్చ కోసం అఖిలపక్షాన్ని పిలవాలనీ, దానిలో బీసీ సంఘాలకూ ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. దేశంలో కార్పొరేట్ రంగం విస్తరించి, ప్రభుత్వ రంగం కుదించుకుపోతున్నదనీ, ఈ దశలో కులగణన ద్వారా జనాభా ప్రాతిపదికన ఎవరి వాటాలు ఎంతో తేల్చాల్సి ఉంటుందన్నారు. అదే సందర్భంలో క్రిమీలేయర్‌పై కూడా చర్చ జరగాలన్నారు. తీర్మానాన్ని బిల్లు రూపంలో తేవాలనీ, ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికగా నిర్ణయాలు జరగాలని చెప్పారు. అదే సమయంలో ఓసీల ఆర్థిక స్థితిగతుల్నీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ బీసీ జనగణనకోసం కమిషన్ ఏర్పాటు చేయాలనీ, చర్చించేందుకు అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలపై అసెంబ్లీలో తీర్మానాలు చేయలేదనీ, పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు భావించాల్సి వస్తుందన్నారు. 2014 ఆగస్టులో బీఆర్‌ఎస్ ప్రభుత్వ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని ప్రశ్నించారు. ముస్లింల ఆర్థిక స్థితిగతులపై గతంలో సచార్ కమిషన్, రంగనాథ్ కమిషన్లు అనేక నివేదికలు ఇచ్చాయనీ, వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. చిత్తశుద్ధితో కులగణన చేపడితే తొలుత న్యాయసలహా తీసుకోవాలని సూచించారు. కులగణన జరిగాక ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇదే అంశంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కాంగ్రెస్ సభ్యులు కే శంకర్, వాకాటి శ్రీహరి తదితరులు మాట్లాడారు. అనంతరం సభ్యుల సందేహాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానాలు ఇచ్చారు. సభ్యుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తీర్మానానికి ఆమోదం తెలపాలని కోరారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్మానం ఆమోదం పొందినట్టు ప్రకటించారు.