అటవీ అభివృద్ధి పేరుతో వ్యాపారం చేస్తున్న వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి…

నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ను (టీ ఎస్ ఎఫ్ డీ సీ) రద్దు చేసి ఆ భూములను పేదలకు పంచాలని కోరుతూ సోమవారం తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ కు “ఆదివాసీ జీవన విధానం” ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంస్థ సామాజిక కార్యకర్త,ప్రముఖ జర్నలిస్టు పి.క్రాంతి మాట్లాడారు.కొందరు తమకున్న ఆర్ధిక పలుకుబడిని,అధికారి సాధికారతను,రాజకీయ ఆసరా చేసుకొని చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకొని ఏజెన్సీ ప్రాంతంలోని అటవీ భూములను 1976 నుంచి అత్యంత కారుచౌకగా లీజుకు తీసుకుంటున్నారని ఆరోపించారు.కేవలం ఎకరం రూ.8 లు చొప్పున అటవీ శాఖ కు చెల్లిస్తూ అటవి అభివృద్ధి పేరిట వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. అశ్వారావుపేట మండల పరిదిలో సుమారు 4949 ఎకరాల భూములను గత 48 సంవత్సరాలుగా ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పోరేషన్ అనుభవిస్తుంది అని అన్నారు. ఈ భూముల్లో అటవీ అభివృద్ధి ఏమాత్రమూ జరగక పోగా ఆ భూముల్లో జామాయిల్,వెదురు వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తూ భూసారాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఉంటూ 1/70, పీసా చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. వీరి ఇన్నేళ్ళ వ్యాపారంలో ఏనాడూ ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి చూపింది లేదు.కనీసం విద్య, వైద్యం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ ప్రాంత వనరులు దోపిడీ చేస్తున్నారని అన్నారు. నిజానికి వీరు వ్యాపారంలో 10 శాతం ఈ ప్రాంతాల కోసం ఖర్చు చేసినా కోట్ల రూపాయల అభివృద్ధి జరిగి ఉండేదన్నారు.వీరి మూలంగా జీవ వైవిద్యం పూర్తిగా దెబ్బతింటుంది. వన్య ప్రాణులు,పక్షులు నిలువ నీడ లేక ప్రాణాలు కోల్పోతున్నాయి.భూమిలో ఉండే సహజ క్రిమికీటకాలు నశిస్తున్నాయి.దీని పర్యవసానం పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ప్రకృతి వైపరిత్యాలు ఏర్పడుతున్నాయి.వీరి లాభాల కోసం వారు సాగుచేసే పంటలకు ఎరువులు పురుగు మందుల వాడకం కూడా చేస్తూ బంగారం లాంటి అటవీ భూములను సర్వనాశనం చేస్తున్నారు. ఇది సమాజానికి ఏమాత్రమూ మంచిది కాదన్నారు. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు ఈ భూముల వ్యవహారంపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ కార్పోరేట్ వ్యాపారాన్ని తక్షణం నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలి కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు సోయం బాబూరావు( చిన్నారి), తాటి రవి, సోడె స్వరాజ్, సున్నం నాగరాజు పాల్గొన్నారు.
Spread the love