కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించండి

– సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా, నగర కార్యదర్శులు మిల్కూరి వాసుదేవరెడ్డి, గుడికందుల సత్యం
నవతెలంగాణ – కరీంనగర్ 
స్థానిక శనివారం వారసంతలో సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని, షాప్ టు షాప్, ప్రజలకు కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధి సాధించకుండా కేవలం మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుతుందని అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మారుస్తామని బాహాటంగానే చెబుతున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు ఎత్తివేస్తామని స్వయంగా బీజేపీ మంత్రులే వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారని అలాంటి బీజేపీని దేశం నుండి తరిమికొట్టాలని, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో 200 సీట్లు కూడా రావని అన్నారు. మోడీ నియంత పాలన నుండిభారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు.బీజేపీకి దేశం మీద ప్రేమ లేదని, వారికి ఉన్నదల్లా దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అమ్ముకోవడమేనని, నిజమైన దేశద్రోహులు బీజేపి నాయకులేనని అన్నారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన బీజేపీ, మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ, దేశభక్తి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనని ఢిల్లీలో 750 మంది రైతులను చంపి కరీంనగర్ లో బండి సంజయ్ రైతు దీక్ష చేయడం సిగ్గుచేటు అన్నారు.
నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ
కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని, గ్రానైట్ ఇసుక మాఫియా వద్ద వేల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని అన్నారు. హిందూ బాంధవుడిగా చెప్పుకుంటూ హిందూ ఆలయాల గాని హిందూ ప్రజలకు గాని అతను చేసింది ఏమి లేదని, బీజేపీ ప్రభుత్వ హయాంలో నిత్యవసర సరుకులు ధరలు రోజురోజుకు పెంచుతూ, పేద సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిస్తున్నారని అన్నారు. యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, అధికారంలోకి వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు కూడా కనిపించలేదని, నిరుద్యోగం ఆకలి చావులు పెరగడానికి బీజేపీనే ప్రధాన కారణం అన్నారు. బండి సంజయ్ కరీంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు లేకుండా, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కి నిధులు లేకుండా, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయకుండా మత రాజకీయాలు చేస్తున్నారని, ఈసారి వెలిచాల రాజేందర్ రావుకు ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించి, మతోన్మాద బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, నరేష్ పటేల్, నాయకులు వడ్ల రాజు, గజ్జల శ్రీకాంత్, గాజుల కనకరాజు, కండె రాజు, ప్రకాష్, వంశీ, భోగేందర్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు కమ్రుద్దీన్, డిసిసి ఉపాధ్యక్షులు శ్రీరాముల రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు
Spread the love