సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ ను గెలిపించండి : బండ శ్రీశైలం

– చండూర్ మున్సిపల్ పట్టణంలో ప్రచారం  
నవతెలంగాణ – చండూరు 
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి  ఎండి. జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం చండూరు మున్సిపల్ పట్టణంలో, మండలంలోని శిర్ద పల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన   మాట్లాడుతూ.. జహంగీర్ గత 35 ఏళ్లుగా పార్టీలో నిస్వార్ధంగా పనిచేస్తూ  అనునిత్యం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నట్లు గుర్తు చేశారు. చట్టసభల్లో వామపక్ష అభ్యర్థులు లేకపోతే రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఎండి జహంగీర్ ను ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీతో, ప్రశ్నించే గొంతును, పార్లమెంటుకు పంపాలని ఆయన ప్రజలను కోరారు.విద్యార్థి దశ నుండి ప్రజల మధ్యన ఉంటూ, ప్రజల పక్షాననిస్వార్ధంగా నిలిచి, అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టి, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేసి,  ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండి పోరాడే వారని అన్నారు. సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి, ఎస్ ఎల్ బీసీ, ఉదయ సముద్రం, బస్వపురం, గంధ మల్ల దేవాదుల, ప్రాజెక్టులు పూర్తి చేయాలని, విద్య, వైద్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై, పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆయనకు, సీపీఐ(ఎం) కు ఉందన్నారు. ఈ నియోజకవర్గంలో, భిన్న పార్టీల అభ్యర్థులు  పోటీ చేస్తున్నప్పటికీ, వారు స్వార్థ ప్రయోజనాల తప్ప, ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర లేదని, డబ్బులతో  ప్రజలను తప్పుతోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలనే, ప్రయత్నం చేస్తున్నారని  ఆయన అన్నారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహించి, ఐదేండ్లుమన భవిష్యత్తును నిర్ణయించే  ఓటును, ప్రజల మధ్యన ఉంటూ  ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎండి. జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్,  చిట్టి మల్ల లింగయ్య, ఈరటి వెంకన్న, నారపాక శంకర్,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love