తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా…

– ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం: మంత్రి కోమటిరెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
దేశ రాజధానిలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ పునర్విభజన చట్టం ప్రకారం పూర్తయినట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈమేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలుగు రాష్ట్రాలకు లేఖ పంపినట్టు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంలో భాగంగా ఆప్షన్‌-జీకి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని వివరించారు. ఆస్తుల విభజన వేగంగా పూర్తయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. నిరంతరం ప్రత్యేక శద్దతో పనిపూర్తిచేశామన్నారు. కేసీఆర్‌ సర్కారు పదేండ్లు అధికారంలోకి ఉండి చేయలేని పనిని, మూడు నెలల్లో కాంగ్రెస్‌ పూర్తి చేసిందని గుర్త చేశారు. ఈ విభజనతో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని అన్నారు. ఢిల్ల్లీలో ఇక తెలంగాణ భవన్‌ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ వాదనను బలంగా వివరించడం మూలంగా వేగంగా అనుమతులు సాధించినట్టు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ భవన్‌ నిర్మాణం చేస్తామని మంత్రి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love