మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
నవతెలంగాణ – కామారెడ్డి
మానవ మనుగడకు నీరే జీవాధారమని, వర్షించే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “క్యాచ్ ది రెయిన్ – వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్” కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పడే ప్రతి వర్షపు బొట్టును వృథా చేయకుండా ఒడిసిపట్టి, సరైన పద్ధతుల్లో సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు.
వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగి, భావి తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులకు నీటి విలువ బాగా తెలుసని, ఒక్క వర్షపు చుక్క కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తారని గుర్తు చేశారు. నీటి విలువను ప్రతి ఒక్కరూ గుర్తించి, దాన్ని ఆదా చేసే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలల్లో, కుటుంబ సభ్యులు ఇండ్లల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. నీటిని వృథా చేయకుండా కాపాడటం ద్వారా భవిష్యత్ తరాలకు విలువైన సంపదను అందించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, కమిషనర్ పర్వతాలు, డి.ఈ. హన్మంత్ రావు, టి.పి.ఓ. వినీత్, హెడ్‌మాస్టర్ గంగా కిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



