సమాజాన్ని చదువుదాం

Let's study society.సమాజంలో రోజురోజుకు సామాజిక శాస్త్రానికి విలువ తగ్గిపోతోంది. వాస్తవానికి సమాజంలో మానవ మనుగడ గూర్చి క్లుప్తంగా వివరించేది సామాజిక శాస్త్రం. మానవుల మధ్య సంబంధాలు, సంప్రదాయాలు, సంస్కృతీ, కట్టుబాట్లను తెలుపుతూ పరిణామ క్రమంలో భాగంగా సామాజిక పరిణతి ఎలా చెందుతుంది? బంధాలు అనుబంధాల వల్ల కలిగే లాభాలేంటీ? పరిస్థితులను బట్టి మనిషి ఆలోచనారీతిలో మార్పులెలా వస్తాయి? వాటినెలా నియంత్రించుకోవాలి? అసలు మనిషి మనిషిలా జీవించడానికి ఏం చేయాలి? అని తెలియజేసేదే సామాజిక శాస్త్రం. ఈ శాస్త్ర అవసరం సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అలాంటి విషయాలకు నేటి యువతను మనం దూరం చేస్తున్నాము.
పోటీ ప్రపంచంలో పిల్లలను పుస్తకాలను బట్టి పట్టే మిషన్‌లా తయారు చేస్తున్నారు. పాఠశాల, కళాశాల యాజమాన్యాలే కాదు చివరకు తల్లిదండ్రులు కూడా ఆ మాయలో పడిపోయారు. ర్యాంకులు, మార్కులంటూ వారిపై ఒత్తిడి తెచ్చే తల్లిదండ్రులే నేడు ఎక్కువగా ఉన్నారు. చదువంటే సైన్స్‌, మ్యాథ్స్‌ అనేలా ఇంజనీర్స్‌, డాక్టర్స్‌ కావడమే లక్ష్యంగా పెడుతున్నారు. ఆ చదువులకు విలువ పెరగడం మూలంగా ఆర్ట్స్‌ లాంటి కోర్సులకు క్రమంగా ప్రధాన్యత తగ్గుతున్నది. విద్యార్థి దశలోనే తీవ్ర ఒత్తిడికి లోనవుతూ, పరీక్షలలో అనుకున్నన్ని మార్కులు రాలేక, పోటీ పరీక్షలలో సరైన ర్యాంక్‌ రాక, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వెనుకాడటం లేదు.
ప్రపంచంలోనే మన దేశానికి ఒక విశిష్ట స్థానం ఉంది. దీనికి కారణం మనదేశంలోని సంస్కృతీ, సంప్రదాయాలు, విలువలు, జానపదరీతులు, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండటం. వీటి గురించి తెలిపేదే సామాజిక శాస్త్రం. సమాజ పరిణామ దశలను, సమాజంలోని మానవ సంబంధాలను, సమాజ మనుగడను, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలను వివరిస్తుంది. సమాజ మనుగడ క్రమంగా, సరైన రీతిలో కొనసాగాలంటే సమాజంలోని అంతర్గత సంబంధాలు, సంస్కృతీకరణ, సామాజీకరణ ఏ విధంగా జరుగుతుందో తెలుపుతుంది.
ప్రపంచీకరణలో భాగంగా పాశ్చాత్యీకరణ మూలంగా క్రమేణా మన దేశంలో విపరీతమైన మార్పులు వచ్చేశాయి. దీని ప్రభావం మన విద్యావ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది. అందుకే సమాజ శాస్త్రానికి క్రమంగా గుర్తింపు కనుమరుగవుతుంది. రాబోయే కాలంలో మనదేశంలో పెనుమార్పులు సంభవించి పల్లె, పట్టణ సంస్కృతి మన రాబోయే తరాలకు తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోతుందా అనే అనుమానం వస్తుంది.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో పెనుమార్పులు సంభవించి, రోజుకో ఆవిష్కరణతో శారీరక శ్రమకంటే మానసిక ఆలోచనకే ఎక్కువ విలువనిస్తున్న పోటీ ప్రపంచం, టెక్నాలజీకి సంబంధించిన పలురకాల నూతన కోర్సులు పుట్టుకొచ్చాయి. అయినప్పటికీ బ్రిటిష్‌ వారి నుండి మన దేశాన్ని కాపాడిన స్వాతంత్ర యోధుల చరిత్ర గురించి పాఠశాల చదువులో మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అలాగే మన ఉమ్మడి కుటుంబాలు, విలువలు, జానపద రీతులు, సంస్కృతిలో పలు మార్పులు సంభవించినప్పటికీ వాటి వల్ల మనకు కలిగిన ఉపయోగాలు రాబోయే తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మన పాలకులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీనికోసం పాఠశాలలతో పాటు కళాశాలల్లో కూడా సమాజ శాస్త్రాన్ని బోధనాంశంగా పెట్టే ప్రయత్నం చేయాలి.

Spread the love