ఓటమి నుండి పాఠాలు

ఓటమి నుండి పాఠాలు‘ఏడు ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కానీ.. ఎనిమిదోసారి విజయం మనదేనన్న కసితో ముందుకెళ్లాలి’ అని. ఇప్పుడు మనందరం ఉపయోగించుకుంటున్న విద్యుత్‌ బల్బు తయారీ కోసం థామస్‌ అల్వా ఎడిసన్‌ పడిన తపన దీనికి ఓ చక్కని ఉదాహరణ. విద్యుత్‌ బల్బు నుంచి వెలుతురు చూసేందుకు థామస్‌ ఎడిసన్‌ దాదాపు 3,000 ప్రయత్నాల్లో విఫలమయ్యారు. అయినా ఆయన తన ప్రయత్నాలను ఆపలేదు. ఆఖరికి అనుకున్నది సాధించారు.
ఓటమి… ఇది లేకపోతే విజయం లేదు. విజయం విలువ తెలియాలంటే ఓటమి తప్పని సరి. నిజం చెప్పాలంటే పరాజయాలు మన జీవితంలో భాగం. వాటిని చూసి మనం భయపడాలా? అవి పలకరిస్తే కుంగిపోవాలా? ఈ ప్రశ్నలకు సమాధానం మనందరికీ తెలుసు. కానీ అంగీకరించడానికి చాలా ఇబ్బంది పడతాం. పసి ప్రాయంలో ఒక్క అడుగు వేయలేక కిందపడ్డ వాళ్లే.. నేడు ఎవరెస్టు శిఖరాన్ని తమ కాళ్లకింద చూసుకుని ఆనందిస్తున్నారు. కనుక పరాజయాలు ఉన్నది మనకు పాఠం నేర్పటానికే. ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులు చాలామంది అలాంటి పాఠాలు నేర్చుకున్నవారే.
జే.కే. రౌలింగ్‌ రాసిన హ్యారీ పోటర్‌ నవల ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనసవం లేదు. కానీ.. హ్యారీ పోటర్‌ మొదటి నవల 12 సార్లు తిరస్కరణకు గురైంది. అయినా ఆమె ఏ మాత్రం కుంగిపోలేదు. పైగా ఆ తిరస్కరణలే రౌలింగ్‌కు పాఠం నేర్పాయి. అలాగే అమెరికన్‌ రచయిత స్టీఫెన్‌ కింగ్స్‌ రచించిన మోస్ట్‌ పాపులర్‌ నవల క్యారీ 30 సార్లు తిరస్కరణకు గురైంది. ఇలా వైఫల్యాలు విజయానికి మార్గం చూపుతాయి. శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు తమ అనుభవపూర్వకంగా చెప్పే మాట ఇది.
అందుకే పెద్దలు అంటారు ‘ఏడు ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కానీ.. ఎనిమిదోసారి విజయం మనదేనన్న కసితో ముందుకెళ్లాలి’ అని. ఇప్పుడు మనందరం ఉపయోగించుకుంటున్న విద్యుత్‌ బల్బు తయారీ కోసం థామస్‌ అల్వా ఎడిసన్‌ పడిన తపన దీనికి ఓ చక్కని ఉదాహరణ. విద్యుత్‌ బల్బు నుంచి వెలుతురు చూసేందుకు థామస్‌ ఎడిసన్‌ దాదాపు 3,000 ప్రయత్నాల్లో విఫలమయ్యారు. అయినా ఆయన తన ప్రయత్నాలను ఆపలేదు. ఆఖరికి అనుకున్నది సాధించారు.
వాల్ట్‌ డిస్నీ స్థాపించిన తొలి యానిమేషన్‌ సంస్థ న్యూమాన్‌ లాఫ్‌-ఓ-గ్రామ్‌. 1920లో ఆ సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఎంతగా అంటే కనీసం అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు తినేందుకు తిండి లేక కడుపు నింపుకునేందుకు బలవంతంగా కుక్క మాంసాన్ని తినేవాడట వాల్ట్‌ డిస్నీ. అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన 1966లో చనిపోయే నాటికి దాదాపు 32 వేల కోట్ల రూపాయలు సంపాదించారు.
ఇవన్నీ వ్యక్తిగత విజయాలు. అలాగే సమాజంలో సామూహిక విజయాల కోసం తపించే ఉద్యమకారులు సైతం ఎందరో ఉన్నారు. మహిళలు సమానత్వం కోసం, హింసలేని సమాజం కోసం ఏండ్లుగా పోరాడుతూనే ఉన్నారు. శ్రామికులు శ్రమకు తగ్గ వేతనం కోసం అడుగుతూనే ఉన్నారు. కానీ సాధించలేకపోతున్నారు. అయినా పట్టు సడలకూడదు. పోరాటం ఆపకూడదు. విజయం వచ్చే వరకు అలుపు లేకుండా పోరాడుతూనే ఉండాలి.
పైన చెప్పుకున్న ఉదాహరణల్లో తమ విజయం కోసం వ్యక్తులే కుంగి పోకుండా పోరాడుతున్న తరుణంలో సమూహాలు అలసిపోరాదు. ప్రజలు స్పందించడం లేదనో, పోరాటానికి కదలడం లేదనో వారిని నిందించరాదు. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రజలను చైతన్యం చేయడం కాస్త కష్టమే. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తధ్యం. కనుక మరింత పదునైన నినాదాలతో అడుగులు ముందుకే వేయాలి. సమరయోధులు దేశానికి స్వాతంత్య్రం కోసం అలుపెరుగక రెండు వందల ఏండ్లు పోరాటం చేశారు. కనుకే ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. కనుక పోరాటం కొన్నిసార్లు విఫలం కావొచ్చు. అయితే వైఫల్యం తర్వాత వచ్చే గెలుపు ఇచ్చే కిక్కే వేరు. ఆ కిక్కు కోసం.. మధ్య మధ్యలో పలకరించే పరాజయాల నుంచి వీలైనన్ని కొత్త విషయాలు, పాఠాలూ నేర్చుకుంటూ సాగిపోవాల్సిందే.

Spread the love