రుచికి రుచి… ఉపాధికి ఉపాధి…

Taste for taste... employment for employment...ఎక్కడికివెళ్లినా రోడ్డుపై టిఫిన్‌ సెంటర్ల నుంచి మినీ ‘స్ట్రీట్‌ హోటళ్ల’ దాకా ఎన్నో .. ధరలు తక్కువ.. ఉన్నంతలో రుచీ ఎక్కువే. అయితే స్ట్రీట్‌ ఫుడ్‌కు.. చాలా చరిత్రే ఉంది. ఎప్పటి నుంచో నగరాల్లోని వీధుల్లో ‘వేయించిన గింజలు, రొట్టెలు’ వంటివి అమ్మేవారట. పాత రుచులపై మొహం మొత్తిన కొద్దీ, జనం పెరిగిన కొద్దీ.. మెల్లగా కొత్త కొత్త రుచులు పుట్టుకొచ్చాయి. స్థానిక ఆచారాలు, ఆహార అలవాట్లను బట్టి ఎక్కడికక్కడ కొత్త వెరైటీలు మొదలయ్యాయి. అందుకే వీటిలో దొరికే రుచి పెద్దపెద్ద ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లోనూ లభించదు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆహార పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇక మన దేశంలో ఎన్నో రకాల ప్రత్యేకమైన, విభిన్నమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో స్ట్రీట్‌ఫుడ్‌కి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వీటి వద్ద కనిపించే జససందోహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ మధ్య బీటెక్‌ చారువాలీ దగ్గర్నుంచి, గ్రాడ్యుయేట్‌ పానీపూరీ వరకు.. ఎంతోమంది యువత సైతం స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్ముతూ తమకంటూ సొంత గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఏ వీధి చూసినా స్ట్రీట్‌ఫుడ్‌ వద్ద జనం కిటకిటలాడుతుంటారు.
వీధిలో నిలబడి ఓ కప్పు చారు, ఓ సాయంత్రం నాలుగు ప్లేట్ల పానీపూరీ విత్‌ ప్యాజ్‌, కాసింత చాట్‌.. బాగా వేయించిన ఫిష్‌ ఫ్రై.. గరం గరం మిర్చి బజ్జీలు, వేడివేడి ఇడ్లీలు, వావ్‌ అనిపించే వడాపావ్‌లు.. తినని సగటు జీవి ఉండడు. మన రోడ్లన్నీ ఘుమ ఘుమలాడే రెస్టారెంట్లే కదా.. మన కడుపు నింపి, వారి కడుపు నింపుకొనే నలభీములు తిరుగాడే ప్లేస్‌లే కదా.. పల్లె, పట్నం తేడా లేదు. వెజ్‌, నాన్‌ వెజ్‌ తేడాల్లేవు.
హైదరాబాద్‌ అనగానే గుర్తుకు వచ్చేది చార్మినార్‌, హుస్సేన్‌ సాగర్‌. అదే ఫుడ్‌ విషయానికి వస్తే.. ధమ్‌ బిర్యానీకి భాగ్యనగరం ఎంతో ఫేమస్‌. అలానే స్ట్రీట్‌ ఫుడ్‌ కు కూడా హైదరాబాద్‌ నగరం పెట్టింది పేరు. రోడ్డు సైడ్‌ ఫుడ్‌ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. ఇదే సమయంలో సోషల్‌ మీడియా యూజర్లకు ‘కుమారి’ అనే పేరు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. నెటిజన్లంతా ఆమెను అభిమానంగా కుమారి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆమె బాగా ఫేమస్‌ అయ్యారు. ఇన్‌ స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌ యూజర్లకు కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె చేతి వంటకు హైదరాబాద్‌లో చాలామందే ఫ్యాన్స్‌ ఉన్నారు. మరి మన దేశంలో తప్పకుండా రుచి చూడాల్సిన స్ట్రీట్‌ఫుడ్స్‌ ఏంటన్నది చూసేద్దామా..
షాజహాన్‌ చాట్‌ …
మొఘలుల కాలం నాటికి స్ట్రీట్‌ ఫుడ్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందట. షాజహాన్‌ ఆగ్రా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చినప్పుడు.. వర్తకులు, రోజువారీ పనిచేసుకునేవారు మధ్యాహ్నం కడుపు నింపుకోవడానికి వీలుగా ‘చాట్‌’ స్టాల్స్‌ను ఏర్పాటు చేయించాడని అంటారు. అలా మొదలైన ‘చాట్‌’ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.
గ్రీస్‌ .. ఫ్రై ఫిష్‌..
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. గ్రీస్‌ సామ్రాజ్యంలో పదివేల ఏళ్ల కిందే ‘స్ట్రీట్‌ ఫుడ్‌’ అమ్మకాలు మొదలయ్యాయట. ప్రధాన రహదారుల పక్కన ఫ్రై చేసిన చేప ముక్కలను అమ్మేవారట. తర్వాత ఇది రోమ్‌కు విస్తరించిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే నాడు ‘స్ట్రీట్‌ ఫుడ్‌’ ధనవంతులకేనని, వారు ఇళ్లలో వండుకోకుండా తెప్పించుకుని తినేవారని అంటున్నారు. తర్వాత నగరాలకు విస్తరించి, జనాభా పెరిగే కొద్దీ.. ‘స్టాల్స్‌’ పెరిగిపోయి పేదల ఫుడ్‌గా మారింది.
ఈజిప్ట్‌ బ్రెడ్‌..
క్రీస్తుపూర్వం 1200వ సంవత్సరం సమయంలోనే ఈజిప్ట్‌లోని సిర్సా నగర వీధుల్లో గోధుమ రొట్టెలను అమ్మినట్టు పురాతత్వ తవ్వకాల్లో గుర్తించారు.
స్టూడెంట్స్‌కు నంబర్‌ వన్‌
స్ట్రీట్‌ ఫుడ్‌ ఏనాడో భారత సంస్కతిలో, చరిత్రలో ఓ భాగమైపోయింది. మెల్లగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకూ విస్తరించింది. కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగులు, రోజువారీ పనిచేసుకునేవారు, ఏదో ఓ పనిపై బయటికి వెళ్లేవారు.. ఇలా అందరికీ ‘స్ట్రీట్‌ స్టాల్స్‌’తోనే కడుపు నిండేది. ఇలాంటి వారు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారో.. అలాంటి ప్రాంతాలన్నీ స్ట్రీట్‌ ఫుడ్‌కు అడ్డాలే.
ఇటీవల వారణాసిలో నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ విషయం స్పష్టమైంది. 25 – 45 ఏళ్ల మధ్య వయసువారిలో 42 శాతం, 14 -21 ఏళ్ల మధ్య వయసువారిలో 61 శాతం మంది ఉద్యోగులు, విద్యార్థులు మధ్యాహ్నం పూట ‘స్ట్రీట్‌ ఫుడ్‌’తోనే బండి లాగించేస్తామని చెప్పడం గమనార్హం.
రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌లో ఉన్న మహారాణా ప్రతాప్‌ వ్యవసాయ, సాంకేతిక వర్సిటీ విద్యార్థుల ‘స్ట్రీట్‌ ఫుడ్‌’ అలవాటుపై ఇటీవల ఓ సర్వే జరిగింది. రుచిగా, ధర తక్కువగా ఉండటం, త్వరగా తినేయగలగడం, స్నేహితులతో కలసి సరదాగా వెళ్లి తినడం వల్ల ‘స్ట్రీట్‌ ఫుడ్‌’కు ప్రాధాన్యత ఇస్తామని 88.3 శాతం మంది యువకులు, 90 శాతం మంది యువతులు వెల్లడించారు.
ఫుడ్‌ పెట్టే… స్ట్రీట్‌
స్ట్రీట్‌ఫుడ్‌ విక్రయించేవారు.. అందరి కడుపు నింపుతూ, తామూ పొట్ట పోసుకుంటున్నారు. మన దేశంలో స్ట్రీట్‌ ఫుడ్‌తో ఉపాధి పొందుతున్నవారు కోటి మంది వరకు ఉంటారని అంచనా. ఇందులో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోనే 60 లక్షల మంది దాకా ఉన్నారు. ఈ నగరాల్లో రోజూ ఓ పూట బయటే తిని బతుకు వెళ్లదీస్తున్నవారూ లక్షల మంది ఉన్నారు.
ఇలా అమ్మేవాళ్లు, తినేవాళ్లు కలసి దేశ ఆర్థిక వ్యవస్థ అభివద్ధికీ ఓ చెయ్యి వేస్తున్నారు. దేశంలో స్ట్రీట్‌ఫుడ్‌ రోజువారీ వ్యాపారం విలువ రూ.8 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే ఏడాదికి రూ.30 లక్షల కోట్లపైమాటే.
దేశంలో ప్రాంతాన్ని బట్టి 2 శాతం నుంచి 10 శాతం మంది జనాభా స్ట్రీట్‌ ఫుడ్‌, దానిపై ఆధారపడిన పనులతోనే ఉపాధి పొందుతున్నారు.
సాటి లేని వెరైటీ..
దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలనే తేడా లేదు.. సమోసాలు, మిర్చీలు, బజ్జీలు, పానీపూరీ, చాట్‌, ఇడ్లీ, దోశ వంటివాటితోపాటు కబాబ్‌లు, ఫ్రైడ్‌ రైస్‌లు, బిర్యానీల దాకా ‘స్ట్రీట్‌ స్టాల్స్‌’లో దొరకని వెరైటీలంటూ లేవు.
జిలేబీ వంటి స్వీట్లనూ అలా రోడ్డుపక్కన నిలబడి లాగించేయొచ్చు. స్ట్రీట్‌ ఫుడ్‌లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. ఏ నగరానికి ఆ నగరమే ప్రత్యేకం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోహా, జిలేబీ కాంబినేషన్‌ ఊరిస్తే.. ముంబైలో వడాపావ్‌ నోరూరిస్తుంటుంది. యూపీలో ఆలూ టిక్కీ ఆకర్షిస్తే.. కోల్‌కతా నగర వీధుల్లో చేపల ఫ్రై, కబాబ్‌ రోల్స్‌ రారమ్మని పిలుస్తుంటాయి.
ఒక అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకెల్లా ఇండియాలో ఫుడ్‌ వెరైటీలు ఎక్కువ. పదో, ఇరవయ్యో కాదు.. స్ట్రీట్‌ఫుడ్‌లోనే వందల రకాలు ఉన్నాయి మరి.
స్ట్రీట్‌ ఫుడ్‌ పండుగే..
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఏటా ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు జరిగే ‘నోయిడా ఉత్సవ్‌’ స్ట్రీట్‌ఫుడ్‌కు వెరీ స్పెషల్‌. ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్ట్రీట్‌ వెండార్స్‌ ఆఫ్‌ ఇండియా (నస్వీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవంలో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన విభిన్నమైన స్ట్రీట్‌ ఫుడ్‌లన్నీ అందుబాటులో ఉంటాయి.
ఆహా.. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..!
కోటీ విద్యలు కూటి కోరకే అన్నది సామెత. ఆ కూడె డబ్బు సంపాదించి పెడితే అంతకన్న ఇంకా ఏం ఉంటది. హైదరాబాద్‌ మహానగరంలో ఎంతో మంది ఆకలి తీర్చుతున్నాయి స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు. అతి తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రెటీ దాకా ఫుడ్‌ సెంటర్లకు క్యూ కడుతున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత మంచి భోజనం లభిస్తుందో. ఇటీవల సోషల్‌ మీడియాలో వీటి హవానే నడుస్తుంది. స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్ల నిర్వహకులు సైతం సెలబ్రెటీలు అయ్యారంటే వీటి క్రేజ్‌ ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగరంలో బిర్యానీ, ఇరానీ చారు, ఉస్మానియా బిస్కెట్స్‌, హలీం, చార్మినార్‌ వద్ద దొరికే గాజులకు ఎంతో పేరుంది. ఇపుడు వాటి సరసన స్ట్రీట్‌ ఫుడ్‌ వచ్చి చేరింది. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలైన కూకట్‌పల్లి, తార్నాక, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, యూసఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్‌, మోహిదీపట్నం, ఇలా మహానగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ సెంటర్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా ఐటీి హాబ్‌ ప్రాంతమైన మాదాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, శేరిలింగంపల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లో ఉదయం టిఫిన్‌ లతో ప్రారంభమై ఇపుడు భోజనం, సాయంత్రం స్నాక్స్‌, నైట్‌ డిన్నర్‌ల వరకు 24 గంటలు భోజన ప్రియుల కోసం రకరకాల స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఉద్యోగాలు చేసుకునే వారు, ఉద్యోగాల కోసం వచ్చేవారు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, వివిధ రకాలైన డెలివరీ బార్సు ఇలా అన్ని వర్గాల వారు స్ట్రీట్‌ ఫుడ్‌ టెస్ట్‌ చేయడమే కాదు, వాటితోనే ఓ పూట కడుపు నింపుకుంటున్నారు.
నమ్మకమే పెట్టుబడి..
స్ట్రీట్‌ ఫుడ్‌ నిర్వహకులు తమ ఇండ్లలోనే వంట చేసుకుని వచ్చి రోడ్లపై చిన్న టెంట్‌ మాదిరి కవర్లు కట్టి, నాలుగైదు కుర్చీలు వేసి ఫుడ్‌ సెంటర్లను నిర్వహిన్నారు. చదువు రాని వారే కాకుండా, పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఈ రంగాన్ని ఎంచుకొని స్వయం ఉపాధితో పాటు లక్షలు గడిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే ఫుడ్‌ సెంటర్ల నిర్వహకులకు కస్టమర్ల నమ్మకమే పెట్టుబడి. కస్టమర్‌ ఒకసారి ఫుడ్‌ సెంటర్‌కు వచ్చి తిన్నప్పుడు టెస్ట్‌ బాగుంటే చాలు ఇక ప్రతీ రోజు అక్కడికే వచ్చి తింటారు. తను తినడమే కాకుండా ఇతరులకు చెప్పుతారు. దాంతో మౌత్‌ టాక్‌ ద్వారా ఫుడ్‌ సెంటర్లకు ప్రచారం జరుగుతోంది. అదే వారికి కస్టమర్లను తెచ్చి పెట్టడమే కాకుండా లాభాలను చేకూర్చుతోంది. ఇదిలా ఉంటే ఈ సెంటర్ల నిర్వహణకు పెద్దగా డబ్బులు కూడా ఖర్చు కావు. అద్దెలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే కరెంట్‌ బిల్లుల ఇబ్బంది ఉండదు. పెద్ద, మధ్యతరగతి హోటల్‌కు వెళ్లినా భోజనం రేట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా వెరైటీ ఫుడ్‌కు ఇంకాస్త ఎక్కువ రేట్లుంటాయి. దీనికి తోడు బిల్లుతో పాటు సెంట్రల్‌, స్టేట్‌ జీఎస్టీ బిల్లు కూడా కట్టాల్సి ఉంటుంది. అదే స్ట్రీట్‌ ఫుడ్‌ వద్ద అయితే ఇవేవి ఉండవు. పైగా అదనంగా పెట్టినా అదనపు బిల్లు అడగరు. కాబట్టే స్ట్రీట్‌ ఫుడ్స్‌కు అంత డిమాండ్‌ ఉంది. అలాగే నిర్వహకులకు కూడా కొంత డబ్బు ఆదా అవుతోంది.
ఫుడ్‌ సెంటర్లలో లభించే వంటకాలు..
స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లలో ముఖ్యంగా వెజ్‌తోపాటు నాన్‌వెజ్‌ లభిస్తోంది. వెజ్‌లో పప్పు, చారు, టమట, ఇతర వంటకాలు ఉంటాయి. అలాగే నాన్‌వెజ్‌లో చికెన్‌, మటన్‌, తలకాయ, ఫిష్‌తోపాటు లీవర్‌ ఫ్రై, బొటీ ప్రై వంటకాలు లభిస్తాయి. వెజ్‌ అయితే రూ.70 నుంచి 80వరకు ఉంటుంది. నాన్‌ వెజ్‌ అయితే రూ.100 నుంచి 150 వరకు కర్రీలను బట్టి ఛార్జి చేస్తారు.
ఎందరికో ఉపాధి
స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. యువత, సాధారణ గృహిణులు, చదువుకొని ఒకరి కింద పనిచేయలేక స్వయం ఉపాధితో బతకాలనుకునే వారు ఈ రంగంలోకి వస్తున్నారు. మంచి లాభాలతో పాటు గుర్తింపు పొందుతున్నారు. వ్యాపారం బాగా నడిస్తే వారు మరికొందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. ఇలా స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించడానికి స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు ఉపయోగపడుతున్నారు.
సామాన్యుడి నుంచి సెలబ్రెటీ దాకా…
ఇటీవల కాలంలో స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్ల పేర్లు మారుమోగాయి. ఎక్కడ మంచి ఫుడ్‌ లభిస్తుందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం వస్తుందో ఆ ప్రాంతానికే సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఫుడ్‌ సెంటర్లకు వస్తున్నారు. పెద్ద సంఖ్యలో సెలబ్రెటీ ఇక్కడికి వచ్చి మరీ వారికి కావాల్సిన ఫుడ్‌ను తింటున్నారు. వారు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారుతున్నాయి. దాంతోపాటు ఫుడ్‌ సెంటర్ల నిర్వహకులకు ప్రచారం జరుగుతోంది. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో చూసిన వారు ఫుడ్‌ టెస్ట్‌ చేయడం కోసమైనా ఇతర జిల్లాలు, హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్ల వద్దకు వస్తున్నారు.
సోషల్‌ మీడియాలో కుమారీ అంటీ హల్‌చల్‌
ఐటీ హబ్‌ ప్రాంతంలోని మాదాపూర్‌లో కుమారీ అంటీ ఆమె మహిళా స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఆమె వద్ద ఫుడ్‌ చాలా బాగుంటుంది. అనేక ఫుడ్‌ ఐటెంలు ఆమె వద్ద ఉంటాయి. అయితే ఇటీవల ఆమె సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ఆమె ఫుడ్‌ సెంటర్‌కు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వచ్చి తింటుంటారు. సెలబ్రెటీలు రావడంతో కుమారీ అంటీ క్రేజ్‌ మరింత పెరిగింది. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సామాన్యులు సైతం ఫుడ్‌ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమె సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో యూట్యూబ్‌ ఛానల్స్‌తో పాటు ఇతర మీడియా ఛానల్స్‌ సైతం ఆమెను ఇంటార్వ్యులు చేయడం, ఆమె ఫుడ్‌ కోర్ట్‌ గురించి మీడియాలో పెట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో పోలీసులు ఆమె సెంటర్‌ను మూసి వేశారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఆమెకు అండగా ఉంటామని, ఆమె ఫుడ్‌ సెంటర్‌కు వచ్చి భోజనం చేస్తానని ప్రకటించాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె ఫుడ్‌ సెంటర్‌కు ఎంత క్రేజ్‌ ఉందో. స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఎందరివో ఆకలి తీర్చుతున్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్నాయి. ఇప్పటి వరకు స్ట్రీట్‌ ఫుడ్‌ టెస్ట్‌ చేయకుంటే ఒకసారి వెళ్లి మీరు కూడా స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్‌లో భోజనం చేయండి.
– ఎ. అజయ్ కుమార్‌,
8297630110 

Spread the love