నాటకం

నాటకంకళాకారులకు నాటకం ఎప్పుడయితే బువ్వ పెట్టలేకపోతుందో అప్పుడు కచ్చితంగా వారు బుల్లితెర వైపో, వెండితెర వైపో చూస్తారు. అందుకని వారిని తప్పు పట్టలేం. ఒకనాటి కన్యాశుల్కం, మాభూమి, రక్తకన్నీరులా ఎగబడి చూడదగ్గ నాటకాలు ఎన్ని వస్తున్నాయన్నది కూడా ప్రశ్న. ఇటీవలి సంవత్సరాల్లో ‘పడమటి గాలి’, ‘అంబేడ్కర్‌’, ‘వేమన’ వంటి నాటకాలు ఎక్కువగా ప్రదర్శితమయ్యాయి. ఒక ఉద్యమంలా చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇలా నిరంతరాయంగా ఊరుఊరునా నాటకాలు ప్రదర్శితం కావాలి. ఇందుకోసం ఊళ్ళల్లో ప్రదర్శనకు అనువైన ధియేటర్లు ఉండాలి.
నాటకం అనేక కళల సమాహారం. సంగీతం, సాహిత్యం, నటన, వేషము, భాషణం అన్నీ కలిసి, వీక్షకుల మదిని కదిలింప చేసేది నాటకమే. సజనాత్మక జీవితానికి ఆలంబన నాటకం. సకల కళారూపాల వికాసానికీ, విస్తతికీ మూలం నాటకం. విభిన్నకళల్ని తనలో ఇముడ్చుకొని విరాట్‌రూపంతో దర్శనమిస్తున్న సినిమాకు సైతం మూలం నాటకమే. తెలుగునాట సినిమా నటీనటులుగా పేరొందిన తొలితరమంతా నాటకరంగ నేపథ్యం నుంచి వచ్చినవారే. సినిమా నాటకాన్ని మింగేసిందనే మాటలో వాస్తవం లేకపోలేదు . కానీ, నాటకరంగ మూలాల్ని మరిస్తే సినిమా బతకదు అన్న మాట కూడా వాస్తవమే. ఆ మూలాల్ని గుర్తించడం, కాపాడుకోవటం బాధ్యతగా భావించాలి. తెలుగు నేల మీద నాటకం ఆడుతోంది. కానీ జన జీవితాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనంగా నాటకం లేకపోవడం విచారకరం. ప్రజల సజనాత్మక జీవితంలో ఇది ఎందుకో అంతర్భాగం కాలేదు. కొందరి అభిరుచులకే పరిమితమైంది. దీనికీ సినిమా, టీవీ, ఇంటర్‌నెట్‌ వంటి సాధనాలే కారణమని చెప్పలేం. వీటిలాగా నాటకం ప్రజల సాంస్కతిక జీవితంలో భాగం కాలేకపోవడానికి గల కారణాల్ని మాత్రం తప్పక వెతకాల్సిన అవసరం ఉంది.
పరిషత్‌ల, ప్రభుత్వాల ప్రోత్సాహంతోనే నాటకం మనుగడ సాగించదు. ‘సురభి’లా నిత్యం నాటకాల్ని ప్రదర్శించే సంస్థలుండాలి. సినిమాకు బదులుగా నాటకం చూడటానికి వెళ్ళాలనే తపన జనాల్లో ప్రోది చేయాలి. ఇందుకోసం ప్రమాణాల ఉన్నతీకరణ అవసరం. నాటకం పఠనయోగ్యం కన్నా ప్రదర్శనా యోగ్యమైందన్న విషయం గుర్తించాలి. ఆధునిక సాంకేతిక ప్రజ్ఞను ఉపయోగించుకుంటూ నాటక శిల్పం, విలువలు మెరుగుపడాలి. ఈ దిశగా విమర్శ, ఆత్మవిమర్శ అవసరం. విశ్వవిద్యాలయాల్లో రంగస్థలశాఖలున్నాయి. కాని, అవి సినిమాలకు అవసరమైన వారిని తయారు చేసే సంస్థలుగా రూపాంతరం చెందడం విషాదం. రంగస్థలశాఖలు కేవలం అలంకారప్రాయంగా కాక ప్రజ్ఞాపాటవాలతో కూడిన వారిని తయారు చేస్తే మంచిది.
శాకుంతలంలోని శ్లోక చతుష్టయంలానే దేశంలోనూ ఓ దుష్ట చతుష్టయమూ నాటకమాడుతున్నది. వారు మాటలలో. హావభావాలలో నవరసాలను పలికించగల ద్రష్టలు. విద్వేషాలను రెచ్చగొట్టటం, ఆశ్రితులకు లాభాలు చేకూర్చటం, ఉద్వేగాల ఆధారంగా మనుషుల మధ్య చిచ్చురేపటం వీరి కళానైపుణ్యాలు. ఈ నాటకంలో సత్యం హత్య చేయబడుతుంది. వాస్తవం వక్రీకరించబడుతుంది. నాటకంలో మనుషుల సారం కాక, అధికారం విలయతాండవం చేస్తుంది. అందుకే ప్రజల ముందు నాటకాలేస్తున్న వారి నిజస్వరూపాన్ని తెలుసుకుని చైతన్యమయితేనే మన బ్రతుకు పాత్ర సజావుగా కొనసాగుతుంది.
కళాకారులకు నాటకం ఎప్పుడయితే బువ్వ పెట్టలేకపోతుందో అప్పుడు కచ్చితంగా వారు బుల్లితెర వైపో, వెండితెర వైపో చూస్తారు. అందుకని వారిని తప్పు పట్టలేం. ఒకనాటి కన్యాశుల్కం, మాభూమి, రక్తకన్నీరులా ఎగబడి చూడదగ్గ నాటకాలు ఎన్ని వస్తున్నాయన్నది కూడా ప్రశ్న. ఇటీవలి సంవత్సరాల్లో ‘పడమటి గాలి’, ‘అంబేడ్కర్‌’, ‘వేమన’ వంటి నాటకాలు ఎక్కువగా ప్రదర్శితమయ్యాయి. ఒక ఉద్యమంలా చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇలా నిరంతరాయంగా ఊరుఊరునా నాటకాలు ప్రదర్శితం కావాలి. ఇందుకోసం ఊళ్ళల్లో ప్రదర్శనకు అనువైన ధియేటర్లు ఉండాలి. దీనికి సామాజిక, సాంస్కతిక, సాహిత్య ఉద్యమాల తోడ్పాటు తప్పనిసరి. మరీ ముఖ్యంగా ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’ లాంటి సంస్థలు ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రలోనూ ఏర్పడాలి. ఇది సంకల్పం కావాలి. నాటకరంగం ఇవాళ ఉన్న స్థితిగతులపైన విస్తతచర్చ జరగాలి. సినిమా ఉంటుంది. సినిమాతోపాటు నాటకం కూడా బతకాలి. నిలవాలి. కొనసాగాలి. నాటకమే జీవితంగా, రక్తనాళ స్పందనగా భావించే తరాన్ని తయారు చేసే దిశగా నాటకరంగంలో అనుభవజ్ఞులయిన పెద్దలు, అధ్యాపకులూ ఆలోచించాలి. ఈ వైపుగా రంగస్థలం మీద ఆరోగ్యకరమైన చర్చకు దారితీసే సంభాషణలు ఇప్పటి అవసరం.

Spread the love