అవును. అంతా నాటకమే.

అవును. అంతా నాటకమే.(మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం)
అవును. అంతా నాటకమే. లోపల ఒకటి. బయటకు ఒకటి. అబద్దం బ్రతుకు అవుతున్నప్పుడు నాటకం విస్తరిస్తుంది. జీవితంలో జీవితం లుప్తమై పోతున్నప్పుడు జీవితాన్ని నాటకం ఆక్రమిస్తుంది. బ్రతకనేర్వడం అంటే ఇదేనేమో! ఉదరపోషణార్ధం బహుకృత వేషం అని ఏనాడో చెప్పారుగా మన పెద్దలు.
అబద్దం ఎంతగా విస్తరిస్తున్నదంటే, కళాశాలకు వెళ్లకుండానే, ఆ చదువులతో ఎలాంటి సంబంధం లేకుండానే డిగ్రీలు సాధిస్తున్న రోజులివి. ఎవరో సాధారణ మనుషులే కాదు, దేశాధినేతలు సైతం ఈ అక్రమాలకు వడిగడుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా మరి. యాధారాజా తథా ప్రజా అన్నారు కదా అదే పెద్దలు.

ప్రతి రోజూ అబద్దాలు తింటూ, అబద్దాలు తాగుతూ, అబద్దాల గాలి పీలుస్తూ వుంటే నిజం ఎక్కడ మిగులుతుంది? కచ్చితంగా చస్తుంది. కాదు మనకు మనమే సత్యాన్ని హత్య చేస్తున్నామా? అనే భయం వెంటాడుతుంది. ‘జీవన్నాటకం అంటే ఇదేకదా!’ అని సమర్ధించుకునేవారికి కొదవే లేదు. జీవితాన్ని నాటకాన్ని వేరు చేయలేం. రేయి పగలులాగ, చావూ పుట్టకల్లాగ కలిసే వుంటాయని కితాబు ఇచ్చుకునేవారూ లేకపోలేదు.
అయితే ఇక్కడ జీవితంలో అంతర్లీనంగా ప్రవహించే నాటక మౌలిక లక్షణాన్ని మనం గ్రహించాలి. సహజమైన మానవీయ సంబంధాలతో పెనవేసుకు పోయిన జీవన రసభావాలు సత్యం శివం సుందరంలా ఆవిష్కృతమవుతాయి. అందుకే మహాకవి శ్రీశ్రీ ”అందమె ఆనందం – ఆనందమే జీవిత మకరందం” అని తేల్చి చెప్పాడు. సత్యాన్వేషణే కాదు, ఆ సత్యాన్ని అంటే నిజాన్ని నిర్భయంగా చూపడమే నాటకం కర్తవ్యంగా అనాదిగా ముందుకొచ్చింది. భవిత పట్ల, మానవజాతి పట్ల, ప్రకృతి పట్ల, పురోగతి పట్ల అచంచల విశ్వాసం పాదుకొల్పేందుకు నాటకానికి వున్న చరిత్ర అపారం. అంతటి అత్యున్నత స్థానం అధిష్టించింది కనుకనే భరతముని నాట్యశాస్త్రాన్ని పంచమవేదంగా అభివర్ణించాడు.
నాటకం సర్వకళల సమాహారంగా విరాజిల్లి, జీవితానికి ప్రతిరూపంగా నిలవడానికి తార్కాణమిదే.
అయితే నేడు మన ప్రజాస్వామ్య దేశంలో ఫాసిస్టు మతోన్మాద పెట్టుబడిదారీ వ్యవస్థ సకల రాజ్యాంగ విలువలతో పాటు మానవ విలువలను సైతం ధ్వంసం చేస్తున్న తరుణంలో మనం జీవిస్తున్నాం. ఈ దశలో నాటకంపై ఎంతో జాగరుకత, శ్రద్ధ, అవశ్యం. ఎందుకంటే నాటకం నడుస్తున్న కాలానికి ప్రతినిధి అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అందుకే విశ్వకవి రవీంద్రుడు నాటక కళాభ్యుదయం ఆధారంగానే ఒక జాతి యొక్క సాంస్కృతిక ఔన్నత్యం నిర్ణయించవచ్చని పేర్కొంటాడు.
ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని 1961లో తొలుత ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇస్టిట్యూట్‌ (ఐ.టి.ఐ) నిర్వహించింది. ఆ తర్వాత ప్రతి ఏడాది మార్చి 27ను దేశదేశాల్లోని నాటక ప్రియులు, నాటక స్రష్టలు, నాటక కార్యకర్తలందరూ దీనిని ఒక ఆనవాయితీగా శ్రద్దగా జరుపుకుంటున్నారు.
సమకాలీన ప్రపంచంలో మన నాటకం స్థానం ఏమిటి? మనం ఎక్కడ వున్నాం? ఎటువైపుకు దిగజారుతున్నాం? అసలు మనం ఎటువైపుకు వెళ్ళాలి. మన రంగస్థలానికి తగులుతున్న ఆటుపోట్ల మాటేమిటి? నాటకకర్తలుగా మనం నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నామా? కట్టెలూ, శవాలు మాదిరి ఏట్లో కొట్టుకుపోతున్నామా? లేదా ఏటికి ఎదురీదుతున్నామా? జాతిని జాగృతం చేయాలంటే ముందు మనం జాగృతం కావాలి గదా..? ఇలాంటి ప్రశ్నలన్నింటిని ఆత్మవివేచనాపూర్వకంగా ఈ సందర్భంలో నాటక కర్తలు తమపై తాము సంధించుకుంటారు. విమర్శించుకుంటారు. చర్చించుకుంటారు. ఎన్నెన్నో నాటక పరమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఆ ఏటికాయేడు ప్రస్తుతం ఉన్నదశలో ఓ దిశానిర్దేశం చేసుకోవడానికి ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం తప్పక ఉపయోగపడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ ప్రపంచ ప్రఖ్యాత రంగస్థల వ్యక్తి విశ్వశాంతి, విశ్వశ్రేయస్సు కాంక్షించేలా మానవత్వ పరిమళాలు జగమంతా పరుచుకోవడానికి నాటకంగా ఏం చేయవలసి వుంటుందో ఒక సందేశం ఇస్తారు.
అలా ప్రప్రధమంగా ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని 1962లో జీన్‌కోక్ట్‌ ఇచ్చారు. ఆ తర్వాత అదో సత్సంప్రదాయంగా మారింది. కనుకనే ప్రపంచ నాటక ప్రియులందరూ ఆ సందేశం కోసం ఎదురు చూస్తూ వుంటారు. ఎక్కడికక్కడ ఎవరికి వారు సోత్కర్షలతో గొప్పలకు పోకుండా ప్రపంచం పట్ల, యావత్‌ మానవాళి పట్ల నాటక ప్రియులు ఓ కర్తవ్య పథ నిర్దేశం చేసుకోవడానికి ఈ దినం అలా ఎంతగానో తోడ్పడుతుంది.
మరో విషయం ఈ సందేశం 50 భాషల్లోకి తర్జుమా అవుతుంది. అన్ని ఖండాల్లోని కోట్లాదిమంది ప్రజానీకానికి ప్రత్యక్ష, పరోక్ష ప్రసారాల ద్వారా ఏకకాలంలో చేరువవుతుంది. ఇదంతా మన రంగస్థలం సజీవంగా ఉండేందుకే కాక మానవ సమాజానికి బాధ్యతగా వుండేందుకు కూడా ఉపకరిస్తుంది.
రంగస్థలం (థియేటర్‌) – నాటకం (డ్రామా)ను సమానార్ధంలో వాడుతున్నప్పటికీ వేర్వేరుగానే పరిగణించాలి. నాటకం సర్వకళల సమాహారమైనప్పటికీ, నాటకం రంగస్థలంలో ఒక ప్రధాన భాగమే. రంగస్థలం అంటే ప్రదర్శనా కళలు. నాటకం, నాట్యం, జానపద కళలు శ్రవ్య దృశ్యరూపకాలు సమస్తం రంగస్థలంలో భాగంగా వుంటాయి. కాగా మరల నాటకం వేరు, నాటక రంగం వేరు. నాటకాన్ని ఓ ప్రదర్శనగా చూస్తాం. శ్రవ్య నాటకమైతే రేడియోల్లోనూ, ఆడియో రూపంలోనూ వింటాం.
‘వీడు వట్టి నాటకాలోడ్రా..’ అంటే జీవితంలో వాస్తవం కంటే అవాస్తవం, అతిశయోక్తులు ఎక్కువ వుంటాయని అర్ధం. నాటక రంగం అంటే ఆ రంగాన్ని ఓ శాస్త్రంగా అధ్యయనం చేయడం ముందుకు కొనిపోవడం, రంగస్థల శాస్త్రం ఇప్పుడు పాఠశాల స్థాయినుండి ఇంటర్‌, డిగ్రీ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్థాయివరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఎడ్యుకేషన్‌ త్రూ థియేటర్‌ (రంగస్థల మాధ్యమం ద్వారా విద్యాబోధన) అనేది నేడు కేవలం సాధారణ విద్యాసంస్థలకే పరిమితం కాక పెద్ద పెద్ద ఐ.ఐ.టిల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌, అమెరికా), ఎం.ఐ.టి. (మాసాచ్యుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కేంబ్రిడ్జ్‌) వంటి సంస్థల్లో కూడా అమలుపరుస్తున్నారు. కారణం అక్కడ పనిచేస్తున్నవారు శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో క్షణం తీరిక లేకుండా స్పందనా శక్తిని కోల్పోవడం. జడత్వానికి లోనౌతూ యంత్రంలో యంత్రంగా మారిపోతున్నామేమోనన్న భయం. మరల వారిలో మానవత్వ పరిమణాలు, స్పందనలు చిగురించి వికసించాలంటే రంగస్థల కళ అనివార్యమవుతుంది.
‘చెప్తే వినపడుతుంది. చూస్తే కనపపడుతుంది. కానీ చేస్తేనే అర్ధమవుతుంది’. ఇది మానవ జీవన సామెత. అందుకే మనిషికి మానవీయ స్పందనలు అవసరం అవుతున్నాయి కనుకనే రంగస్థలం ఓ శాస్త్రంగా ముందుకొస్తున్నది. తెలుగు నాట దాదాపు 144 ఏళ్ల క్రితం ఆధునిక నాటకం ఆవిర్భవించింది. వాడుక భాషలో ప్లీడర్‌ నాటకాన్ని (వ్యవహార ధర్మబోధిని) వీరేశలింగం పంతులు రాజమండ్రిలో తన యువ శిష్యగణం 1880లో ప్రదర్శించినప్పటి నుండి తెలుగు ఆధునిక నాటకం మొదలైనట్లు లాక్షణికులు చెప్తున్నారు. బ్రిటీష్‌ వారి ఏలుబడిలో న్యాయం ఎంతగా అన్యాయం అయిపోతన్నదో చాలా వ్యంగ్యంగా, చమత్కారంగా పంతులుగారు రూపొందించారు. మనవ వ్యవహార జీవితం ఎంత కపటంగా, నాటకీయంగా పరిణమించిందో నాడే కళ్లకు కట్టారు. ఆ తర్వాత గురజాడవారి ‘కన్యాశుల్కం’ ఓ నాటక రాజంగా ఆధునిక మహా కావ్యమైంది. ఆ తర్వాత ఆ వరవడిలో ఎన్నో… ఎన్నెన్నో నాటకాలు, ప్రయోగాలు రంగంలోకి వచ్చాయి. నాటకం కేవలం అలరించడమే కాదు, ఆలోచింపజేయడం అనే విషయం కూడా అవగతమైంది.
సమాజం ఎట్లున్నదో చూపడమే కాదు, ఎట్లుంటే బాగుంటుందో కూడా చూపాల్సిన బాధ్యతను నాటకం భుజాన ఎత్తుకున్నది. ఆ సోషలిస్టు వాస్తవికత రంగంలోకి వచ్చింది. ముందడుగు, మా భూమి వంటి నాటకాలకు తెరదీసింది.
ఒకప్పుడు ప్రాచీన వీధినాటకం, అదే వీధిబాగోతం, యక్షగానం, బయలు నాటకం వగైరా… పద్యాలు, పాటలు, వచనం, దరువులతో వర్ధిల్లింది. పౌరాణిక గాధలేగాక జానపద కథలు కూడా ఇతివృత్తాలై బాలనాగమ్మ వంటి జానపద నాటకాలూ వచ్చాయి. ఇక పద్యనాటకాలు సరేసరి. పద్యం తెలుగువారి హృద్యం. చిలకమర్తి వారి గయోపాఖ్యానం నాటకం అప్పట్లోనే లక్ష ప్రతులు అమ్ముడయ్యాయట. ఎంతటి భాషా ఔన్నత్యం, భావ ఔన్నత్యం, రాగ ఔన్నత్యం పండిత పామరులకు ఆ నాటకాల ద్వారా సమకూరాయో ఆలోచించుకుంటే చాలు గుండె వుబ్బితబ్బిబ్పై అబ్బురపరుస్తుంది.
బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్ర నాటకం చూడని ముందుతరం ప్రజానీకం వుండరంటే అతిశయోక్తి కాదు. ‘విధి అవశ్య ప్రాస్తంబు, రాజే కింకరుడగు, కింకరుడే రాజగు, కాలానుకూలంబుగా’ అన్న జీవన పరిణామ తాత్వికతతో పద్యమాలపిస్తుంటే, సామాన్యజనం భావోద్వేగ భావనతో రసప్లావితులవుతారు. ఇది కదా నాటకం శక్తీ, నాటకం ప్రతిభ, నాటకం జ్ఞానం నాటకం ప్రాణం అని సమ్మోహితులవుతారు. గాంధీజీ అంతటివాడనే ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం సత్య సంధునిగా, మహాత్మునిగా మార్చగలిగింది. ఆధునిక, సాంఘిక నాటకాలు మొదలైన తర్వాత నాటకం జీవితానికి సమాంతరంగా నడిచింది. నడుస్తున్నది. జీవితంలోని కల్మషాన్ని కడిగి పారేయడానికి గొప్ప సాధనమైంది. అక్కడితో ఆగకుండా ఆధునిక వీధి నాటకమై శ్రామిక వర్గానికి పోరాటాయుధమైంది. నాటకం వర్గపోరాటంలో ఓ మిస్సైల్‌లా ఎలా దూసుకుపోగలదో తెలియజెప్పింది.

– కె.శాంతారావు, 9959745723

Spread the love