బాల్యం నేర్పే పాఠం

కాలం మారే కొద్దీ అన్ని విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటేనే ఉన్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతిని పొందుతూనే ఉన్నాము. కానీ ప్రతి మనిషి జీవితంలో ఒక అరుదైన సమయమైన బాల్యం గురించి కొంత అశ్రద్ద పెడుతున్నాం అనేది వాస్తవం. చిన్నప్పుడు ఊళ్లో ఎంతో కల్మషం లేని ఆలోచనలతో జట్టు కట్టి స్నేహితులతో సరదాగా గడిపిన బాల్యం మనకు ఎన్నో నేర్పుతుంది. ఎలాంటి స్వార్థం లేకుండా అందరితో కలిసిపోయే కలివిడితనాన్ని నేర్పే నైజం బాల్యానిది. చిన్నతనంలో ఆడిన ప్రతి ఆట ఆలోచన సరళిని నేర్పేది. రేస్‌, చెడుగుడు అనే ఆటలు మనకు తెలియకుండానే శారీరక దారుఢ్యానికి సహయపడతాయి. కోతికొమ్మ, చిర్రగొనే, గోటీలు, చికుచికుపుల్లా, నేలా బండా ఇలా చెప్పుకుంటే పోతే ఒకటేంటి ఎన్నో రకాల ఆటలు మానసిక ఉల్లాసానికి అద్దం పట్టేవే. ఖోఖో వంటి ఒకటై ఆడిన ఆట తీరు ఐక్యతను, నాయకత్వ లక్షణాలను నేర్పేది. చిన్నతనంలో చేసిన ప్రతి పని, ఆడినా ప్రతి ఆట జీవితంలో ఒక మరుపు రాని మరువలేనిది గొప్ప అద్భుతమైన జ్ఞాపకం. కబడ్డీ లాంటి ఆటలు గెలువలనే ఆత్మవిశ్వాసాన్ని అలవాటు చేసేది. వేసవి కాలంలో చెరువు గట్టు వెంట ఒకటై కలిసి తాటి ముంజలు, ఈత కాయల వేటకు వెళ్ళి దొరికిన వాటిని సమానంగా పంచుకునే అలవాటును నేర్పేది. బావుల్లో, చెరువులో ఈతకు వెళ్లినప్పుడు వెంట ఉండి నేర్పి ముందుకు నడిపించిన నేస్తం బాల్యం.
జీవిత ప్రయాణంలో ఎన్నో నేర్చుకునే ప్రయత్నంలో ఎన్ని సార్లు విఫలం అయినా తిరిగి మళ్ళీ ప్రయత్నించే వ్యక్తిత్వం బాల్యం అప్పుడే అందించింది. నేటి ఆధునిక కాలంలో సమయపాలన లేని జీవిత చక్రంలో బాల్యం నాలుగు గోడల మధ్య బంధిగా మారింది. దిక్కుతోచని స్థితిలో బిక్కుమంటుంది. మోయలేని బరువుతో కూడిన పుస్తకాలతో భారంగా ముందుకెళ్తోంది. తోటి వారితో ఆత్మీయ నేస్తంగా కలిసి నడిచే స్నేహ మాధుర్యం తగ్గిపోతుంది. నేటి బాల్యం ఎంతసేపు ఆన్లైన్‌ గేమ్స్‌తో ఆగమవుతుంది. విజ్ఞానాన్ని పొందే క్రమంలో మనోల్లాసం కోల్పోయే పరిస్థితులు దాపరించాయి. పల్లెల్లో ఆడే ఆటలు నేడు కంటికి కనిపించనంత దూరంలో ఉండిపోయాయి. కనీసం వాటి పేర్లు కూడా కానరాకుండా ఉన్నాయి. ప్రతి ఒకరి జీవితంలో బాల్యంలో గడిపిన ప్రతిక్షణం ప్రభావం చూపుతుంది. నడక నేర్చిన ప్రయాణంలో అడుగుల తడబాటు కాలం నుండి సైకిల్‌ నేర్చుకోడానికి ప్రయత్నించిన తీరు నిశితంగా వెనుతిరిగి ఒక సారి ఆలోచిస్తే మన ఆత్మవిశ్వాసం ఎంతగొప్పదో తెలియ జేస్తుంది. అలాంటిది ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదువుకుని లక్ష్యం చేరే గమనంలో ఒడిదొడుకులకు భయపడి కుంగిపోవడం దేనికి సంకేతమో ఆలోచించాలి. ఎవరైనా సరే జీవితంలో ఓడిపోయిన ప్రతిసారి బాల్యాన్ని గుర్తుచేసుకుంటే చాలు తిరిగి కొండంత ప్రేరణ పొందొచ్చు. బాల్యానికి అంతటి శక్తి ఉంది.
ఒకప్పటి బాల్యం జ్ఞానంతో కూడిన ఆటలను నేర్పేది. తెలియని గొప్ప ఆత్మ విశ్వాసాన్ని అలవాటు చేసేది. నేటి బాల్యం గంటల కొద్దీ ఆన్లైన్‌ గేమ్స్‌తో విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటూ విలువలను, స్నేహాన్ని, నేస్తం పాలిట జ్ఞాపకాలను దూరం చేసుకుంటుంది. చిన్న చిన్న విషయాలకే ఆవేశపడి అనర్థాలకు తెర లేపుతుంది. ఆలోచించే అలవాటును మరిచి పోయింది. మారుతున్న కాలంతో పాటు అన్ని విషయాల్లో అవగాహన పొందాలి దానికై శ్రమించాలి. కానీ వాటి కోసం జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయే కొన్ని విలువలు నేర్పే జ్ఞాపకాలను పాతరేయకుడాదు. ఎంత సేపు మార్కులు, ర్యాంకులే కాదు మనిషి వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేసే ప్రయత్నాలు చేయాలి. దీనికై విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి.

Spread the love