మద్యం మత్తులో మహిళా అథ్లెట్లపై దాడి!

మద్యం మత్తులో మహిళా అథ్లెట్లపై దాడి!– ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు దీపక్‌ శర్మపై తీవ్ర ఆరోపణలు
గోవా : స్పెయిన్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు ఎదుర్కొన్న తరహా సంఘటన భారత ఫుట్‌బాల్‌లోనూ వెలుగుచూసింది. అఖిలభారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి దీపక్‌ శర్మ మహిళా అథ్లెట్లపై భౌతిక దాడికి పాల్పడిన ఘటన గోవాలో జరిగింది. ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌2లో పాల్గొనేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఖాద్‌ ఎఫ్‌సీ జట్టుకు గోవాకు వచ్చింది. గోవాకు బయల్దేరినప్పటి నుంచి మద్యం సేవిస్తున్న దీపక్‌ శర్మ.. రాత్రి వేళల్లో మహిళా అథ్లెట్లు గది తలుపులు తెరిచే ఉంచాలని వాట్సాప్‌ గ్రూప్‌లో ఓపెన్‌ మెసేజ్‌ చేశారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిన అమ్మాయిలపై దీపక్‌ శర్మ దాడి చేసినట్టు తెలుస్తోంది. ‘ మ్యాచ్‌లో గాయపడిన కారణంగా ఆ రోజు డిన్నర్‌ చేయలేదు. రాత్రి 11 గంటలకు బాగా ఆకలి వేయటంతో గుడ్లు ఉడకబెట్టుకునేందుకు కిచెన్‌లోకి వెళ్లాను. ఈ సమయంలో వచ్చిన దీపక్‌ శర్మ ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేశాడు. మా రూమ్‌లో ఓ అమ్మాయి డ్రెస్‌ మార్చుకుంటున్నా.. కనీసం తలుపు కొట్టకుండా లోపలికి ప్రవేశించి విచక్షణ రహితంగా కొట్టాడు. మహిళల జట్టుతో ఉంటూ మద్యం సేవిస్తున్నా టీమ్‌ మేనేజర్‌ నందిత శర్మ (దీపక్‌ శర్మ భార్య) ఆయననే వెనకేసుకొచ్చింది. దీపక్‌ శర్మ నుంచి మాకు ప్రాణహాని ఉంది. తక్షణమే చర్యలు తీసుకోవాలి’ అని పాలక్‌ వర్మ, రితికా ఠాకూర్‌ అనే అథ్లెట్లు టోర్నమెంట్‌ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.

Spread the love