– 8 చెక్ డ్యాములు 62 కోట్లతో నిర్మించి మండలాన్ని సస్యశ్యామలం చేసాం
– బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్
నవతెలంగాణ-కోహెడ : అభివృద్ధికి ఆదర్శంగా హుస్నాబాద్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని తంగళ్ళపల్లి, కూరెళ్ళ, ధర్మసాగర్‌పల్లి, వెంకటేశ్వరపల్లి ఆమ్లెట్ గ్రామం షేర్‌ఆలీనగర్‌లలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు కోలాటాలతో, డప్పుచప్పుల్లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మోయతుమ్మెద వాగు, ఎల్లమ్మవాగు, పిల్లివాగులపై 8 చెక్ డ్యాములు 62 కోట్ల వ్యయంతో నిర్మించి నీటిని నిల్వ చేసుకోవడంతో వేల ఎకరాలు సస్యశ్యామలమై పచ్చని పంటలు పండుతున్నాయన్నారు. సింగరాయ ప్రాజెక్టు సామర్ధ్యాన్ని 0.5 టీఎంసీ నుండి 1.0 టీఎంసీగా పెంచామని అందుకు 5 కోట్లు వెచ్చించామన్నారు. తంగళ్ళపల్లి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమానికి ఇప్పటివరకు 44.29 కోట్లు కేటాయించామన్నారు. కూరెళ్ళ గ్రామానికి 34.51 కోట్లు, నూతన గ్రామపంచాయతీ ధర్మసాగర్‌పల్లికి 7.98 కోట్లు, వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి 8.91 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. చెరువులు, కుంటల మరమ్మత్తులు, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమాలాంటి అనేక సంక్షేమ పథకాలతో పేద కుటుంబాలలో వెలుగులు నింపామన్నారు. ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. పలు గ్రామాల నుండి సుమారు 60 మంది యువకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, సర్పంచ్‌లు గాజుల రమేష్, పాము నాగేశ్వరిశ్రీకాంత్, లోనె సుజాత మల్లేశం, తోట భాగ్యలక్ష్మి ఆంజనేయులు, ఫ్యాక్స్ ఛైర్మన్ పెర్యాల దెవేందర్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, కోఆప్షన్ సభ్యులు ఎండీ ఖదీర్, బీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు సైఫోద్దీన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు వేల్పుల శంకర్, నాయకులు బబ్బురు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.