Sunday, August 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధం నుంచి వైదొలుగుదాం!

యుద్ధం నుంచి వైదొలుగుదాం!

- Advertisement -

అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ చైర్మెన్‌ కెయిన్‌ మనోగతం
ట్రంప్‌ సలహాదారులతో రహస్య భేటీలు

వాషింగ్టన్‌ : ఇరాన్‌ యుద్ధం నుంచి అమెరికా వైదొలగాల్సిన అవసరం ఎంతో ఉన్నదని సాయుధ దళాలలో అత్యున్నత స్థాయి సైనికాధికారి అయిన జాయింట్‌ చీఫ్స్‌ చైర్మెన్‌ జనరల్‌ డాన్‌ కెయిన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఛైర్మన్‌దేశాధ్యక్షుడికి, రక్షణ మంత్రికి సైనిక వ్యవహారాలలో సలహాదారుగా ఉంటారు. యుద్ధం నుంచి బయటికి రావాల్సిన అవసరాన్ని ఆయన గత కొన్ని వారాలుగా ట్రంప్‌ సన్నిహితులకు రహస్యంగా నొక్కి చెబుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సంఘర్షణలను తీవ్రతరం చేయడానికి అందుబాటులో ఉన్న సైనిక మార్గాలు వికటించే అవకాశం ఉన్నదని, కేవలం గగనతల దాడులతో ట్రంప్‌ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కష్టమని ఆయన తేల్చి చెబుతున్నారు. ‘యుద్ధం నుంచి వైదొలిగే దారి కోసం కెయిన్‌ ఎదురు చూస్తున్నారు’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

మంత్రులు, అధికారులకు మార్గనిర్దేశం
యుద్ధం ఓ కూడలికి చేరుకున్నదని కెయిన్‌ మాత్రమే కాదు…అనేక మంది సీనియర్‌ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. యుద్ధాన్ని తీవ్రతరం చేస్తే ఎదురయ్యే పరిస్థితులను గురించి, పోరు నుంచి బయటపడే మార్గం గురించి సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఇతర కీలక క్యాబినెట్‌ మంత్రులతో కెయిన్‌ చర్చించారని తెలిసింది. భావసారూప్యత కలిగిన కొందరు కీలక సలహాదారులతో కూడా ఆయన ఏకాంతంగా భేటీ అయ్యారు. సైన్యంతో సంబంధం లేని ప్రత్యామ్నాయాలు, సైనిక దళాలకు ఉన్న పరిమితులు, వాటిలోని లోపాలను నిర్ధారించడమే ఈ సమావేశాల ఉద్దేశం. ‘ఇది ప్రాణనష్టం జరగకుండా నివారించి సైన్యాన్ని రక్షించుకోవడానికి కెయిన్‌ చేస్తున్న ప్రయత్నం’ అని ఓ అధికారి చెప్పారు. భూతల దాడులపై ట్రంప్‌ మొదటి నుంచీ విముఖత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వైమానిక దాడులను ఉధృతం చేయడం ద్వారా ఇరాన్‌ను లంగదీసుకోవచ్చునని ఆయన అనుకుంటున్నారు. అయితే అది జరిగే పని కాదని కెయిన్‌తో పాటు ట్రంప్‌ క్యాబినెట్‌లోని పలువురు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడి ఆలోచనలకు అనుగుణంగా ఇతర ప్రత్యామ్నాయాల కోసం వారు అన్వేషిస్తున్నారు.

వాస్తవాలు గ్రహించి వెనకడుగు వేసిన ట్రంప్‌
కెయిన్‌ ఆలోచనలపై ఆయన ప్రతినిధి జోసెఫ్‌ హోల్‌స్డెన్‌ను ప్రశ్నించగా ‘దేశాధ్యక్షుడు, మంత్రులు, ఇతర సీనియర్‌ నేతలతో కెయిన్‌ జరిపే రహస్య సంభాషణలను మేము బయటపెట్టం. అలాగే వాటిపై అవగాహన లేని వ్యక్తులు చేసే వ్యాఖ్యల పైనా స్పందించం’ అని అన్నారు. కాగా ట్రంప్‌ జాతీయ భద్రతా బృందానికి కెయిన్‌ అందిస్తున్న సేవలను అధ్యక్షభవనం ప్రతినిధి ఒకరు ప్రశంసించారు. ‘ఆయన ఎప్పుడూ కమాండర్‌-ఇన్‌-చీఫ్‌కు కచ్చితమైన, నిస్పాక్షికమైన సమాచారాన్ని అందజేస్తారు. దాని ఆధారంగా దేశ భద్రతకు ఏది ఉత్తమమో పరిశీలించి దానిపై అంతిమ నిర్ణయం తీసుకుంటారు’ అని చెప్పారు. ఈ నెలాఖరులో ఇరాన్‌పై తీవ్రమైన దాడులు జరపాలన్న ట్రంప్‌ ప్రణాళికపై కెయిన్‌తో పాటు ఇతర సీనియర్‌ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. భారీ సైనిక చర్యకు సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌)లోని కొన్ని విభాగాలు మాత్రమే సానుకూలంగా ఉన్నాయి. చివరికి మధ్యప్రాచ్యంలోని మిత్రదేశాలతో మాట్లాడిన తర్వాత ట్రంప్‌ వెనకడుగు వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -