– ప్రకాష్ కరత్
పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే పార్టీ కామ్రేడ్స్ ఎవరైనా భిన్నాభిప్రాయం ఉంటే పార్టీ
వేదికలలో వాటిని వెలిబుచ్చేందుకు హక్కు కలిగివుంటారు. అందుకు ఎలాంటి ఆటంకాలు
ఉండకూడదు. భిన్నాభిప్రాయాలను తొక్కిపట్టే ప్రయత్నం అనుమతించకూడదు. కేంద్రీకృత
ప్రజాస్వామ్య సూత్రాన్ని అన్వయించడం అంటే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మెజార్టీ
అభిప్రాయం సమిష్టి నిర్ణయం అవుతుంది. వ్యక్తిగత అభిప్రాయాలు లేదా మైనార్టీ
అభిప్రాయం గలవారు కూడా దాన్ని ఆమోదించి అమలు చేయాలి. మైనార్టీ అభిప్రాయాన్ని
బేఖాతరు చేయడం గానీ పార్టీ వెలుపల వ్యక్తిగత అభిప్రాయాలు లేదా మైనార్టీ అభిప్రాయం
అమలుకు ప్రయత్నించడం కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం.
1967 నిర్మాణ రంగంలో మన కర్తవ్యాలు అనే సిద్ధాంత పత్రం ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే
ఆమోదించబడింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తల పట్ల సరైన క్యాడర్ విధానం
రూపొందించుకోవడంలో వైఫల్యాన్ని ఆ పత్రం సూటిగా పేర్కొంది. మార్క్సిజం, లెనినిజానికే
అంకితమైన క్యాడర్ లేకుండా ఒక కమ్యూనిస్టుపార్టీ గాని విప్లవోద్యమం గాని నిర్మించడం సాధ్యం
కాదు. ఇందుకోసం భవిష్యత్తులో ఉపయోగపడే పార్టీ కార్యకర్తలను గుర్తించాలి. వివిధ తరగతుల
ప్రజలలో పని చేసేందుకు అవసరమైన విధంగా వారిని అభివృద్ధి చేసి శిక్షణ ఇవ్వాలి. పూర్తికాలం
కార్యకర్తల, వారి కుటుంబాల కనీస అవసరాలకు తగువిధంగా పార్టీ ఏర్పాట్లు చేయాలి.
మన దేశ కమ్యూనిస్టు ఉద్యమ ప్రసిద్ధ నేతల్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు. ఉద్యమానికి ఆయన అందించిన అనేకానేక సేవలలో రెండు ప్రధానమైనవి. దీర్ఘకాలం నిలిచి ఉండేవి. అందులో ఒకటి పార్టీ నిర్మాణంలో ఆయన నిర్వహించిన పాత్ర. గ్రామసీమలలో వ్యావసాయక సమస్య పట్ల ఆయన రూపొందించిన మార్క్సిస్టు దృక్పథం. విప్లవాత్మక పార్టీ నిర్మాణంలో ఆయన పాత్ర గురించి ఈ వ్యాసంలో నేను దృష్టి కేంద్రీకరిస్తాను. తాను 1930లో కమ్యూనిస్టునయ్యానని సుందరయ్య స్వయంగా చెప్పుకున్నారు. దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం నియోగించబడిన అమీర్ హైదర్ ఖాన్ అరెస్టు తర్వాత ఆయన నిర్మాణ దక్షత బాగా ప్రస్ఫుటమైంది. యువ సుందరయ్య పార్టీ ఆర్గనైజర్‌గా 1934లో బాధ్యతలలో ప్రవేశించారు. అప్పుడాయన వయస్సు 22. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ సీపీఐ కేంద్ర కమిటీలో ఆయన సభ్యుడయ్యారు. మీరట్ కుట్ర కేసు ఖైదీల విడుదల తర్వాత దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం ఏర్పడిన తొలి సంఘటిత వేదిక అదే. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాల ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీని నిర్మించవలసిన అవసరాన్ని తొలిగా గుర్తించిన వారిలో సుందరయ్య ఒకరు. అలాగే పార్టీకి ఒక అఖిల భారత కేంద్రం ఉండాలనీ ఆయన అర్థం చేసుకున్నారు. సుందరయ్యలోని ఈ విశిష్టతను కామ్రేడ్ బి.టి రణదివే ఆయన అంతిమ యాత్ర సభలో గొప్పగా చెప్పారు. ”పార్టీ మూల సూత్రాల కోసం పోరాటం, మరే అంశం కన్నా పార్టీయే సర్వోన్నత్యం కోసం పోరాటం, పార్టీ విప్లవ క్రమశిక్షణ కోసం పోరాటం ఇవే కామ్రేడ్ సుందరయ్య చేసిన పోరాటాలు. ఇవే ఆయనను పార్టీలో అత్యున్నత నాయకుడుగా నిలిపాయి.” కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ స్వరూపంలో కీలకమైన అంశం కేంద్రీకృత ప్రజాస్వామ్యం. ఈ ప్రాతిపదికపై పోరాటమే కామ్రేడ్ సుందరయ్య, కామ్రేడ్ బసవపున్నయ్య తదితరులు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిర్మించేలా చేశాయి. సైద్ధాంతిక రాజకీయ నిర్మాణ రంగాలలో రివిజనిస్టు సూత్రాలపై పోరాటానికి నడిపించాయి.
కేంద్రీకృత ప్రజాస్వామ్యం విశిష్టత
పార్టీ నిర్మాణంలో కర్తవ్యాలు పేరిట 1967లో రూపొందిన పత్రాన్ని కామ్రేడ్ సుందరయ్య, కామ్రేడ్ బసవపున్నయ్యలు రాశారు. పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ పత్రం ఉద్దేశం. కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ఆ పత్రం ఇలా వివరించింది… మన పార్టీలో పై కమిటీలు పార్టీ సభ్యులతో ఎన్నుకోబడతాయి గనక వారి విశ్వాసం పొందినవారై ఉంటారు. అందువల్లనే వారికి పార్టీ వ్యవహారాలు నిర్వహించడానికి అవసరమైన సాధికారత లభిస్తుంది. వ్యక్తి సంస్థ పట్ల విధేయత కలిగి ఉండటం, మైనారిటీగా ఉన్నవారు మెజారిటీకి లోబడి ఉండటం, దిగువ కమిటీ పై కమిటీకి లోబడి ఉండటం, అన్ని భాగస్వామ్య వ్యవస్థలూ కేంద్ర కమిటీకి లోబడి ఉండటం జరగాలి. కేంద్రీకృత అనేది ప్రజాస్వామ్యం నుంచి వేరుగా ఉండదు. ఆ ప్రజాస్వామ్యమే దాని ప్రాతిపదికగా ఉంటుంది.
‘మన పార్టీలో ప్రజాస్వామ్యం అంటే పార్టీ సమావేశాలు జరపడం, సరైన నాయకత్వంలో వాటిని నిర్వహించడం, అవసరమైన సన్నాహాలతో సావధాన చర్చలతో తీర్మానాలు ఆమోదించడం, జాగ్రత్తగా ప్రతిపాదనలు తయారు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించడం. మా పార్టీలో ప్రజాస్వామ్యం అంటే నాయకత్వం లేని ప్రజాస్వామ్యం కాదు, కుహనా ప్రజాస్వామ్యం గానీ పార్టీలో అరాచకం గానీ కాదు.”
”పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఉన్నత ప్రమాణాలకు తీసుకు వస్తేనే ఆ ప్రాతిపదికన పార్టీ నాయకత్వంలో ఉన్నత స్థాయి కేంద్రీకృత నాయకత్వాన్ని సాధించగలం’. సుందరయ్య దృష్టిలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం ప్రాతిపదికగా నడిచే క్రమశిక్షణాయుతమైన పార్టీ అన్నిటికన్నా కీలకం. వర్గ పోరాటాలు ప్రజా పోరాటాలు పెంపొందించడం, కార్మిక కర్షక ఐక్యత, పాలక వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం, బూర్జువా భూస్వామ్య రాజ్యం శ్రామికవర్గంపై సాగించే నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడటం ఇవన్నీ కూడా ఆ విధమైన క్రమశిక్షణ గల పార్టీపైనే ఆధారపడి ఉంటాయి. 1964 నుంచి 1976 వరకూ ఆయన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన పన్నెండేండ్ల కాలంలో ఈ లక్ష్య సాధనకే ఆయన కృషి చేశారు. సరైన మార్క్సిస్టు, లెనినిస్టు మూలసూత్రాల ప్రాతిపదికన అలాంటి పార్టీ నిర్మాణం కోసం మనం సుందరయ్య వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి.
దిద్దుకోవలసిన అంశాలు
కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాల ప్రాతిపదికన పార్టీ నిర్మాణాన్ని, పని విధానాన్ని పటిష్టం చేసుకోవడం అవసరం. సమిష్టి పని విధానం వ్యక్తిగత బాధ్యత, విమర్శ, ఆత్మ విమర్శ పద్ధతిలో పార్టీ కృషిని వ్యక్తిగత కృషిని సమీక్షించుకోవడం అవసరం. పార్టీ శాఖలలో స్వేచ్ఛగా నిర్మొహమాటంగా చర్చల ద్వారా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. మెజార్టీ అభిప్రాయాన్ని కమిటీ అభిప్రాయంగా అమలు చేయడం మైనార్టీ అభిప్రాయాన్ని కూడా పార్టీ వేదికలలో వినిపించే అవకాశం ఉండేలా హామీ కల్పించడం జరగాలి. పార్టీ కేంద్ర కమిటీ జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో దిద్దుబాటు కార్యక్రమాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చింది. పార్టీ కమిటీల పని పద్ధతులు తీరు కూడా దిద్దుబాటు అంశాల్లో భాగంగా ఉన్నాయి. కమిటీలు కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేయిస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతి నుంచి వైదొలగడం, ఉల్లంఘించడం ఏమైనా జరిగిందా అని నిశితంగా పరిశీలించి తప్పులను ఎత్తిచూపాలి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే పార్టీ కామ్రేడ్స్ ఎవరైనా భిన్నాభిప్రాయం ఉంటే పార్టీ వేదికలలో వాటిని వెలిబుచ్చేందుకు హక్కు కలిగివుంటారు. అందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. భిన్నాభిప్రాయాలను తొక్కిపట్టే ప్రయత్నం అనుమతించకూడదు. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని అన్వయించడం అంటే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మెజార్టీ అభిప్రాయం సమిష్టి నిర్ణయం అవుతుంది. వ్యక్తిగత అభిప్రాయాలు లేదా మైనార్టీ అభిప్రాయం గలవారు కూడా దాన్ని ఆమోదించి అమలు చేయాలి. మైనార్టీ అభిప్రాయాన్ని బేఖాతరు చేయడం గానీ పార్టీ వెలుపల వ్యక్తిగత అభిప్రాయాలు లేదా మైనార్టీ అభిప్రాయం అమలుకు ప్రయత్నించడం కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. ఇది ముఠాతత్వానికి లేదా గ్రూపులు కట్టడానికి దారితీస్తుంది.
అదే సమయంలో నిరంకుశాధికార పద్ధతులు గానీ, వ్యక్తిగత అభిప్రాయాల లేదా మైనార్టీ అభిప్రాయాలను తొక్కిపట్టడానికి ప్రయత్నించడం కూడా కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకమే. పార్టీ నిబంధనావళిలో పొందుపర్చబడిన కేంద్రీకృత ప్రజాస్వామ్యం అన్ని కోణాలనూ అమలు చేసేవిధంగా కమిటీలు పనిచేస్తున్నాయా అనే విషయాన్ని అన్ని కమిటీలు సమీక్షించవలసి ఉంటుంది.
వ్యక్తిగత ధోరణి, స్వీయ మానసిక ధోరణి, నిరంకుశాధికార పోకడలు, ఉదారవాదం కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాల ఉల్లంఘనకు మూల కారణాలుగా వస్తున్నాయని నిర్మాణంపై కోల్‌కతా ప్లీనం నిర్దిష్టంగా ఎత్తిచూపింది. సమీక్షలో అలాంటివి ఉన్నాయని గుర్తిస్తే వాటిని దిద్దుకోవడానికి చర్యలు చేపట్టాలి. పార్టీ పనికి వచ్చే కార్యకర్తలను గుర్తించడం వారిని తీర్చిదిద్దడం అనే మరో గొప్ప లక్షణం సుందరయ్యలో ఉండేది. తొలి రోజుల్లో ఆయన ఆంధ్రా, తెలంగాణలలో పార్టీ శాఖలు స్థాపించడం మొదలుపెట్టినప్పుడు తర్వాత తను పార్టీ కేంద్రంలో ఆర్గనైజర్‌గా బాధ్యతలు అప్పగించబడినప్పుడు ఈ లక్షణం ప్రస్ఫుటమైంది.
క్యాడర్ విధానం కీలకం
1967 నిర్మాణ రంగంలో మన కర్తవ్యాలు అనే సిద్ధాంత పత్రం ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే ఆమోదించబడింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తల పట్ల సరైన క్యాడర్ విధానం రూపొందించుకోవడంలో వైఫల్యాన్ని ఆ పత్రం సూటిగా పేర్కొంది. మార్క్సిజం, లెనినిజానికే అంకితమైన క్యాడర్ లేకుండా ఒక కమ్యూనిస్టుపార్టీ గాని విప్లవోద్యమం గాని నిర్మించడం సాధ్యం కాదు. ఇందుకోసం భవిష్యత్తులో ఉపయోగపడే పార్టీ కార్యకర్తలను గుర్తించాలి. వివిధ తరగతుల ప్రజలలో పని చేసేందుకు అవసరమైన విధంగా వారిని అభివృద్ధి చేసి శిక్షణ ఇవ్వాలి. పూర్తికాలం కార్యకర్తల, వారి కుటుంబాల కనీస అవసరాలకు తగువిధంగా పార్టీ ఏర్పాట్లు చేయాలి. దురదృష్టవశాత్తూ మనం ఈనాటి అవసరాలకు తగినట్టుగా ఈ క్యాడర్ విధానం అమలుపర్చలేకపోతున్నాం. మన పూర్తికాలం కార్యకర్తలు వివిధ స్థాయిల్లో రాజకీయ నిర్మాణ వ్యవహారాల నాయకులుగా ఉండాలి. కాని మన లోపభూయిష్టమైన దృష్టి కోణం కారణంగా చాలామంది కార్యకర్తలు కేవలం పని చేసే (ఉద్యోగస్తులుగా) వారిగా మిగిలిపోతున్నారు.
నాయకత్వ స్థాయి కార్యకర్తలకు అవసరమైన రాజకీయ, సైద్ధాంతిక స్థాయి లేకుండా పోతున్నది. అందువల్ల పార్టీ నిర్మాతగా సుందరయ్య పని విధానం నుంచి నేర్చుకోవలసిన ఒక అతి ముఖ్యమైన పాఠం పార్టీ క్యాడర్‌ను పెంపొందించడం, తీర్చిదిద్దడం. ఆయన వేసిన బాటలో ముందుకు సాగుదాం. సీపీఐ(ఎం)ను, కమ్యూనిస్టు ఉద్యమాన్ని శక్తివంతం చేసి ముందుకు నడిపించేందుకు మనం చేసే పోరాటంలో మనం సుందరయ్య అందించిన ఈ మహత్తర వారసత్వాన్ని కొనసాగించేందుకు దీక్షబూనుదాం.
(నేడు పి.ఎస్ 38వ వర్థంతి)
– అనువాదం: తెలకపల్లి రవి