నూతన జాతీయ విద్యావిధానం రద్దు కోసం పోరాడుదాం

– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
– 150 అడుగుల జాతీయ జెండాతో ఆజాదీ ర్యాలీ
– పెద్దఎత్తున పాల్గొన్న విద్యార్థులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులు పోరాడాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు అన్నారు. సోమవారం ఎప్‌ఎఫ్‌ఐ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెయ్యి మంది విద్యార్థులతో 150 అడుగుల జాతీయ జెండాతో ‘ఆజాదీ ర్యాలీ’ నిర్వహించారు. ఈ ర్యాలీ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ ఎంపీడీవో కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్‌ సంతోష్‌ అధ్యక్షతన జరిగిన సభలో టి.నాగరాజు మాట్లాడుతూ.. నేడు దేశంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం పేరుతో జైళ్ళకు పంపుతున్నారని తెలిపారు. విద్యార్థుల ఫీజులు పెంచుతున్నారని, యూనివర్సీటీల్లో కోర్సులను మూసేస్తున్నారని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో యూనివర్శీటీల అటానమినీని దెబ్బతీసి విద్యా ప్రయివేటీకరణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏం చదవాలో, ఏ కోర్సులను ఎంచుకోవాలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసంధానంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తోందని, యూనివర్సీటీల గ్రాంట్స్‌ కమిషన్‌ను నిర్వీర్యం చేసి హక్కులను లాగేసుకుంటున్నదని అన్నారు. రాజ్యాంగంపై ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి చేస్తోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నూతన విద్యా విధానం తీసుకొచ్చినట్టు చెప్పారు. సిలబస్‌లో మార్పులు చేసి చరిత్రను వక్రీకరించి, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని విద్యారంగంలో చొప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి దేశ బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించడం చూస్తుంటే.. కావాలనే ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసి ప్రయివేటు, కార్పొరేట్‌ శక్తులకు విద్యారంగాన్ని అప్పగించే కుట్రలు చేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. అందుకే స్వాతంత్య్ర దినోత్సవం స్ఫూర్తితో రాజ్యాంగాన్ని, చదువులను, దేశాన్ని రక్షించుకోవడానికి విద్యార్థులు ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ నాయకులు పి.సత్యం మాట్లాడుతూ.. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. మత, కులాల చిచ్చుపెట్టి గొడవలు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుకునే పాఠాల్లో కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాన్ని తీసుకురావాలనుకోవడం ముర్ఖత్వమన్నారు. ఈ రోజుల్లో శాస్త్రీయ విద్యా విధానాన్ని ప్రోత్సహించాలి కానీ, కులాలు, మతాల భావజాలాన్ని నింపి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి భవిష్యత్‌లో ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్‌, గొర్రెల మేకల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమురయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి నరేష్‌, మేడ్చల్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ.ఆదిల్‌, కిరణ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రసాద్‌, పవన్‌, నిఖిల్‌, ప్రశాంత్‌, వెంకటచారి, నర్సింగ్‌రావు, సద్గుణచారి, జ్యోతి, పల్లవి, ప్రసాద్‌, శివ, భాస్కర్‌, విశాల్‌, శివ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Spread the love