విద్యాశాఖ నిర్ణయంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

– వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌
– లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం : రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలోకి మీడియా, విద్యార్థి సంఘాలు, స్వచ్చంద సంస్థలతోపాటు అనుమతి లేకుండా ఇతరులు ఎవరినీ అనుమతించొద్దంటూ విద్యాశాఖ జారీ చేసిన నోటీసులపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖను డిమాండ్‌ చేశాయి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి
అప్రజాస్వామికం : ఎస్‌ఎఫ్‌ఐ
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలోకి అనుమతి లేకుండా రావొద్దంటూ విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేయడం అప్రజాస్వామికమని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. సమస్యలను పరిష్కారం చేయకుండా బయటి వ్యక్తులు రావొద్దంటూ నోటీసులివ్వడం సరైంది కాదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఇలాంటి నిర్ణయాలనుభుత్వాలు చేయలేదని గుర్తు చేశారు. సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దంటూ నిర్బంధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వానికి ఆ హక్కు లేదు : ఏఐఎస్‌ఎఫ్‌
ప్రభుత్వ పాఠశాలల్లో మీడియా, విద్యార్థి సంఘాలను రానివ్వొద్దనే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంతా బాగున్నాయా?, అలా ఉంటే ఎందుకంత వణుకు?అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలు, మీడియాను చూస్తే ఎందుకంత భయమని నిలదీశారు. ఖాళీగా ఉన్న 24 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలను సందర్శించి సమస్యలను తెలుసుకుని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఆగేది లేదని తెలిపారు.
ఇది సిగ్గుచేటు : పీడీఎస్‌యూ
ప్రభుత్వ పాఠశాలల్లోకి మీడియా, విద్యార్థి, ప్రజాసంఘాలను అనుమతించొద్దంటూ సర్క్యులర్‌ జారీ చేయడం సిగ్గుచేటని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం, ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజరుకన్నా విమర్శించారు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవడా నికే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తుంటే సహించలేని ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు ఇటీవల ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై చేసిన వ్యాఖ్యలే వైఫల్యాలకు నిదర్శనమని తెలిపారు.

Spread the love