మరింత బలపడతాం

Let's get stronger– మేం నిరాశపడటంలేదు.. ఇలా జరుగుతుందని మాకు ముందే తెలుసు
–  ఐక్యత కోసమే ఎక్కడా మాట్లాడలేదు
– ఆయనొక అయారాం గయారాం
– ఊసరవెల్లితో పోటీపడుతున్నారు : నితీష్‌ నిష్క్రమణపై ఇండియా ఫోరమ్‌ నేతలు
న్యూఢిల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ బీజేపీ పంచకు చేరడంతో తాము మరింత బలోపేతమయ్యామని ఇండియా ఫోరమ్‌ నేతలు అంటున్నారు. ఒక దశలో ఇండియా ఫోరమ్‌ కన్వీనర్‌ పదవికి కూడా నితిష్‌ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల అనంతరం మీడియాతో మాట్లాడిన పలువురు ఇండియా ఫోరమ్‌ నేతలు అధికారం కోసం దేశ వ్యాప్తంగా బీజేపీ చేస్తున్న కుట్రలను ఈ వ్యవహారంతో ప్రజానీకం స్పష్టంగా అర్ధం చేసుకుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నితీష్‌ బీజేపీ వద్దకే చేరుతారన్న సమాచారం తమ వద్ద ముందే ఉందని, అందువల్ల ఈ పరిణామం తమను ఏమ్రాతం ఆశ్చర్యపరచలేదని కూడా ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ తరహా వ్యాఖ్య చేయడం గమనార్హం. ఆదివారం ఉదయం వరకు నితీష్‌కుమార్‌ మంత్రివర్గంలో డిప్యూటీ సిఎంగా బాధ్యతలు నిర్వహించిన ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ ‘ ఈ పరిణామంతో మేం నిరాశ చెందడం లేదు.’ అని చెప్పారు. ‘మాకు ఆయన మీద కోపం లేదు. మేం కూటమి ధర్మాన్ని పాటిస్తూనే వచ్చాం. ఆయన బీజేపీ వద్దకు వెళ్లారు. మేం ప్రజల వద్దకు వెళ్తాం. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. 2024 ఎన్నికలతో జేడీయూ కథ ముగుస్తుంది.’ అని అన్నారు. ‘ఒకరకంగా ఈ పరిణామం ఇండియా ఫోరమ్‌ను మరింత బలోపేతం చేసింది. దీనికి దోహదం చేసిన బీజేపీకి నేను ధన్యవాదాలు చెబుతున్నా.’ అని చెప్పారు. నితీష్‌ కుమార్‌ నిష్క్రమిస్తారన్న సమాచారం తమకు ముందే ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇటువంటి అయారాం, గయారాంలను దేశం చాలా మందిని చూసిందని పేర్కొన్నారు. ‘లాలూజీ, తేజస్వీ ఈ విషయాన్ని మాకు చాలా ముందుగానే చెప్పారు. ఇండియా ఫోరమ్‌ను ఐక్యంగా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే, ఈ విషయం గురించి మేం ఎక్కడా మాట్లాడలేదు. మాతో ఉండదల్చుకుంటే ఉంటాడు. వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోతాడనుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది.’ అని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జై. రామ్‌ రమేష్‌ ”ఊసరవెల్లితో నితిష్‌ పోటీపడుతున్నారు” అని వ్యాఖ్యానించారు. శివసేన (ఉద్దవ్‌థాక్రే) నేత సంజరు రౌత్‌ నితీష్‌ను ‘పల్తురామ్‌’అంటూ గతంలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యను గుర్తుచేశారు. రాముడు, రామరాజ్యం గురించి బీజేపీ నేతలు ఒకవైపు మాట్లాడుతూ మరోవైపు పల్తురామ్‌లతో చేతులుకలుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డీఎంకే నేత ఎలన్‌గోవన్‌ ఇండియా ఫోరమ్‌ను చూసి బీజేపీ భయపడుతోందనడానికి నితీష్‌ ఉదంతమే నిదర్శనమని వ్యాఖ్యానించారు.
చెత్త తిరిగి చెత్తబుట్టనే చేరింది
ఆర్‌జేడీ నేత లల్లూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు రోహిణి ఆచార్య ఒక ట్వీట్‌లో ‘చెత్త తిరిగి చెత్తబుట్టనే చేరింది. కంపుగొడుతున్న చెత్తను పొందినందుకు చెత్తబుట్టకు అభినందనలు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో ఆమె చెత్తబుట్ట పేరునుగానీ, బీజేపీని గానీ ప్రస్తావించలేదు. అయితే, ఆ తరువాత చేసిన మరో ట్వీట్‌లో గతంలో నితీష్‌కుమార్‌గురించి లాలు చేసిన ట్వీట్‌ను ఆమె రీ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ‘పాము కుబుసం విడిచినట్టు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నితిష్‌ పార్టీ మారుతారు.’ అని పేర్కొన్నారు.

Spread the love