ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమిద్దాం.. : ప్రొఫెసర్‌ కోదండరామ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదనీ, తమ సమస్యలపై గొంతెత్తితే..అణచి వేస్తున్నారనీ, దోపిడీ, దౌర్జన్యాలకు నిలయంగా తెలంగాణ మారిందనీ, అందుకే ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫేసర్‌ కోదండరామ్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవిర్భావ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. నగర కార్యదర్శి నర్సయ్య అధ్యక్షతన జరిగిన సభలో కోదండరామ్‌ మాట్లాడుతూ సబ్బండ వర్గాల పోరాటం ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. అమరుల త్యాగాల పునాదులమీద రాష్ట్రం అవిర్భవించిందన్నారు. కొందరు తామొక్కరమే..ఈ తెలంగాణ తెచ్చినట్టు చెప్పుకోవటం శోచనీయమని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు తమ అస్థిత్వం కోసం జరిగిన పోరాటమని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో నాయకులు పై నుండి ఊడిపడలేదనీ, వారు ప్రజల నుంచే వచ్చారని చెప్పారు. పాట ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు. ఆనాటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరినీ పక్కకు నెట్టి.. రాష్ట్రాన్ని ఒక కుటుంబం తమ చేతిలో బంధీగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్‌కు స్వార్ద ప్రయోజనాలు తప్ప..ప్రజల ప్రయోజనాలు ఏ మాత్రం లేవని విమర్శించారు. ఆధిపత్యం, దోపిడి, నియంతృత్వం లేని తెలంగాణ కోసం తిరిగి కోట్లాడుదామని పిలుపిచ్చారు. మన తోవ అయిపోలేదని భవిష్యత్‌ పోరాటాలకు సన్నద్ధం కావాలన్నారు. టీజేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి నరేశ్‌ మాట్లాడుతూ తెలంగాణ వచ్చినంక కూడా పోరాటం చేయాల్సి వస్తదని ఆనాడే ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love