– మన వాటా కోసం అందరినీ కలుపుకొనిపోదాం
– తెలంగాణలో అతిపెద్ద కులం ముదిరాజ్ : ఎంపీ ఈటల రాజేందర్
– రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి : శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ డాక్టర్ బండ ప్రకాశ్
– ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘ముదిరాజ్ సింహావలోకనం’
నవతెలంగాణ-హైదరాబాద్ : అన్ని రంగాల్లో ముదిరాజ్‌లకు రావాల్సిన న్యాయమైన రిజర్వేషన్ కల్పించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ముదిరాజ్‌లు తమ న్యాయమైన వాటాను అడుగుతున్నారని తెలిపారు. ముదిరాజులంతా ఐక్యంగా ఉండి, హక్కుల కోసం కలిసి కొట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’ గ్రూపునకు మార్చాలనే ప్రధాన డిమాండ్‌తో జలవిహార్‌లో ముదిరాజ్ విద్యావంతుల వేదిక (ఎంవీవీ) ఆధ్వర్యంలో ‘ముదిరాజ్ సింహావలోకనం’ కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ డాక్టర్ దినేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, పొలిటికల్, క్యాస్ట్ (సీప్‌సీ) సర్వే రిపోర్ట్‌పై వక్తలు సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఈటల మాట్లాడుతూ… ముదిరాజులు ఒకే సంఘంగా ఉండాలి అనేది మొదటి నుంచీ తాను చేస్తున్న విజ్ఞప్తి అని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా మన హక్కుల కోసం పోరాడుతున్నా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ముదిరాజుల పరిస్థితి ఉందని చెప్పారు. ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ప్రభుత్వ సర్వేనే తేల్చిందన్నారు. అప్పట్లో బండ ప్రకాశ్.. ముదిరాజ్‌ల కోసం పేపర్లు పట్టుకొని అసెంబ్లీ చుట్టూ తిరిగేవారనీ, ఆ సమయంలో ఆయనను స్వయంగా తానే పరిచయం చేసుకున్నానని ఈటల చెప్పారు. ముదిరాజులను బీసీ ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’కు మార్చాలని మొదటి సారి అసెంబ్లీలో మాట్లాడింది తానేనని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో అనేకసార్లు సభలో ప్రస్తావించినట్టు ఈటల గుర్తు చేశారు. 2008 ఉప ఎన్నికల సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేశారనీ, కానీ అది అందినట్టే అంది దూరమైందని తెలిపారు. ముదిరాజులను బీసీ ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’కు మార్చే ప్రక్రియ ఒకసారి అమలు జరిగి ఆగిపోయింది కాబట్టి.. దానిని పరిశీలించి సంపూర్ణంగా అమలు చేయాలని ఈటల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలోనే అతిపెద్ద కులంగా ముదిరాజులు 26 లక్షల మందికి పైగా (7.46 శాతం) ఉన్నారనీ, ‘35 నియోజకవర్గాలను శాసించేస్థాయిలో ఉన్నా ఏం లాభం’ అని మన మేధావులు అడుగుతున్నారని చెప్పారు. ముదిరాజుల పోరాటంలో తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఈటల హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి : బండ ప్రకాశ్
ఐక్యంగా ముందుకు సాగితేనే అన్నీ సాధించుకుంటామని బండ ప్రకాశ్ అన్నారు. ముదిరాజుల రిజర్వేషన్ అంశాన్ని సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకెళ్లి, బీసీ కమిషన్‌కు అప్పగించిందనీ, ఇప్పుడు కులాల జనాభా నివేదికలు కూడా వచ్చాయి కాబట్టి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే కమిషన్ అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీప్‌సీ రిపోర్ట్ మీద సమగ్రంగా చర్చించిన మీటింగ్ ముదిరాజ్ సింహావలోకనమేనని ప్రొఫెసర్ కంచె అయిలయ్య చెప్పారు. ఈ రిపోర్ట్‌ను సమగ్రంగా సమీక్షించిన మొదటి పుస్తకం కూడా ‘ముదిరాజుల ముఖచిత్రం’ అని ఆ పుస్తక రచయిత పిట్టల రవీందర్‌ను ఆయన అభినందించారు. బీసీల్లో అన్ని కులాలూ ఏకతాటిపైకి వచ్చి, రాజ్యాధికారం సాధించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ టి.చిరంజీవులు సూచించారు. ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తామని ముదిరాజ్ విద్యావంతుల వేదిక చైర్మెన్ ప్రొఫెసర్ దినేశ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్టల రవీందర్, జూలు నాగేశ్వర్ ముదిరాజ్, కావలి చెన్నయ్య ముదిరాజ్, రవికిరణ్, పూల నాగరాజు, ఉప్పరి నారాయణ పాల్గొన్నారు.
ఐక్యంగా ఉందాం.. కలిసి కొట్లాడదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



