‘ఓట్స్’ కే ఓటేద్దాం

ots ke oteddamఓట్స్‌, నట్స్‌ మిక్స్‌, మసాలా వోట్స్‌ ప్రజలు ఎక్కువగా తినే ఆహారం. కానీ చాలా పోషక విలువలు కలిగిన ఓట్‌ మీల్‌ను రాత్రిపూట నానబెట్టి తినాలని చాలా మందికి తెలియదు. వోట్‌మీల్‌ కంటే నానబెట్టిన వోట్స్‌ ఎక్కువ పోషక విలువలు కలిగినవి, శక్తి వంతమైనవి. రెట్టింపు ప్రయోజనాలను అందించేవి.

చాలా మంది అభిప్రాయం ప్రకారం ఓట్స్‌ ఎటువంటి రుచిని కలిగి ఉండవు. కాబట్టి, ఓట్స్‌ను కొన్ని ఇండియన్‌ మసాలా దినుసులు ఛాట్‌ మసాలా, పెప్పర్‌, జీలకర్ర, డ్రై మ్యాంగో పౌడర్‌ ఉపయోగించి మరింత రుచికరంగా తయారుచేసుకోవచ్చు. ఓట్స్‌తో ఆరోగ్యకరమైన వంటలు తయారు చేసుకోవడానికి మార్గాలు తెలుసుకుంటే, వర్సిటైల్‌ ఫుడ్స్‌లో రెగ్యులర్‌ ఫుడ్‌లిస్ట్‌లో వీటిని చేర్చుకోవచ్చు.
ఒకప్పుడు ఓట్స్‌ అంటే రోగుల ఆహారమని పిలిచేవారు. మార్కెట్లో కూడా అంత తేలికగా లభ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఓట్స్‌ లేని కిరాణా దుకాణం లేదు. దీనికి కారణం ఓట్స్‌ విలువ ప్రజలకు తెలియడమే. మొదట్లో తక్కువ సమయంలో తయారయ్యే ఆహార పదార్ధంగా ప్రజలు భావించినా, రుచి పరంగా, ఆరోగ్య సంబంధ లక్షణాల కారణంగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొంది. అనేకమంది ఇళ్ళల్లో ఓట్స్‌ సాధారణ ఆహారం. ఓట్స్‌ చాలా తక్కువ సాంద్రత కలిగిన ఆహారం. బరువు తగ్గించడంలో ఓట్స్‌ మాత్రమే సరిపోదు, ఓట్స్‌తో పాటు కొన్ని డైటరీ ఫుడ్స్‌తో తీసుకోవాలి.
ఇతర తృణధాన్యాలు అన్నింటిలోకి ఓట్స్‌ ఉడికించడానికి, తినడానికి చాలా సులభంగా ఉంటాయి. వీటితో గంజి తయార చేసుకోవచ్చు. పండ్లు, పాలతో కలిపి తినవచ్చు. బ్రేక్‌ ఫాస్ట్‌ కోసం వీటితో వివిధ రకాల ఆహారాలు తయారుచేస్తున్నారు.
ఇటీవలి కాలంలో యువత ఎక్కువగా జంక్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌, నిలువ ఉంచిన ఆహార పదార్ధాల వైపు మొగ్గుచూపడం కాస్త భాదాకరమైన విషయం. ఒకవేళ ఇంట్లో అల్పాహారం చేసుకోవాలని ఆలోచిస్తే, నూడుల్స్‌ వైపు మొగ్గుచూపుతున్న కాలమిది. అధిక బరువు, వికారమైన పొట్ట, అధిక క్యాలరీలను కరిగించాలన్న ఆలోచన ఉన్నవారు ముందుగా చూసే అల్పాహారం ఓట్స్‌. పోషకాలను పూర్తి స్థాయిలో అందివ్వడమే కాకుండా, జంక్‌ చీజీ, యమ్మీ, నోరూరించే అనారోగ్య కొవ్వు ఆహార పదార్ధాల మూలంగా కలిగే అధిక కాలరీలను తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. అధిక బరువు అనేక వ్యాధులకు ప్రధాన కారకం.
రక్తపోటు, మధుమేహం, అజీర్ణ సమస్యలు మొదలైన సాధారణ దీర్ఘకాలిక సమస్యలకు ప్రధాన హేతువుగా ఈ ఊబకాయం ఉంటుంది. పిల్లలలో కనిపించే అనేక సాధారణ వ్యాధులు ఊబకాయం వలనే సంభవిస్తున్నాయి. ఓట్స్‌ బరువును తగ్గించటానికి సులభమైన ఆహారం. ఎక్కువ మొత్తంలో పోషక విలువలు ఉండడమే కాకుండా, మానవ శరీరానికి ప్రాధమిక పోషక అవసరాన్ని తీర్చటానికి సూచించదగ్గ ఆరోగ్యకరమైన ఆహారపదార్ధంగా ఉన్నది.
కొన్ని అధ్యయనాల ప్రకారం, వారంలో 5 సార్లు కనీసం ఓట్స్‌ ఆహారంగా తీసుకోవడం మూలంగా, శరీరంలోని క్రొవ్వులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతాయి. ఓట్స్‌, మానవ శరీరంలోని చెడు కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా కండరాలను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతుంది కూడా.
రోజూ ఆహారంలో ఓట్స్‌ ఎందుకు తీసుకోవాలి?
ఓట్స్‌, అధిక నీటి నిల్వలను నియంత్రించే తక్కువ పిండి పదార్ధాలను కలిగి ఉంటాయి. ఓట్స్‌ మన నడుము యొక్క చుట్టుకొలతను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా జీవక్రియను పెంచడం ద్వారా శరీరానికి ఊబకాయం వలన కలిగే రోగాలను సైతం దరిచేరనీయకుండా చూడగలదు.
ఒక కప్పు ఓట్స్‌ 4-5 గ్రాముల ఫైబర్‌ కంటెంట్‌ కలిగి ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ ఫైబర్‌ చెడు కొవ్వులను నిల్వ చేసుకున్న కణజాలాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ కణజాలాలు నిల్వ ఉంచుకున్న కొవ్వు శరీర అసాధారణ ఆకృతికి కారణమవుతుంది. ఇక పోషకాల విషయం గురించి మాట్లాడితే, ఓట్స్‌ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లలో పుష్కలంగా ఉంటాయి. దీనిలో ప్రధానంగా రెండు ప్రత్యేకమైన పోషకాలు ఉన్నాయి. అవి బీటా గ్లూకాన్స్‌, స్టెరోయిడల్‌ సఫోనిన్లు.
బీటా గ్లూకాన్స్‌ ఒక రకమైన కార్బోహైడ్రేట్‌. ఓట్స్‌ నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల ఇవి రక్తపోటుపై మిగిలిన ఆహారాలవలె ఎక్కువ ప్రభావం చూపదు. సాధారణంగా ప్రజలలో కనిపించే కొలెస్ట్రాల్‌ సమస్యలను సరైన మోతాదులో రోజూవారీ ఆహారప్రణాళికలో భాగంగా తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు.
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటివి బరువు పెరగడం వల్ల కలిగే సర్వసాధారణమైన రోగాలు. శరీరంలోని కొవ్వులను నియంత్రణలో ఉంచుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైన చర్య. ఆహార ప్రణాళికలో భాగంగా ఫైబర్‌, పోషకాలతో, తక్కువ పిండి పదార్ధాలు కలిగిన ఓట్స్‌ రోజూవారీ తీసుకోవడం మూలంగా అనేక సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.
ఓట్‌ మీల్‌ తయారు చేయడం చాలా సులభం. ఇష్టమైన పాలు, నీరు, బాదం పాలు, కొబ్బరి పాలు, పెరుగులో ఓట్స్‌ నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినవచ్చు. అరటి, ద్రాక్ష, దానిమ్మ, పైనాపిల్స్‌, కివి, నారింజ స్ట్రాబెర్రీ వంటి పండ్లతో చేర్చి తినవచ్చు. రుచిని పెంచడానికి పిస్తా, ఎండిన ద్రాక్ష, అక్రోట్‌, జీడిపప్పు బాదంపప్పులనూ జోడించొచ్చు. ఓట్స్‌లో కలిపే పదార్థాలను బట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పాలు, పెరుగు, నీటిలో నానబెట్టిన ఓట్స్‌ ఆవిరి వోట్స్‌ కంటే చాలా ఆరోగ్యకరమైనవి. వోట్స్‌లోని స్టార్చ్‌ అందులోని ఎసిటిక్‌ ఆమ్లాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఎందుకంటే ఇది చాలా కాలం తడిగా ఉంటుంది. వోట్స్‌ సులభంగా జీర్ణమవుతాయి.
ఓట్స్‌ ప్లెయిన్‌గా పాలతో కలుపుకొని తినడం మాత్రమే కాకుండా రుచికరంగా వివిధ రకాలా ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను జోడించి తయారుచేసు కోవచ్చు. ఓట్స్‌ను చికెన్‌, గుడ్ల కాంబినేషన్‌తో కూడా తీసుకోవచ్చు. వీటికి కొంచెం నిమ్మరసం మిక్స్‌ చేసి తీసుకొన్నా రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఇడ్లీపిండి కోసం రవ్వక బదులు, ఓట్స్‌ను మసాలాలను జోడిస్తే మరింత రుచికరంగా ఉంటుంది. నట్స్‌ మరింత ఆరోగ్యకరమైన స్నాక్‌ ఫుడ్‌. ఇవి మనకు తగినంత ఎనర్జీన్‌ బ్రెయిన్‌ పవర్‌ ను పెంచుతాయి. కాబట్టి, టాపింగ్‌ కోసం, బాదం, జీడిపప్పు, వాల్‌ నట్స్‌, ఫిగ్స్‌ వేసుకొని తీసుకొంటే, అధిక ఎనర్జీ పొందవచ్చు.
దోస సౌత్‌ ఇండియన్‌ బ్రేక్‌ ఫాస్ట్‌. దీన్ని బియ్యంపిండితో తయారుచేస్తారు. బియ్యం పిండికి బదులుగా, ఓట్స్‌ ఉపయోగించి తయారుచేసుకొనే దోసెలు లో క్యాలరీతో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఓట్స్‌తో పాటు ఆరోగ్యకరమైన పండ్లను సలాడ్‌ రూపంలో తీసుకోవడం వల్ల మరింత రుచిగా వుండడమే కాక పూర్తి న్యూట్రిషియన్స్‌ అందుతాయి. మసాలా ఓట్స్‌ ప్రస్తుతం మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ప్లెయిన్‌ ఓట్స్‌ ఇష్టం లేనివాళ్ళు మసాలా ఓట్స్‌ తినొచ్చు.
మనలో చాలామందికి ఇప్పటికే ఓట్‌ మీల్‌ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఒక సహజ పదార్ధంగా తెలుసు. ఓట్స్‌లో కరగని పీచుపదార్థాలు సమద్ధిగా ఉండటం. ఫైబర్‌ అధికంగా ఉన్న ఆహారాలు – మలబద్దకం నివారణకు ఉత్తమ మార్గాలు. గర్భిణీ స్త్రీలకి చక్కటి ఆహారం ఓట్స్‌గా అందుకే పరిగణిస్తారు. ఒక కప్పు ఓట్‌ మీల్‌ లో 4 గ్రాముల పీచుపదార్ధం ఉన్నట్లు అంచనా. వీటిలో 2 గ్రాములు మలబద్దకం నివారణకు అవసరమైన చికిత్స చేయగల కరగని ఫైబర్‌. ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, జింక్‌, థయామిన్‌, సెలీనియం, మాంగనీస్‌, ఇనుము వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి.
సౌందర్యపోషణలో ఓట్స్‌ పాత్ర
ఓట్స్‌ తింటే ఆరోగ్యానికి మంచిది. చర్మానికి రాసుకుంటే అందం. పొడి చర్మం ఉన్నవారు, మొటిమలతో భాదపడుతున్నవారు, ఇలా ఎవరు ఓట్స్‌ వాడినా ఉపయోగమే. ఈ ఓట్‌ మీల్‌ శరీర సౌష్టవానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి బాగా పనిచేసి ముఖానికి మంచి రంగును రూపును అందిస్తుంది. చర్మానికి తగినంత తేమను అందించి మాయిశ్చరైజ్‌గా సహాయపడుతుంది. చర్మ రంద్రాల్లోని మురినికిని ఎక్సెస్‌ ఆయిల్‌ ను తొలగించి, డీప్‌గా శుభ్రపరుస్తుంది. మొటిమలు, మచ్చలతో బాధపడు తున్నట్లైతే ఓట్‌ మీల్‌ సమస్యను నివారించి, డెడ్‌ స్కిన్‌సెల్స్‌ తొలగిస్తుంది. కొద్దిగా ఓట్‌ మీల్‌ను నీటిలో ఉడికించి చల్లబడిన తర్వాత ముఖానికి పట్టించాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సన్‌ బర్న్‌ వంటి సమస్యలను నివారిస్తుంది.
ముఖారవిందంతో పాటు, ముఖంలో మెరుపు నునుపుదనం ఉంటే ఆ ముఖం మరింత అందంగా కనబడుతుంది. ఫేస్‌ క్లీనింగ్‌ మాయిశ్చరైజింగ్‌తో పాటు రోజు మార్చి రోజు ముఖాన్ని స్క్రబ్‌ చేస్తుండాలి. ముఖం షైనింగ్‌గా మారుతుంది. స్క్రబ్‌కి మార్కెట్లో రసాయనిక ఉత్పత్తులను తెచ్చి వాడటం కంటే ఇంట్లోని వస్తువులు స్వయంగా ఉపయోగించడం వల్ల సహజ చర్మతత్వాన్ని కలిగి ఎటువంటి ఇన్ఫెక్షన్‌ సోకకుండా ఉంటుంది. ఓట్‌ మీల్‌ను తరచూ తీసుకొంటే సన్నబడుతారు. ఓట్‌ మీల్లో సపోనిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మం మురికి, ఆయిల్‌ను తొలగిస్తుంది. చాలా త్వరగా ఓట్‌మీల్‌తో క్లెన్సర్‌ను తయారుచేసుకోవచ్చు. రెండు చెంచాలా ఓట్‌ మీల్‌, ఒక చెంచ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె మిక్స్‌ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి గుండ్రంగా ముందుకు వెనకు మర్దన చేయాలి. 10 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
సన్‌ ట్యాన్‌ నుండి చర్మాన్ని కాపాడటానికి వోట్స్‌మీల్‌ ప్యాక్‌ పనిచేస్తుంది. ముఖంలో ట్యాన్‌ వల్ల ఏర్పడ్డ నలుపు రంగును తొలగించి చర్మం కాంతివంతంగా మెరుస్తూ న్యాచురల్‌ రంగుతో కనబడేలా చేయడానికి ఈ ప్యాక్‌ ను ఉపయోగించవచ్చు.
చర్మంలో బ్లాక్‌ హెడ్స్‌ చిరాకు పెట్టడం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. తరచుగా ధూళి, జిడ్డు చర్మానికి దారితీస్తుంది. ఈ కారణం చేత ఇది చర్మంలో బ్లాక్‌ హెడ్స్‌ ను కూడా పెంచుతుంది. కానీ ఈ ఫేస్‌ప్యాక్‌ను ఉపయోగించడం వల్ల బ్లాక్‌హెడ్స్‌ అనే శత్రువును చర్మం నుండి తొలగించవచ్చు. చర్మంలో ఇతర చికాకులను నివారించడానికి కూడా ఈ ప్యాక్‌ సహాయపడుతుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఈ ప్యాక్‌ ను చర్మ సంరక్షణలో భాగంగా వాడవచ్చు.
చిన్నవయస్సులో చర్మానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చర్మంలో వృద్ధాప్య లక్షణాలు తిష్టవేస్తాయి. అకాల వృద్ధాప్యం, చర్మంలో వివిధ రకాల సమస్యలను తగ్గించడానికి కొద్దిగా పెరుగు, వోట్స్‌మీల్‌ ఫేస్‌ ప్యాక్‌ ఉపయోగించవచ్చు.
బోనస్‌ పాయింట్‌
ఓట్స్‌ ఛాట్‌: ఓట్స్‌ తినటానికి ఇది తేలిక మార్గం. దోసకాయ, ఉల్లిపాయ, కేప్సికం, పచ్చిమిరప, టమాటాల ముక్కలలో ఓట్లు కలిపి తినండి. ఈ డిష్‌లో కొన్ని మసాలాలు, నిమ్మరసం వేస్తే సాయంకాలం స్నాక్స్‌గా తినవచ్చు. దీనిని తీపిగా కూడా చేయవచ్చు. అందుకుగాను దానిమ్మ /ఇతర పండ్లను చేర్చండి. ఇవి కడుపు నింపటమే కాక, ఆరోగ్యాన్నీ ఇస్తాయి.
మైనస్‌ పాయింట్‌
ఓట్స్‌ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో అంతే ఇబ్బందీ కూడా కలుగజేస్తాయి. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ, గ్యాస్‌ సమస్యలకు మాత్రం కారణమవుతోంది. ఓట్స్‌లో ఉండే సోలబుల్‌ ఫైబర్‌ పేగుల్లో ఎక్కువ గ్యాస్‌ ఉత్పత్తికి కారణమవుతుంది.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి
8008577834

Spread the love