కలిసి పనిచేద్దాం…విజయం సాధిద్దాం

Let's work together...let's succeed– ఎంపీ నామ నాగేశ్వరరావు
– అజాత శత్రువు నామను గెలిపించాలి
– రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
నవతెలంగాణ-వైరాటౌన్‌
బిఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే గుండెకాయ అని, పార్లమెంట్‌ ఎన్నికల్లో అందరం కలిసి మెలిసి పని చేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీఆర్‌ఎస్‌ ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం వైరాలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మదన్‌ లాల్‌, మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి మాట్లాడారు. కార్యకర్తలు కష్టపడి పని చేయబట్టే నాయకులుగా తాము ఎన్నో పదవులు అనుభవించామన్నారు. కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోయిన ప్రజల్లో ఇప్పుడు మార్పు వచ్చిందని, అవకాశం కోసం ఎదురు చూస్తూ కసితో ఉన్నారని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో ఏకీభవించి, కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్లమెంట్‌ విజయం నాంది కావాలన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి మోసపోయామని గ్రహించిన ప్రజలు ఈసారి కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కసిగా, సైలెంట్‌గా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ, జిల్లా ప్రజల వాణిని పార్లమెంట్‌లో విపించాలంటే తప్పనిసరిగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులు ఏనాడూ పార్లమెంట్‌లో ప్రజల పక్షాన నోరు విప్పలేదన్నారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మొదటి ఓటు తానే వేశానని గుర్తు చేశారు. రైతు బిడ్డగా ప్రజల కష్టాలు కళ్లారా చూశానని, 10 ఏళ్ల అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడెలా ఉందో చూస్తున్నామని అన్నారు. తాగు, సాగు నీరు లేక ఎండిన పంటలతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లవేళలా కార్యకర్తలకు వెన్నుదన్నుగా అండగా నిలుస్తానని అన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ నామాను గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. నామ గెలువునకు ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలన్నారు. కాంగ్రెస్‌ మాయ, మోసపు మాటలను నమ్మి మోసపోయిన ప్రజలు ఎన్నికల కోసం నిశ్శబ్దంగా కసితో ఎదురు చూస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్‌, రాములు నాయక్‌ మాట్లాడుతూ అబద్దాలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ను పార్లమెంటు ఎన్నికల్లో మట్టి కరిపించాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ కు క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్‌, కార్యకర్తలు ఉన్నారని, నామాను అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు గిఫ్టుగా ఇద్దామన్నారు. నామా అజాత శత్రువని, అందరికీ కావాల్సిన నాయకుడు నామాను అందరం కలిసి కట్టుగా ముందుకు సాగి, గెలిపించుకోవాలని అన్నారు. కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల్లో మార్పు వచ్చిందని, ఉత్తమ పార్లమెంటేరియన్‌ నామను మళ్లీ పార్లమెంట్‌కు పంపేందుకు శక్తియుక్తులను ప్రదర్శించాలన్నారు. బాణాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మదన్‌లాల్‌, రాములునాయక్‌, కొండబాల కోటేశ్వరరావు, ముళ్ళపాటి సీతారాములు, లాల్‌ అహ్మద్‌, రవి, విశేశ్వరరావు, జీవన్‌, మాదినేని సునీత, కాపా మురళీ కృష్ణ, నంబూరి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Spread the love