– ప్రధాని ప్రసంగాల్లో కాంగ్రెస్‌పై నిరాధార నిందలు
– మ్యానిఫెస్టోలో లేని అంశాలను ఆపాదించే ప్రయత్నం
– ప్రజలను గందరగోళంలో పడేసే ఎత్తుగడ
న్యూఢిల్లీ : గత వారం రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచార సభల్లో వాస్తవాలు కప్పిపెడుతూ, అబద్ధాల మీద అబద్ధాలు వల్లె వేస్తూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 21న రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో చేసిన ప్రసంగంతో ఈ అబద్ధాల పర్వం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల సొమ్మును కొల్లగొట్టి, దానిని ముస్లింలకు పంపిణీ చేయాలని యోచిస్తోందని మోడీ ఆ సభలో ఆరోపించారు. పైగా ముస్లింలపై చొరబాటుదారులు, అధిక సంతానాన్ని కనే వారు అనే ముద్ర వేశారు. వివిధ కులాలు, మతాల మధ్య పరస్పర విద్వేషాలను రెచ్చగొట్టడం లేదా ఉద్రిక్తతలు కలిగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. మోడీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాతే మోడీ తన ప్రసంగాల్లో ముస్లింల ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. అయితే మోడీ కేవలం ఒకే ఒక రోజు మాత్రమే నిగ్రహాన్ని పాటించారు. ఈ నెల 23న మరోసారి మైనారిటీ సమాజంపై నిందారోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజికంగా వెనుకబడిన హిందూ గ్రూపుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ నెల 21 నుండి 25వ తేదీ వరకూ వివిధ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ చేసిన ప్రసంగాలను ‘స్క్రోల్’ పోర్టల్ విశ్లేషించింది. ఆయన వాదనల్లో వాస్తవమెంతో నిగ్గు తేల్చింది. ముఖ్యంగా మతాల మధ్య చిచ్చు పెట్టేలా మోడీ చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించింది. ఆ వివరాలు….
21న బన్‌స్వారాలో…
రాజస్థాన్‌లో బన్‌స్వారాలో ఈ నెల 21న జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ఏమన్నారంటే…’వివాహిత హిందూ మహిళల మంగళసూత్రాలు సహా ప్రైవేటు సంపదలన్నింటినీ సర్వే చేస్తామని, స్వాధీనం చేసుకుంటామని, వాటిని పున:పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. నా తల్లులు, సోదరీమణుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కేవలం ప్రదర్శనకు ఉద్దేశించినవి కావు. వాటికి వారి ఆత్మగౌరవంతో సంబంధం ఉంది. వాటిని లాక్కుంటామని వార మ్యానిఫెస్టోలో బెదిరించారు’… అయితే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రైవేటు ఆస్తుల స్వాధీనం ప్రస్తావనే లేదు. మహిళల మంగళసూత్రాల మాటే లేదు. దేశ వనరులకు ముందుగా ముస్లింలే హక్కుదారులని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందంటూ మోడీ వివాదానికి తెరలేపారు. 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగాన్ని మోడీ వక్రీకరించారు. మతపరమైన మైనారిటీలే కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, మహిళలు, చిన్నారులు సహా దేశంలోని అణగారిన వర్గాలన్నింటినీ అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని మాత్రమే మన్మోహన్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రైవేటు సంపదను చొరబాటుదారులు, అధిక సంతతి కలిగిన ముస్లింలకు పంపిణీ చేస్తుందని మోడీ చెప్పారు. అసలు ముస్లింలు చొరబాటుదారులు అనడానికి ఆధారాలేవీ లేవు. అక్రమ వలసదారులపై తన వద్ద సమాచారమేమీ లేదని మోడీ ప్రభుత్వమే పార్లమెంటుకు తెలియజేసింది. హిందువుల కంటే ముస్లింలలో సంతానోత్పత్తి రేటు అధికమే గానీ ఇప్పుడది ఇతర మతాలన్నింటితో పోలిస్తే అది అత్యంత వేగంగా తగ్గిపోతోంది. పైగా సంతానోత్పత్తి అనేది ఆర్థిక పరిస్థితికి సంబంధించిందే తప్ప మతానికి సంబంధించింది కాదు. నిరుపేద రాష్ట్రమైన బీహార్‌లో నివసిస్తున్న హిందువుల కంటే బాగా అభివృద్ధి చెందిన తమిళనాడులోని ముస్లింలే తక్కువ మంది పిల్లలను కంటున్నారు.
22న అలీఘర్‌లో….
ప్రైవేటు ఆస్తులను సర్వే చేసి, స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో చెబుతోందని మోడీ మరోసారి తప్పుడు వాదన విన్పించారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంత ఆదాయం, ఆస్తి, సంపద, ఇళ్లు ఉన్నాయో సర్వే చేస్తుందని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి పంపిణీ చేస్తుందని, పార్టీ మ్యానిఫెస్టో ఈ విషయాన్నే చెప్పిందని రాహుల్ గాంధీ అంటున్నారు’ అని మోడీ తెలిపారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అలా చెప్పలేదు. ‘దేశాన్ని ఎక్స్‌రే తీస్తాము. దీనివల్ల దేశ సంపదలో తమ వాటా ఎంతో వెనుకబడిన తరగతులు, దళితులు, ఆదివాసీలు, సాధారణ ప్రజల్లో పేదలు, మైనారిటీలు తెలుసుకోగలుగుతారు’ అని మాత్రమే రాహుల్ అన్నారు. ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకొని, వాటిని తిరిగి పంపిణీ చేస్తామని ఆయన ఎక్కడా ఆనలేదు. కాంగ్రెస్ ఇలా చెప్పడం మావోయిస్టుల ఆలోచన కాదా అని ప్రధాని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ చెప్పిందేమిటి? భూ గరిష్ట పరిమితి చట్టాలను అనుసరించి ప్రభుత్వ భూములు, మిగులు భూములను మాత్రమే పేదలకు పంపిణీ చేస్తామని ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ఉంది.
24న సాగర్‌లో….
చట్టవిరుద్ధమైన పద్ధతుల ద్వారా మత ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించిందని మోడీ కర్నాటకలో ఆరోపించారు. ఓబీసీ కోటాలో ముస్లింలను చేర్చడాన్ని ఆయన ప్రస్తావించారు. వాస్తవానికి 1962లోనే కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ముస్లిం కులాలను ఓబీసీల జాబితాలో చేర్చింది. నాగన గౌడ కమిషన్ సిఫార్సుల మేరకే ఆ పని చేసింది తప్ప మత ప్రాతిపదికన కాదు. 1994లో దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్) ప్రభుత్వం అన్ని ముస్లిం కులాలనూ ఓబీసీల జాబితాలో చేర్చింది. వారికి 4 శాతం ఉప కోటా కల్పించింది. 12 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలను ఓబీసీ కేటగిరీలో చేర్చారు.
24న సర్‌గుజాలో….
మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ తొలుత ఆంధ్రప్రదేశ్‌లో ప్రయత్నించిందని, ఆ తర్వాత అదే కోటాను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూసిందని మోడీ తెలిపారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో కోత పడుతుందని చెప్పారు. వాస్తవానికి ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2005లో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దీనిని హైకోర్టు కొట్టివేసింది. 2009, 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలలో రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ 2019లో మాత్రం మౌనం వహించింది. కాగా కర్నాటకలో మత ప్రాతిపదికన కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసామని మోడీ గుర్తు చేశారు. కానీ నిజం ఏమంటే 2023 మార్చిలో బీజేపీ ప్రభుత్వం ముస్లిం ఓబీసీలకు 4 శాతం సబ్-కోటాను రద్దు చేసింది. కానీ ఆ కోటాను దళితులు, ఆదివాసీలకు ఇవ్వలేదు. దానికి బదులుగా ఆ కోటాను రాష్ట్రంలో ప్రాబల్యం కలిగిన లింగాయతులు, ఒక్కలిగులకు బదిలీ చేసింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వారసత్వ పన్ను విధిస్తామని కాంగ్రెస్ చెబుతోందని మోడీ విమర్శించారు. దీనిపై ఆయన ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆ ప్రస్తావన ఎక్కడా లేదు.
25న వివిధ ప్రాంతాల్లో…
ఓబీసీ కోటాలోని 27శాతం రిజర్వేషన్లలో కొంత భాగాన్ని విడదీసి మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ యోచిస్తోందని మోడీ చెప్పుకొచ్చారు.అయితే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఈ ప్రస్తావనే లేదు. వారసత్వ పన్ను విధింపునకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రధాని మరోసారి ఏకరువు పెట్టారు. అదే రోజు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో లేని పలు అంశాలను ఆ పార్టీకి ఆపాదించారు.
23న టాంక్-సవారు మాదోపూర్‌లో….
రాహుల్ చేసిన ‘ఎక్స్‌రే’ వ్యాఖ్యకు మోడీ విపరీతార్థాలు తీశారు. ప్రజల వద్ద రెండు ఇళ్లు ఉంటే వాటిలో ఒక దానిని కాంగ్రెస్ లాక్కుంటుందని చెప్పారు. అయితే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కానీ, ఆ పార్టీ నేతల ప్రసంగాల్లో కానీ ప్రజల ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని కానీ, వాటిని తిరిగి పంపిణీ చేస్తామని కానీ ఎక్కడా చెప్పలేదు. మోడీ తన ప్రసంగంలో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను మరోసారి వక్రీకరించారు.
24న బేతల్‌లో….
ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ గ్రూపుల నుండి రిజర్వేషన్లు గుంజుకొని వాటిని ప్రత్యేక ఓటు బ్యాంకుకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందని మోడీ చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రణాళికలో మత రిజర్వేషన్ల ఊసే లేదు. పన్నును మోడీ మరోసారి ప్రస్తావించారు. వారసత్వ పన్ను విధించాలని అప్పటి హోం మంత్రి చిదంబరం సూచించినప్పటికీ కాంగ్రెస్ అంగీకరించలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే వారసత్వ పన్నును మోడీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైటీ కూడా ప్రస్తావించారు.