అభివృద్ధి కోసం.. తోడుకై జీవం పోయండి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

– గల్లీలో బీఆర్ఎస్ ను ఓడించాం.. ఢిల్లీలో బీజేపీని ఓడిద్దాం..

– కుల, మతాలకు అతీతంగా భవిష్యత్తు కోసం ఓటేద్దాం..
– బీజేపీ రైతులకు రుణమాఫీ చేయకుండా కార్పొరేటర్లకే రుణమాఫీ..
– అభివృద్ధి చేయని అరవింద్ ను రిజెక్ట్ చేద్దాం..
– మైనార్టీలు ఓట్లేసి మెజార్టీ ఇవ్వాలి..
– బీఆర్ఎస్ ఎంపీపీ, ఎంపీటీసీ లు, నాయకులు, మైనార్టీలు మహిళలు కాంగ్రెస్ లో చేరిక..
నవతెలంగాణ – నవీపేట్
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకు తోడుగా జీవన్ రెడ్డిని గెలిపించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేండ్లలో విద్యా, వైద్యం, వ్యవసాయం, మహిళలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని అందుకే గల్లీలో బీఆర్ఎస్ ను ఓడించామని ఇక ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు, కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తానని చెప్పిన బీజేపీని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని బిఆర్ఎస్ పాలకులు భూముల దోపిడి కోసం ధరణి తీసుకొచ్చారని, ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తనకు తోడుగా జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మైనార్టీలు అత్యధిక శాతం కాంగ్రెస్ కు ఓట్లేసి మెజార్టీ ఇవ్వాలని అన్నారు.
రైతులకు రుణమాఫీ చేయకుండా కార్పొరేటర్లకే రుణమాఫీ: జీవన్ రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారని చెబుతూ అంబానీ, ఆదాని లాంటి కార్పొరేటర్లకు లక్షల కోట్ల రుణమాఫీ చేస్తుందని అన్నారు. గతంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దేనని గుర్తు చేశారు. రైతు బిడ్డ అయిన తనకు రైతుల కష్టాలు తెలుసని అన్నారు. తనను గెలిపిస్తే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తానని, పసుపు  రైతులకు క్వింటాలుకు 15వేల రూపాయల మద్దతు ధర, బోధన్- బీదర్ రైలు ప్రారంభిస్తానని గల్ఫ్ కార్మికులకు విద్య, వైద్యం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో ఐదు రూపాయల అభివృద్ధి చేయని అరవింద్ ను ఓడించాలని షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తానని మోసం చేసిన బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని అన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎంపీపీ సంగెం శ్రీనివాస్, ఎంపీటీసీ సతీష్, మాజీ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, నాయకులు, మైనార్టీలు, మహిళలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్, తాహెర్ బిన్ హందాన్, అరికెల నర్సారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బుచ్చన్న, మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love