భయంతో బతుకుతున్నారు

with fear
are living– మోడీ పాలనలో మైనార్టీలపై వివక్ష
– దేశంలో 2900 మత ఘర్షణలు
– సీఎం కేసీఆర్‌ మైనార్టీలపై దాడులను ఖండించలేదు
– కేంద్ర మాజీ మంత్రి చిదంబరం
– ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే స్థితి దాపురించింది : రేవంత్‌
ప్రధాని మోడీ పాలనలో మైనార్టీలపై వివక్ష కొనసాగుతున్నదని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు భయాందోళనలలో బతుకుతున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై 2900 మతపరమైన ఘర్షణలు జరిగాయని తెలిపారు. వాటిని గురించి సీఎం కేసీఆర్‌ ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు. శనివారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో కాంగ్రెస్‌ క్రిస్టియన్‌ విభాగం నిర్వహించిన క్రిస్టియన్‌ హక్కుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో మార్పు రాబోతున్నదని కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రజల భాష తెలియకపోవచ్చుకానీ వారి బాధలు అర్థమవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కానీ కాంగ్రెస్‌ను ఎన్నుకోకుండా వేరే పార్టీని ఎన్నుకున్నారని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఉంటే, తెలంగాణ అభివృద్ధి మరోలా ఉండేదని చెప్పారు. చాలా మంది కాంగ్రెస్‌ రాలేదని బాధపడుతున్నారని చెప్పారు. ఇటీవల సీడబ్య్లూసీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన విజయభేరి సభే అందుకు నిదర్శనమన్నారు. ఆ ర్యాలీలో 40 నుంచి 45 శాతంమంది యువత పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగం 8శాతానికి పెరిగిపోయిందన్నారు. ఉన్నతస్థాయి విద్యనభ్యసించిన 40 శాతం మందికి ఉపాధి లేదన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారభద్రత కరువైందని చెప్పారు. ధరల పెరుగుదలతో పేదలు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. సంపాదించినదంతా అప్పులు చెల్లించడానికే సరిపోతుందన్నారు. భారతదేశంలో మత స్వేచ్ఛ లేదంటూ అమెరికాకు చెందిన ఓ సంస్థ ఆందోళన వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. క్రిస్టియన్‌ సంస్థలు పేద ప్రజల విద్య, వైద్యం కోసం పాటుపడుతుంటే, వారికి వస్తున్న నిధులను బీజేపీ సర్కారు రద్దు చేసిందని విమర్శించారు. దీంతో 6622 సంస్థలు మూతపడ్డాయని తెలిపారు. ప్రజా స్వామ్యంపై బీజేపీ దాడి చేస్తోందన్నారు. ప్రజాస్వా మ్యం, స్వాతంత్య్రం చెరువుల్లో నీళ్లలా ఇంకిపోతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధికంగా క్రైస్తవులు, ముస్లింలు హింసించబడుతున్నారని తెలిపారు.పౌర హక్కులకు ప్రజాస్వామ్యం కవచ ంలాంటిందని, దాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చా రు. ఆదివాసీ, గిరిజనుల కోసం జీవితాన్ని అంకితం చేసిన స్టాన్‌ స్వామిని అరెస్టు చేసి జైల్లో పెట్టారనీ, కనీసం బెయిల్‌ కూడా ఇవ్వలేదన్నారు. చివరకు ఆయన జైల్లో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రుల్లో 79 మంది ఉంటే, అందులో ఒక్కరే క్రిస్టియన్‌ మంత్రి ఉన్నారని తెలిపారు. 34 మంది సుప్రీం కోర్టు జడ్జిల్లో క్రిస్టియన్‌ జడ్జి లేరని గుర్తు చేశారు. క్రిస్టియన్లు దేశ పౌరులేననీ, రాజ్యాంగబద్ధంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలన్నారు. కానీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి దేశంలో దాపురించిందని చెప్పారు. మైనార్టీలకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రిస్టియన్‌ మైనార్టీల కోసం వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. డిమాండ్లను అమలు చేయాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో హంగ్‌ వస్తే కలవబోయేది బీజేపీ, బీఆర్‌ఎస్‌ అని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే, ప్రచార కమిటీ చైర్మెన్‌ మధుయాష్కీగౌడ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు అనిల్‌ థామస్‌, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Spread the love