జీవించడం ఓ కళ

‘జీవించడం ఓ కళ’ అంటారు చిత్రకారుడు సూర్యదేవర సంజీవ్‌. ఆయన చెప్పిన దాన్ని నేను ఉదాహరణగా నా మిత్రుడు వెంకట్రామయ్యనే గుర్తుచేసుకుంటూ ఆయన గురించే చెబుతుంటా. ఆయన రిటైరయి దాదాపు 30 సంవత్సరాలు అయినా ఆయన ముఖంలో కొద్దిమాత్రపు వృద్ధాప్యఛాయలు కనిపిస్తాయి కానీ శరీరంలో పటుత్వం, ముఖంపై చెరగని చిరునవ్వు, చూపుల్లోని చురుకుదనం, కంఠంలోని మార్ధవం చెక్కుచెదరలేదు. స్వభావంలోనూ ఏ మార్పు రాలేదు. వెంకట్రామయ్య, నేను క్లాస్‌మేట్స్‌ కాకపోయినా మా ఊరే కాబట్టి ఆయన నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నేనూ రిటైరయిన తరువాత సిటీలో ఆయనకు నైబర్‌గా వుంటున్నాను.
ఉపాధ్యాయునిగా పనిచేసినప్పటి నుండి ఉదయం 5 గంటలకు నిద్ర లేచి పద్ధతి ప్రకారం తన రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకుని 8 గంటల కల్లా వాలు కుర్చీలో కూర్చుని వార్తాపత్రిక చదువుతూ కనిపిస్తారు. నా కార్యక్రమాలు ముగించకుని వెంకట్రామయ్యగారింటికి వెళ్తుంటాను. నన్ను చూసిన ఆయన లేచి నిలబడి పక్కనే వున్న కుర్చీ చూపుతూ కూర్చొమ్మంటారు. నేను వచ్చినట్టు తన శ్రీమతితో చెబుతారు. ఆమె కాఫీ కప్పులు వున్న ట్రే మాముందున్న టేబుల్‌పై పెడుతూ ”అన్నయ్యా… వదిన ఏం చేస్తుంది?” అనగానే నేను ”ఏమందమ్మా… కోడలుతోపాటే నిద్రలేచి తన రోజువారి పనుల్లో మునిగిపోతుంది. మా కోడల 8 గంటలకల్లా బాక్స్‌ పెట్టుకుని స్కూల్‌కి బయలుదేరుతుంది. మా అబ్బాయి తల్లి పెట్టిన క్యారియర్‌తో వాడూ ఆఫీసుకు బయలుదేరతాడు. మనుమలను తయారుచేసి బాక్స్‌లు సర్ది వారిని ఇంటిముందుకే వచ్చే బస్సు ఎక్కిస్తుంది. ఇదీ ఆమె టైం టేబుల్‌”.
”కొడకులకు పెళ్లి చేసినా అత్తలకు దినచర్య తప్పడం లేదన్నయ్యా” అంటూ లోపలికెళ్లింది. నా మాటగా ”ఇవన్నీ మామూలేనమ్మా” అన్నాను.
”వెంకట్రామయ్యగారూ… ఈనాటి వార్తలేమిటండి” అనగానే, ”జపాన్‌లో వంద సంవత్సరాల వయసు గల వారి సంఖ్యే అధికమట. ఇది నేటి ప్రత్యేక వార్త” అన్నారు.
నేను అవునంటూ ”వారి జీవన విధానమే అందుకు కారణం. ఆ దేశస్థులు ఎప్పుడూ ఏదో పనిచేస్తూ కనిపిస్తారట. యువకులతో పోటీపడుతున్నట్లు కనిపిస్తారట. వారి ప్రతి మాట, పని కూడా నిర్మాణాత్మకంగా వుంటాయని పరిశోధనల్లో తేలిన విషయంగా చెబుతుంటారు. ఆరోగ్య నియమాలను పాటిస్తూ కళాత్మకంగా జీవించటానికి ఆరాటపడుతుంటారట” అన్నాను.
”ఇదే విషయం నేనూ విన్నాను. దీన్నే జీవించడం ఓ కళ అంటారు” అని వెంకట్రామయ్య అన్నారు.
”వెంకట్రామయ్యగారూ… చాలామంది బతకడాన్నే జీవించడం అనుకుంటారు” అన్నాను.
”జీవించడానికి, బతకడానికి మధ్య చాలా తేడా వుంటుంది. ఈ విషయం కొందరు మాత్రమే అర్ధం చేసుకుంటారు. బతకడానికి తినాలి. జీవించడానికి కొద్ది పద్ధతులు ఆచరిస్తూ బతకాలి” అన్నారు.
”మొన్నీమధ్య పక్షవాతానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నా చిన్ననాటి మిత్రున్ని చూడడానికి వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు సవివరంగా చెప్పి, వారిని ఎడ్యుకేట్‌ చేశాను” అంటూ చెప్పడం ప్రారంభించాను.
”నర్సింహరాములు, నేను చిన్ననాటి నుండి డిగ్రీ వరకు కలసి చదువుకున్నాం. ఇద్దరి అభిప్రాయాలు, ఆచరణలు, ఆలోచనలు ఒకటే! ఆదర్శ ఉపాధ్యాయులుగా ఇద్దరం నెలల తేడాతో రిటైరయ్యాం. పిల్లల బలవంతంపైన మా సొంత ఊరు వదిలి నేనిక్కడికి వస్తే, వాడు హైదరాబాద్‌కు వెళ్లాడు. పెద్దబ్బాయి కుటుంబంతో వుంటున్నాడు. నేను వెళ్లగానే సంతోషపడిన కుటుంబ సభ్యులు వాడి గురించి మొదట వాడి భార్య ”అన్నయ్యా, మీ బావ వద్దన్నపని చేస్తుంటాడు. ఆయన గారు మా మాట వినడం లేదు” అంటూ ఫిర్యాదు చేసింది. నర్సింహరాములు కొడుకు ”మామయ్యా.. ఐదు గంటలకే లేస్తాడు. ఓ అరగంట ఇంట్లో నడుస్తాడు. ఆ తరువాత అరగంట పాటు న్యూస్‌పేపర్‌ తిరగేస్తాడు. 8 గంటలకల్లా స్నానం చేస్తాడు. వీధిలో వేసిన సిమెంట్‌ బల్లపై కూర్చుంటాడు” అంటుండగానే వాడి భార్య వచ్చి ”బాబారు, వచ్చిపోయే వాళ్ల యోగక్షేమాలు, వారి పిల్లల చదువు గురించి అడుగుతుంటాడు. మామయ్యను ఎక్కువ మాట్లాడకూడదని డాక్టర్‌ మరీ మరీ చెప్పాడు. ఈయన ఒక్క నిమిషం కూడా సైలెంట్‌గా వుండలేరు” అన్నది.
అందరి మాటలు విన్నాక నేను ”చూడండి! వాడికి కొద్దిగా ఆరోగ్యం బాగుందనిపిస్తుందేమో, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. మేం ఓ పద్ధతిగా జీవించటానికి అలవాటుపడ్డాం. ఎవరితో మాట్లాడకుండా వుండటం మా వల్లకాదు. మిమ్మల్ని మేం అందంగా తీర్చిదిద్దడమే కాదు, జీవించే విధానంలో కూడా మమ్మల్ని మేం తీర్చిదిద్దుకుంటాం. దీన్నే కళాత్మకంగా జీవించడం అంటారు. ఈ విషయాన్నే ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ భావనకు ఆధ్యులైన శ్రీశ్రీ రవిశంకర్‌గారు – ‘ఇతరులతో ప్రేమపూర్వకంగా, సానుకూల భావనతో వ్యవహరించడం, నలుగురితో కలిసి ప్రేమపూరకంగా మాట్లాడడం, సమయపాలన పాటిస్తూ ప్రణాళికాబద్దంగా జీవించడానికి ప్రతివ్యక్తీ అలవాటుపడితే ప్రశాంతంగా జీవించగలుగుతారు’ అంటారు.
1999 వ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కళాత్మకంగా జీవించడం కోసం సానుకూల కార్యక్రమాలతో సమర్ధవంతంగా, సంతృప్తికరంగా జీవించడానికి అవసరమైన నైపుణ్యాలను ఆచరించాలంటూ పది నియమాలను సూచించింది. వాటిలో ముఖ్యమైనవి…
– సమస్యలను తగు నిర్ణయాలతో పరిష్కరించుకోవడం.
– సృజనాత్మక (కొత్తగా) ఆలోచనలు చేయడం.
– ఇతరులతో ప్రేమపూర్వకంగా సంభాషించడం, ఎదుటివ్యక్తి మాటల్ని శ్రద్ధగా వింటూ సానుకూలంగా స్పందించడం.
– అవసరమైన విషయాలపట్ల అవగాహన కలిగుండడం.
– సామాజిక స్పృహ (సమాజంలోని వ్యక్తులపట్ల మంచి అవగాహన) కలిగి ఉండడం.
ఇవేగాక వ్యక్తిగతంగా సమాజంలో గౌరవప్రదంగా ఆనందంతో జీవించడానికి ఏర్పరచుకున్న వాటిని ఆచరిస్తూ ఉండడం వల్ల మనిషి తన జీవితకాలాన్ని పెంచుకోవచ్చంటారు మనో వైజ్ఞానికులు. వీటన్నింటి సారాన్ని బట్టి ‘జీవించడం ఓ కళ’ అనవచ్చని చెప్పాను వెంకట్రామయ్యగారు” అని ముగించాను.

– పరికిపండ్ల సారంగపాణి, 9849630290
కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌, హన్మకొండ, వరంగల్‌

Spread the love