మ‌హిళా..శ్ర‌మ..విలువ‌…

రంగురంగుల చీరలు…
కళకళలాడే కళాశాలలు…
‘ఒరేరు ఈ రోజు వంట మనమే చేద్దాం, అమ్మకి రెస్ట్‌ ఇద్దాం’…
గిఫ్టులు, బొకేలు.. ఎర్ర గులాబీలు, మల్లెపూలు, దండలు, దండాలు, ముగ్గులు, మాటలు, మాటలతో ముగ్గులు, సమావేశాలు, సందేశాలు, సన్మానాలు. స్కూళ్లల్లో, కాలేజీలలో, ఆఫీసులలో ఆడవారి అద్భుతాల బావుటాను ఎగరవేసే రోజు. ఆమె శ్రమను, ఘనంగా కీర్తించే రోజు. భలే మాంచి రోజు. పసందైన రోజు. ఓం ప్రధమంగా అసలు ఈ రోజు ఎలా ఏర్పడిందో చూద్దాము.
8 మార్చ్‌ 1908న, న్యూయార్క్‌ నగరంలో సూదుల ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులు బాలకార్మిక వ్యవస్థను, ప్రమాదకర పని పరిస్థితులను వ్యతి రేకిస్తూ అలానే మహిళలకు ప్రాథమిక హక్కులు కావాలని వీధుల్లోకి వచ్చి నినదించారు. ఆ తరువాత 1910 నుండి, మార్చ్‌ 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించారు. అదే సంవత్సరం ఆగస్టు 26వ తేదీన క్లారా జెట్కిన్‌(1857-1933) ఆ వార్షిక మహిళా దినోత్సవ సందర్బంగా మహిళల ప్రాథమిక హక్కులను మొట్టమొదటి డిమాండ్‌గా కోపెన్‌ హాగెన్‌లో జరిగిన సోషలిస్ట్‌ మహిళల రెండవ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ముందు ఉంచింది. ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన సామజిక, ఆర్ధిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను వేడుక చేసుకొనేందుకు ఏర్పడింది.
వారి నిరంతరం శ్రమతో…
ఈ రోజు జెండర్‌ సమానత్వం కోసం చేసే ప్రయత్నాలను వాస్తవంలోకి తీసుకు రాగలిగే ప్రయత్నాలను మరింత ప్రభా వితంగా ముందుకు నడిపే ఒక ప్రత్యేక దినంగా చూస్తారు. ఈ వందేళ్లలో ఇందరు నిరంతరం శ్రమ పడితేనే ఈ రోజు మనకి ఉద్యోగాలు, వాహనాలు, చట్టాలు, గొంతుక, ప్రశ్న, బాధ్యత వచ్చింది. మన దేశాన్ని ఇందిరా గాంధీ పరిపాలించింది, కల్పనా చావ్లా విశ్వమంతా తానై రెక్కలుసాచి ఎగిరింది, పూర్ణ మాలావత్‌ ప్రపంచంలో అన్ని ఖండాలలోకి ఎత్తైన పర్వతాలను అధిరోహించింది. పల్లెటూరిలో ఒక అడుగు భూమి లేని మహిళల కూతుర్లు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలను సాధిస్తున్నారు. కానీ మహిళ అని ప్రస్తావించినప్పుడల్లా మనకై మనం పదేపదే వేసుకోవలసిన ప్రశ్న ఒకటి ఉంది. మనం ప్రస్తావించే మహిళ- ఏ మహిళ, ఎటువంటి మహిళ?
మహిళంటే…
మన దేశపు మహిళ ఒక్కరని కాదు… ఆదివాసీ మహిళ, దళిత మహిళ, శారీరక లేదా మానసిక వైకల్యం ఉన్న మహిళ, ట్రాన్స్‌ మహిళ, వలస మహిళ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళ, వివక్షకు గురయ్యే మహిళ, విజయాలు సాధించే మహిళ, ఇంటికి పరువు అంటే బరువును మోస్తున్న మహిళ… ఇలా అందరు మహిళలు వస్తారు కదా! వీరందరికి సాధికారత రావడమే మన లక్ష్యం కదా! ఐతే మహిళా సాధికారత గురించి మాట్లాడినప్పుడల్లా మనం సాధారణంగా చేసే పొరపాట్ల నుండి నేర్చుకుందాం రండి.
మహిళలు లేకుండా ఊహించలేం
మహిళల హక్కుల గురించి జరిపే పోరాటంలో తక్కువ వేతనాలపై పోరు ఒక వర్గానికి మాత్రమే చెందినది కాదు. ఇది పల్లెటూర్లలో పని చేసే మహిళా రైతు కార్మికుల నుండి గొప్ప గొప్ప కార్పొరేట్‌ ఉద్యోగుల వరకు సాగుతోంది. ఈ పోరాటం ఆపకూడదు. పోరాటానికి ఆవల జరుగుతున్నా అన్యాయాన్ని కూడా గుర్తించడం అవసరం. మనం కుటుంబం అన్నా ఇల్లు అన్నా మహిళలు లేకుండా ఊహించలేము. మహిళలు ఉంటేనే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. డబ్బుని ఆహారంగా తినలేము కదా! అంతర్జాతీయ మహిళా హక్కుల కార్యకర్త కమల భాసిన్‌ అన్నట్టు, ఆ డబ్బుని ఆహారంగా మార్చేది మహిళలే. మాసిన బట్టలను పువ్వుల్లా మార్చి తిరిగి మనం వేసుకునే స్థితికి తీసుకు వచ్చేది మహిళలే. అలానే వంట పని, ఇంటి పని… ఇంతేనా? ఇంట్లో ఎవరికీ జబ్బులు వచ్చినా వారిని చూసుకోవడం, మందులు, పత్యాలు, నీరసాలకు రకరకాల ద్రవాలు, కాళ్ళు నొక్కడాలు, తల పట్టడాలు, వాంతులు, విరోచనాలు… ఆగండాగండి. ఇంకా ఉన్నాయి ఇంట్లో ఒకరి మూడ్‌ బాగా లేకపోతే సర్దడాలు, సర్ది చెప్పడాలు, సరైన వాతారణం ఇంట్లో ఉండేలా శ్రమపడడాలు, దానికోసం మాటలు పడడాలు, శ్రమ, ఒత్తిడి వీటికి ఇవ్వవలసిన విలువ మాటేమిటి?
ఇదొక్కటే కాదు ఇలాంటివెన్నో.
మన చేతుల్లోనే ఉందా..?
మనం తెలుసుకోవాలనుకుంటే స్త్రీ జీవితం ఒక సమాజపు రాజకీయ పరిస్థితికి నిదర్శనం. ఇటువంటి కొన్ని విస్మరించే విషయాలను తరచి తరచి చూసి అర్థం చేసుకోవలసింది ఎంతో ఉంది. మనం చెయ్యలేదు కాబట్టి మరెవరు చేయలేదు. ఇదే మాట మరొకలా చెప్పొచ్చు. మనకు జరగలేదు కాలేదు కాబట్టి మరెవరికి జరగలేదు. ‘నన్నెవరూ బాధ పెట్టలేదు కాబట్టి ఏ మహిళా బాధ పడలేదు. నేనెప్పుడూ వివక్షకు గురికాలేదు కాబట్టి, మరే మహిళా వివక్షకు గురి కాలేదు. నాకు నా తల్లిదండ్రులు, భర్త ఆంక్షలు పెట్టలేదు కాబట్టి, అందరూ తల్లిదండ్రులు, భర్తలు పెట్టరు. సమాజం ఇప్పుడు మారింది. ఇంతగా మనం ఫిర్యాదు చేయవలసిన పనిలేదు’ ఇందాక చదువుకున్నట్లు సమాజంలో ఒక వర్గపు మహిళ మాత్రమే లేదు. ఒక్కొక్క కుటుంబం ఒక్కో చిన్న ప్రపంచం. ఆ కుటుంబ పోకడలను ఏ ఒక్కరం అంచనా వేయలేము. మన కుటుంబంలో జరిగే పద్ధతులను విశ్వజనీయం చేయలేము. మనకు అవకాశం రాగానే అందరికి వచ్చినట్లుగా భ్రమిస్తారు చాలామంది. మగవారు కూడా మీకేంటి అన్నట్టు మాట్లాడతారు. కానీ ఒక ఇంజనీరింగ్‌ సీట్‌ సంపాదించడమో లేక ఒక ఉద్యోగాన్ని వెలిగించడమో కాదు. మన సమయం, ఆరోగ్యం, సంపాదన, శ్రమ మన చేతుల్లోనే ఉందా లేక సమాజపు తర్జనికి భయపడి చేతుల నుండి జారిపోతుందా?
హింసను ఉపేక్షించలేక
నేను చేయను కాబట్టి మరెవరు చేయరు, మాకు వివక్ష లేదు కాబట్టి, ఈ రోజుల్లో వివక్ష లేదు అంటారు. వివక్ష ఉందని తెలియడానికి వార్తలు చదివితే చాలు. మనలో కూడా వివక్ష పూర్వపు వాసనలు దాటి వచ్చి ఉండొచ్చు కానీ కొన్ని శతాబ్దాలుగా జీర్ణించుకుపోయిన ఆలోచనలను నిజాయితీగా తరచి చూసుకుంటే మనలోనూ వివక్ష బయటపడుతుంది.
మనం నమ్మినవే విలువలు కావు. కొత్త తరానికి వారి కంటూ వారి విలువలు ఉన్నాయి. పాత త్రాసుతో కొత్త తరాన్ని తూచి తప్పుడు అంచనాలకు రాకూడదు. ఈ రోజుల్లో త్వరగా బ్రేకప్పులు, డివోర్స్‌లు అవుతున్నాయంటే దానికి పూర్తి కారణం అర్థం చేసుకోలేకపోవడమో, సర్దుపోలేకపోవడమో కాదు. వారికి హింసను ఉపేక్షించే తత్త్వం లేదని. అంటే వారు సమాజపు కోరలు దాటి స్వేచ్ఛగా ఆలోచించగలుగుతున్నారని. పెళ్లి లేదా యే బంధమైనా జైలు కాదు. హింసను ఉపేక్షించకపోవడం, ఉపేక్షించకుండా ఉండేదుకు వనరులు, విద్య, ఉద్యోగం, తల్లిదండ్రుల సహకారం ఉండడం సంతోషించే విషయమేగా. ఒక మాట చెప్పినట్లు ‘ఆత్మహత్య చేసుకున్న కూతురి కన్నా హింసించే భర్తను వద్దనుకున్నా కూతురు నయం కాదు?’.
ఆచారాలా… అవమానాలా?
మన ఆచారాలు ప్రకృతితో మమేకమయి ఉన్నాయి. అవి మనిషి-ప్రకృతిలా సహజీవనాన్ని తెలియజెప్పేవి. ఉదాహరణకు సంక్రాతి పండగ ప్రకృతిలో పాడి పంటలకు, మనుషులకు, ఆహారానికి ఉన్న సంబంధాన్ని ముందుకు తెస్తుంది. అది ఒక అందమైన వేడుక. గతించి పోయిన పెద్దలను తలుచుకోవడం, పాత సామాను భోగి మంటలలో విసిరేసి కొత్త ఆలోచనలను ఆహ్వానించడం. ఇటువంటి అద్భుతమైన ప్రతీకలు మన సంస్కృతిలో చూడవచ్చు. కానీ ఇదే సంస్కృతి పితృస్వామ్యంతో కలగలిసి ఉంది. అది అసమానతలను పెంచుతోంది. అక్కడ మనం ప్రశ్నించాలా వద్దా? ఇక్కడ రెండు ఆచారాల పేరుతో జరిగే హింసను, అవమానాన్ని గమనిద్దాం.
బహిష్టు సమయంలో జరిగే వేర్పాటు
ఇది ఆడవారిని వారి శరీరాల్ని, శారీరకమైన ప్రక్రియలను అవమాన పరచడం గాక మరేమిటి? తమ శరీరాలు తప్పు అని, ఇందులో పాపం ఉందని, ఇది పవిత్రము, అపవిత్రము అని నేర్పుతున్నాం మన ఆడపిల్లలకు. తమని తాము వివక్షకు గురి చేసుకుంటూ ఇది ఆచారం అని నమ్మే పిచ్చి తల్లులకు తమ శరీరాన్ని ప్రేమించడం, గౌరవించడం కూడా ముఖ్యమనే విషయం తెలియజేయొద్దా? ఆడవారి శరీరంపైన, ఆరోగ్యం పైన ఉంచవలసిన ధ్యాసను ఏ స్థితిలో శరీర ధర్మాల వలన జరిగే చర్యలను బట్టి తమ శరీరం పవిత్రమో కాదో నిర్ణయించే చట్రంలో బంధించడం సాధికార మార్గమేనా? నిజానికి ప్రకృతిలో ఎవరి శరీరమైనా ఒక అద్భుతం. అందులో జరిగే శారీరక ప్రక్రియలు మహాద్భుతం. ఒక జీవి నుండి మరొక జీవి ప్రాణం పోసుకోవడం ప్రపంచాన్ని కొనసాగించే మహాద్భుత క్రియ. అది ఆడవారి శరీరంలో జరగడం వలన ఆ శరీరం పట్ల ఇంకా గౌరవం పెరగాలి. ఆ దిశగా అందరం ఆలోచించగలగాలి. భర్త చనిపోయాక జరిగే తంతు భర్త చనిపోయిన ఇల్లాలిని అందరి మధ్యలో బొట్టు చెరిపి వేయడం, గాజులు తీయమనడం, తెల్ల చీర కట్టడం ఇదంతా వ్యవస్థాపక నిర్మాణాత్మక హింసే. ఆమె ఆత్మను ముక్కలు చేసి రేపటి నుండి శుభకార్యాలకు నువ్వు పనికి రావు అంటూ ఆమెను అవమానించడం సదాచారం ఎలా అవుతుంది? భార్య చనిపోయిన మగవారికి ఈ ఆచారాలనన్ని ఎందుకు లేవు? పై రెండు విషయాలు మనం ఆచారం అని నమ్ముతున్నాం. అవమానం అని మర్చిపోతున్నాం. ఘోరం ఏంటంటే ఒక ఆడమనిషి చేత మరో ఆడమనిషిని అవమానిస్తున్నాం. ఇటువంటి వేర్పాటు ఒక పితృస్వామ్య కుట్ర మాత్రమే.
ఇదా సాధికారతకు దారి?
సంస్కృతిని దుయ్యబట్టడం వలన మహిళా సాధికారత రాదు. కానీ ఆచారాల పేరుతో మహిళలపై జరిగే హింసను కొనసాగిస్తే మహిళా సాధికారత రాదు. వారి శరీరంపైనే వారికి హక్కు లేనప్పుడు, ఇక సమాజంలో ఏ హక్కులుంటేనేమి?
మనలను మనం ప్రేమించుకొవడం స్వార్థమా?
మన గురించి మనం పట్టించుకోవడం. మన మేధ, మన ఆరోగ్యం, ఆనందం, సమయం, ప్రశాంతత వీటి గురించి పాటుపడడం తప్పుగా వ్యవస్థ మనలను మార్చింది. మహిళలు మొదటగా వారి పిల్లల గురించి, తరవాత భర్త గురించి, ఆ తరవాత ఉద్యోగం, అత్తమామలు, వీలయితే తల్లిదండ్రుల గురించి ఆలోచించాకే వారి గురించి వారు ఆలోచిస్తారు. ఇక్కడిదాకా వచ్చే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఉన్నా కూడా మళ్ళీ వెనుక నుండి ఒక గిల్ట్‌ తినేస్తూ ఉంటుంది. ఈ సమయం పిల్లలకు ఇచ్చి ఉంటే బావుండేది. వారిని చదివించినా, వండిపెట్టినా, ఇల్లు చూసుకున్నా బావుండేది అనుకుంటూనే ఉంటారు. ఒకవేళ కాసేపు సరదాగా బయటకు వచ్చినా పిల్లల గురించో, ఇంటి గురించో ఆలోచిస్తూ ఉంటారు. లేదా ఇంటి నుండి వీరికి ఫోన్‌ చేస్తూ ఉంటారు. అందరికి అమర్చిపెట్టాకే వారు బయటపడగలిగేది, అయినా ఈ బెంగలూ ఆరాలు తప్పవు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు. మహిళలు వారిని వారు పట్టించుకోకపోవడాన్ని, త్యాగాలు చేయడాన్ని కొనియాడుతారు. త్యాగం చేసిన మహిళ మంచి భార్య, తల్లి లేక కోడలు అవుతుంది. తనకు ఇది కావలి అని స్పష్టంగా కోరుకున్న మహిళను విచిత్రంగానే చూస్తారు. త్యాగం చేయాలనీ లేకపోయినా చేసినట్టు కనిపించినా ఆ మహిళలకు ఆదర్శ మహిళలుగా సమాజంలో గౌరవం దక్కుతుంది. మనలను మనం ప్రేమించుకోవడం అంటే అందం ఒక్కటే గుర్తుకు వస్తుంది అందరికి. కాని మహిళలకు కావలసిన శారీరక, మానసిక విశ్రాంతి, చల్లని మాటలు, అందరికి సేవచేయలేకపోయామన్న న్యూన్యత నుండి కాస్త సాంత్వన, మంచి భోజనం, ఆరోగ్యంపై శ్రద్ధ, ఒత్తిడిని తగ్గించుకోవడం ఇది కూడా ప్రేమించుకోడమే. అంతే కాదు తమను తాము లాలించుకుని, ఓదార్చుకుని, గర్వపడడం, అచ్చంగా పిల్లలతో ప్రేమించే తల్లి వ్యవహరించినట్లు మహిళలు వారితో వారు ఏ రోజైన ఉంటారా? చాలా సార్లు వారిని వారు విమర్శించుకోవడమో లేక అడ్డగోలుగా సమర్ధించుకోవడమో చూస్తాము. కానీ వారితో వారు దయగా ఉండడం ఎప్పుడైనా చూశామా?
స్త్రీవాదం అంటే ఇదే కాదు, కానీ ఇది కూడా స్త్రీవాదమంటే పురుష ద్వేషమనుకుంటారు చాలామంది. కానీ కాదు. స్త్రీ వాదం అందరికి సమాన హక్కులు ఉండాలని కోరుకుంటుంది. నువ్వు స్త్రీవాదివా అని ప్రశ్నిస్తే, ‘కాదు నేను మానవతా వాదిని’ అంటారు చాలామంది. మానవులలో స్త్రీలు లేరా? వారికి హక్కులు వద్దా? మరి స్త్రీవాదులమే అని చెప్పడానికి భయమెందుకు? ఎందుకంటే స్త్రీవాదులనగానే వారు పురుష ద్వేషులు అనుకుంటారు. నిజానికి పురుషులలో కూడా ఎందరో స్త్రీవాదులు ఉన్నారు. స్త్రీవాదం స్త్రీలకు మాత్రమే సొంతం కాదు. ఎవరైతే మనుషులందరికి సమాన హక్కులు ఉండాలి అని కోరుకుంటారో వారందరు స్త్రీవాదులే.
స్త్రీ వాదం… స్త్రీ పురుషలకు మాత్రమే కాక అన్ని జెండర్లకు సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని పోరాడుతుంది. సమాజం అసమానతలతో నిండి ఉన్నది కాబట్టి, ఆ అవకాశాలలో స్త్రీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా స్త్రీల గురించే ఈ పోరాటం సాగుతోంది. సమయం గడుస్తున్నా కొద్దీ వేరే జెండర్లను కూడా గుర్తిస్తున్నాము. అలా మహిళలు మాత్రమే కాక వేరే జెండర్లను కూడా కలుపుకు సాగిపోయే ఈ పోరాట లక్ష్యం పురుషులను ద్వేషించడం కాదు, పితృస్వామ్యం సృష్టించిన అసమానతలను తొలగించడం.
మహిళా దినోత్సవంలో పురుషుల పాత్ర
మహిళా దినోత్సవం స్త్రీల కొరకు జరిగినా అది స్త్రీలకు మాత్రమే పరిమితమైన రోజు కాదు. సమాజంలో సమానత్వం రావాలంటే ప్రత్యేకంగా ఒక్క వర్గంతో మాత్రమే పని చేస్తే రాదు. మహిళా దినోత్సవ రోజున మగవారు కూడా కలగలుపుకుని సాగాలి. పువ్వులు, బొకేలు, పొగడ్తలు కాదు. మహిళా హక్కులపై, వారి శ్రమపై, వారు సాధించవలసిన విజయాలపై మగవారు కూడా దృష్టి సారించి ఆ దిశగా నడవాల్సి ఉంటుంది. ఇది ఒక సహప్రయాణమని గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. సమాజంలో సమానత్వం కోసం ఒకరి పట్ల మరొకరికి సహానుభూతి, సౌహార్ద్రత, సహజీవన విలువలు పెంపొందించుకుంటే, మహిళా సాధికారత లక్ష్యం మహిళలొక్కరిదే కాదు, మనుషులందరిది అని తెలుసుకుంటాం.

ఇంతటితో తృప్తి పడదామా..?
మహిళలపై వివక్ష అనగానే కాలం మారింది. ఇప్పుడు పరిస్థితులలా లేవు అంటారు. నిజమే చాలా మంది పరిస్థితి మారింది. మీ ఇంటి పరిస్థితి మారి ఉండొచ్చు. కానీ భారత దేశంలో ప్రతి మహిళ పరిస్థితి మారిందా? నగరాల్లోనేకాదు, పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలలో, మీ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో? మీ ఇంట్లో పని చేసే మనిషి, మీ ఊరిలో కూలి పనికి వచ్చే మహిళా రైతు వీరందరి పరిస్థితి ఒకలానే మారిందా? స్వేచ్ఛా పరిమితులు ఒక్కో తరానికి ఒక్కొక్క రకంగా మారుతాయి. మీ అమ్మలనాడు అనుకున్న స్వేచ్ఛ మీ తరానికి మామూలయిపోయి ఉండొచ్చు. కానీ ఇంతటితో తృప్తి పడి ముందుకు సాగకుండా ఆగిపోదామా? అలా వీలు కుదరదు కదా! మనం సాధించ వలసింది ఇంకా ఎంతో ఉంది. సాధికారత ఒక వర్గం మహిళకు మాత్రమే సొంతం కాదు. అందరు మహిళలకు అన్ని అవకాశాలు రావాలి. అందుకు అందరం అందరికి తోడ్పడాలి. మహిళలందరిపై సహానుభూతి మహిళా సాధికారతకు దారి. సహానుభూతి లేని అభివృద్ధి వలన అందరికీ న్యాయం జరగదు. అది స్వార్థానికి, హ్రస్వదృష్టికి నిదర్శనం.

– అపర్ణ తోట
[email protected]

Spread the love