పూలు, ప్రకృతి, పడతుల బతుకమ్మ

Flowers are the lifeblood of natureబతుకమ్మ ఒక పూల పండుగ! చెరువుల పండుగ, ఇది మహిళల పండుగ! పర్యావరణ పండుగ… ఇంకా లోతుగా వెళ్లి చూస్తే ఇది ప్రకృతికి ఒక కతజ్ఞతలు తెలిపే పండుగ! జీవితాన్ని ఇచ్చిన ఆడబిడ్డలకు, అమ్మలకు మనం చెప్పే ధన్యవాదాల పండుగ! మొత్తంగా సకల చరాచర సృష్టికి మానవాళి అందించే ఒక ‘థాంక్స్‌ గివింగ్‌’ పండుగ బతుకమ్మ!
“Every Country or nation has its own distinct culture. And the culture can be showcased, exhibited, identified, manifested, interpreted and highlighted by one collective action, i.e., festival. A festival is an outcome of the overall needs, experiences, experiments and wishes of a community/society living in a specified area, and continues for generations. In this process, any festival will develop few rituals, traditions, practices specialized for itself by which that festival got unique significance among other festivalsw”.
పై మాటలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచే పండుగ బతుకమ్మ!

ప్రతి జాతికీ తనదైన జీవన విలువలు, తనవైన అనుభవాలు, తనవైన సామాజిక, భౌతిక, జైవిక పరమైన నేపథ్యాల నుంచి వచ్చిన ఆచారాలు, సంప్రదాయాలు, రీతులు, రివాజులు, ఉండడం సహజం. భౌగోళికంగా దక్కన్‌ పీఠభూమిలో తెలంగాణ విస్తరించిన పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఒక ప్రత్యేకమైన జీవనశైలి, ఉత్సవాలు, వేడుకలు, పండుగలు, పబ్బాలు ఏర్పడ్డాయనేది తెలుస్తోంది.
»»Festivals may emerge either from evolution or from revolution. No festivals on the earth has come into existence overnight. The origin, establishment, continuation and practice of any festivals can take place in due course of time for following them for many years. As such it is an evolutionary process in coherence with the natural seasons and nature laws, approved, followed and performed by large masses as a tradition
ఋతువుల ప్రతిరూపాలే పండుగలు!
సామాజిక శాస్త్రవేత్తలు (Sociologists), మానవ అధ్యయన శాస్త్రవేత్తల (Anthropologists) అంచనాల ప్రకారం, చరిత్రకారుల నిర్ధారణల ప్రకారం సాధారణంగా పండుగలు ప్రకృతిలో ఉండే ఆరు ఋతువులు ఆయా ఋతువుల విశేషాలను, విశిష్ట లక్షణాలను, శీతోష్ణస్థితి పరిస్థితులను, ప్రాకృతిక, పర్యావరణ పరమైన మార్పులను, వాతావరణ పరమైన అంశాలను అన్నింటిని మేళవించి, వాటికి అనుకూలంగా పండుగలు రూపొందుతాయని చెప్పవచ్చు. అలా బతుకమ్మ పండుగ అత్యంత అద్భుతమైన జీవనోత్సాహపు పండుగ! తెలంగాణా ప్రజలందరూ సామూహికంగా చేసుకునే ఒక వేడుక బతుకమ్మ పండుగ!
బతుకమ్మ పండుగ సాధారణంగా భారతీయ కాలమానం ప్రకారం ఆశ్వీయుజ మాసంలో వస్తుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకి తెలంగాణ మహిళలు ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా, ఉద్వేగభరితంగా పాల్గొంటారు. వేలాది సంవత్సరాల సాంస్కృతిక వైభవం, గొప్ప పరంపర ఈ బతుకమ్మ పండుగ.
బతుకమ్మ అనే పదం ఉత్పత్తి, భాషా విశేషాలను గమనిస్తే ”బతుకు” + ”అమ్మ” బతుకమ్మ గా మారిందని సులభంగా అర్థమవుతుంది. బతుకును ఇచ్చేది అమ్మ! అంటే ఈ లోకానికి జీవిని అందించి, బతుకును సృష్టించగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. స్త్రీకి మాత్రమే ఉంది! మహిళలో ఉండే ఒక విశిష్ట లక్షణం జన్మనివ్వడం అనే అంశాన్ని ఉదాత్తీరణం చెందే ప్రక్రియగా ఒకవైపున భావిస్తే, మరొక వైపున అమ్మతనాన్ని, అమ్మ తత్వాన్ని, అమ్మలో ఉండే త్యాగనిరతిని, అన్నింటినీ మేళవించిన ఒక జీవన సంస్కృతి బతుకమ్మలో మనకు అంతర్లీనంగా కనిపిస్తుంది.
‘నడిచే బతుకమ్మలు’ గా మనకు ఆడబిడ్డలు, మహిళలు, స్త్రీలు, అమ్మలు కనిపించినప్పటికీ, బతుకమ్మ మన ప్రాకృతిక సంస్కృతి. అందుకే ఆ పర్యావరణానికి నీరాజనంగా, ఆ పచ్చని పంటల తల్లికి నివేదనగా, ప్రకృతి దేవతకు అర్చనగా పూలతో చేసే పండుగ బతుకమ్మ! సాధారణంగా భారతీయ సంప్రదాయంలో, హైందవ భారతీయ పూజా విధానంలో దేవుడికి లేదా దేవతకి పూలతో అర్చించే సంప్రదాయం ఉంది. కానీ ప్రధాన స్థానంలో పూలనే పెట్టి, పూలనే దేవతగా భావించి, దైవత్వానికి ప్రతినిధిగా గుర్తించి, పూలనే అర్చించే గొప్ప పండుగ ఇదే!
బతుకమ్మ పండుగ ప్రారంభం నుంచి దాని నిమజ్జనం వరకు జరిగే వేడుకలలో గొప్ప జీవన విలువలు మనకు సాక్షాత్కరిస్తాయి. బతుకమ్మ పండుగ, కుటుంబ విలువలను, వారసత్వ సంపదను, జాతి సాంస్కృతిక పరంపరని కొనసాగించే ప్రక్రియగా భావించవచ్చు. తెలంగాణ జాతి అస్తిత్వ ప్రతీకగా, ఆత్మగౌరవ పతాకగా, మనదైన తత్వాన్నీ ‘ఇదీ తెలంగాణ జాతి’ అని ప్రపంచానికి చాటి చెప్పగలిగిన అంశంగా కూడా బతుకమ్మను గమనించవచ్చు. ఇంకొకవైపు తెలంగాణ ప్రజల జీవన సంస్కృతిని, జీవిత ధర్మాలను, ఇతర ప్రాంతాల ప్రజల నుంచి భిన్నంగా చూపించడానికి, విశిష్టతను చెప్పడానికి, వైవిధ్యం చూపించడానికి, బతుకమ్మ పండుగ ఒక ప్రత్యేక ప్రతీకగా నిలుస్తుందని చెప్పవచ్చు.
ఎనిమిదొద్దుల పండుగ!
బతుకమ్మ పండుగ ఎనిమిది రోజుల పాటు జరిగే పండుగ, మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవరోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, అయిదవరోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదివ రోజు వెన్నముద్దల బతుకమ్మతో కొనసాగి చివరికి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా పరాకాష్టకు చేరుకొని బతుకమ్మ పండుగ తాలూకు ఒక సంపూర్ణతని మనకు సాక్షాత్కరింప చేస్తోంది
ఎనిమిది రోజులపాటు జరిగే ఈ పండుగలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఎనిమిదవ రోజు దుర్గాష్టమి రోజు జరిగే విశిష్టతగా, సద్దుల బతుకమ్మ రోజు అందరూ గ్రామం నుంచి మొదలుకొని, పల్లెపల్లెనా, వాడవాడలా, వీధివీధిన మహిళలందరూ అందంగా అలంకరించుకొని, స్నానాలు చేసి, పూజలు చేసి, బతుకమ్మలను పేర్చి, ఆ బతుకమ్మని చేతుల్లో పట్టుకొని వారి వారి ఇళ్ల నుంచి దగ్గర్లోని చెరువుకు వెళ్లి ఆ చెరువు గట్టు మీద ఆటలు పాటలతో పాటు, ఇంట్లో తయారుచేసి వెంట తెచ్చుకున్న సద్దులను కూడా పంచుకుంటారు. చివరికి బతుకమ్మలను నీళ్ళల్లో, చెరువులో సంప్రదాయ బద్ధంగా నిమజ్జనం చేస్తారు.
ఈ మొత్తం విధానంలో గొప్ప లక్షణాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉపయోగించే పూలు అన్నీ కొండల్లో, కోనల్లో, చెరువుల్లో, కట్టల పొంటి పెరిగే పూలు కావడం విశేషం. తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, సీతజడ పూలు వంటి రకరకాల సీజనల్‌ పువ్వులతో పాటు, పసుపుతో చేసే గౌరమ్మ ఇక్కడ విశిష్టత.
బతుకమ్మ నిర్మాణం కూడా మెట్లుమెట్లుగా ఒక పిరమిడ్‌ ఆకారంలో ఉండటం ఒక సాంకేతిక అంశంగా, అధ్యాత్మిక ప్రతీకగా కూడా మనకు కనిపిస్తుంది. బతుకమ్మలను పేర్చడానికి వెదురుతో చేసిన సిబ్బిని ఆధారంగా పెట్టుకుని, దాని పైన గుమ్మడి ఆకులను, తంగేడు ఆకులను మొదట పేర్చి వాటి పై వివిధ రకాల పువ్వులని, మూలంలో విస్తారంగా పెట్టి, పైకి వెళుతున్న కొద్దీ శిఖరంలాగా రూపొందిస్తారు. శిఖరానికి పైన పసుపుతో చేసిన ముద్దను, దానికి కుంకుమలతో అలంకరించి గౌరమ్మగా పెడతారు.
ఇలా బతుకమ్మను ఏర్పాటు చేసే విధానం, దీని నిర్మాణం కూడా భారతీయతకు ప్రతీకగా ఉంటుంది. తర్వాత ఆడపిల్లలు అందరూ ఆ రోజు కొత్త బట్టలు ధరించి, కొత్త చీరలు ధరించి, అందంగా అలంకరించుకుంటారు. పెళ్లిళ్లు అయ్యాక ఎక్కడెక్కడికో, ఏ ఊరికో వెళ్లినా బతుకమ్మ పండుగ సమయంలో మాత్రం తమ సొంత ఊరికి, అమ్మ గారి ఇంటికి వచ్చి, అందరినీ కలిసి, అందరితో కలిసి, ఒక సామూహిక ఉత్సవంగా జరుపుకుంటారు. అందుకే ఇది అమ్మగారింటి పండుగగా నిలుస్తోంది.
సామూహిక ఆరోగ్య ప్రయోజనం ..!
బతుకమ్మ పండుగలో పర్యావరణ ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. నిజానికి బతుకమ్మ పండుగ వర్షాకాలపు చివరిలో వస్తుంది. వర్షాకాలంలో వానలు కురిసి నీళ్లన్నీ చెరువులలో నిలిచి, వాగులు, వంకలు అన్నీ కొత్త నీళ్ళతో నిండిన తర్వాత, ఆ నీళ్ల ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. బహుశా ప్రాచీన కాలంలో ఈ సంప్రదాయం ప్రారంభించడానికి ముందు కాలంలో, ఇప్పుడున్న ఆధునిక సౌకర్యాలు, పారిశుధ్య విధానాలు లేకపోవడం వల్ల గ్రామాలు, పల్లెల్లో ఉండే ప్రజలందరికీ నీటి సంబంధిత వ్యాధులు వస్తూ ఉండేవి. ఆ రోజుల్లో గృహావసరాలకు, తాగునీటికి, సాగునీటికి, అన్నిటికీ ఆధారం చెరువులే కావడం, ఆ నీటిని ఉపయోగించడం ద్వారా ప్రజల్లో ముఖ్యంగా బాలలు, బాలికలు ఈ నీటి ఆధారిత వ్యాధుల బారిన పడి మరణించి ఉంటారని ఊహించవచ్చు. దాని వల్ల ప్రజల్ని, రేపటి తరాన్ని కాపాడుకోవాలన్నది ఆనాటి జానపదులకు, గ్రామీణ ప్రజలకి లక్ష్యంగా మారింది. దానికోసం చెరువులని శుద్ధిచేయడం, చెరువులని పరిశుద్ధంగా మార్చడమే కాకుండా, ఒక గ్రామంలోని ప్రజలందరూ తమ బ్రతుకులను, తమ తర్వాతి తరాల బ్రతుకులను కొనసాగించడానికి, అందరూ కలిసి ఒక ఉత్సవంగా, ఒక వేడుక లాగా చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచే ఈ సంప్రదాయం వచ్చి ఉంటుందని చెప్పవచ్చు. ప్రాకృతికమైన, సహజమైన విధానంలో చెరువులను శుద్ధి చేయాలని భావించి దానికోసం పువ్వులను ఉపయోగించాలని ఆశించారు. ఏ పువ్వులలోనైతే పుప్పొడి ఉంటుందో, ఏ పసుపులో అయితే యాంటీబయోటిక్‌ లక్షణాలు ఉంటాయో ఆ అంశాలను గమనించి ఈ శాస్త్రీయ జ్ఞానానికి (Scientific Knowledge) కు సంప్రదాయాన్ని (Tradition) ను జోడించి పువ్వులుగా పేర్చి, బతుకమ్మగా కూర్చి, చెరువులలో నిమజ్జనం చేయడం ద్వారా ఈ పువ్వులలోనూ, గౌరమ్మ గా ప్రతిష్టించిన పసుపు ముద్ద లోనూ ఉండే యాంటీబయోటిక్‌ లక్షణాలు నీళ్లల్లో కలిసి, ఆ నీళ్ళని మొత్తంగా పరిశుద్ధం చేస్తాయని భావించి ఉండవచ్చు.
ఇది ఒక్కరోజులో కనుగొన్న విషయం కాకపోవచ్చు. ఎన్నెన్నో యత్న దోష (Trial and Error) విధానాల తర్వాత అవగాహనకు వచ్చి ఉండవచ్చు. అంటే ఆధునిక కాలంలో సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత చెరువుల పరిశుద్ధి కోసం ‘క్లోరినేషన్‌’ లాంటిది ఎలా చేస్తున్నామో, అలాంటి ప్రక్రియనే ప్రాకృతిక, సహజ విధానాల్లో ఈ పూలద్వారా పూలలోని పుప్పొడిని నీళ్లలో చెరువులో వేయడం ద్వారా పరిశుద్ధం చేశారనేది చెప్పవచ్చు. దీని ద్వారా ఆ చెరువులోని నీటిని తాగిన పిల్లలు, బాలలు, మహిళలు, వృద్ధులు, అందరూ నీటి సంబంధిత వ్యాధుల బారిన పడకుండా తమని తాము రక్షించుకో కలిగే అవకాశం ఏర్పడింది. ఇలా బతుకమ్మ పండుగలో అంతర్లీనంగా ఒక ఆరోగ్య లక్ష్యం, సామాజిక ప్రయోజనం, ఒక విస్తృత సామూహిక శ్రేయోదృక్పథం దాగి ఉంది.
అందుకే భారతీయ పండుగలపై పరిశోధనలు చేసిన సామాజిక మానవ శాస్త్ర వేత్తలు “The Festivals are anthropological by origin, sociological in nature, religious in practice, scientific in temperament and on the whole they are meant for the well-being of the mankind” అని ప్రకటించారు.
బతుకమ్మ ఒక సౌందర్య శిఖరం!
బతుకమ్మ పండుగ గొప్ప సౌందర్య శాస్త్రానికి కొలమానం! ఆకాశానికి ప్రతిబింబంగా కనిపించే చెరువులో ఆ చెరువుని అందమైన పూలతో అలంకరించి, ఒక ప్రత్యేక కాల్పనిక సామూహిక సౌందర్యాన్ని సృష్టించడం బతుకమ్మ నిమజ్జనంలో కనిపిస్తుంది. బతుకమ్మను పేర్చడంలో ఎంత సౌందర్యాత్మకత ఉందో, బతుకమ్మలను నిమజ్జనం చేసిన తరువాత, నీళ్ళల్లో తేలియాడుతూ ఉండే పూలని చూసినప్పుడు కలిగే అనుభూతి కూడా అంతే గొప్పగా ఉంటుంది. రకరకాల ఆకృతులలో చెరువంతా పూలతో అలంకరించినట్టుగా కనిపిస్తుంది. ఇలా ప్రకృతికి ప్రతీకగా చెరువులను అందంగా అలంకరించే ఆడబిడ్డల ఆత్మీయ తత్వానికి నిలువెత్తు నీరాజనంగా బతుకమ్మ ఉత్సవం నిలుస్తుంది.
ఇలాంటి బతుకమ్మ అనూచానంగా వందలాది సంవత్సరాల నుంచి తెలంగాణ జన జీవన శైలిలో అంతర్భాగంగా కొనసాగుతూ, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, మహిళల ధైర్యానికి, మహిళల చైతన్యానికి ప్రతీకగా కొనసాగుతూ వచ్చింది. జానపదుల పండుగ, పల్లెల పండుగ, గ్రామీణుల తాత్విక జీవనసరళిగా మొదలైన ఈ పండుగ ఆ తర్వాత క్రమక్రమంగా పట్టణాలకు, నగరాలకు కూడా విస్తరించి, తెలంగాణ ఆత్మీయ తత్వానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.
ఉద్యమ కేతనంగా…
ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ పండుగకు ఒనగూడిన ఉద్యమిత్వ స్వభావం, రూపు కట్టిన విధానం ప్రస్తావించదగినది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సాంస్కృతిక ప్రతీకలు, సాంస్కృతిక చైతన్య గీతికలు ప్రజలందరినీ ఏకం చేసే ఉత్సాహ కెరటాలుగా మారిన సందర్భంలో మన పండుగలు, గొప్పగా కీర్తించబడ్డాయి. ప్రజల చేత నీరాజనాలు పొందాయి. అలా 2000 సంవత్సరంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సందర్భంలో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తెలంగాణ తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి బతుకమ్మ పండుగ సాంస్కృతిక గీతంగా, తెలంగాణ జాతి చైతన్య రూపంగా ఆవిష్కరించబడింది. ‘తెలంగాణ జాగతి’ సంస్థని స్థాపించిన శ్రీమతి కల్వకుంట్ల కవిత సారధ్యంలో మహిళలందరూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చే దిశగా బతుకమ్మ పండుగని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళిన తర్వాత, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, వీధుల నుంచి అపార్ట్మెంట్ల వరకు, ప్రతిచోట, తెలంగాణ నేల అంతటా, బతుకమ్మ పండుగ ఒక ఉద్యమ చేతనంగా ఉత్సవ కేతనంగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ పండుగ ఒక గొప్ప సాంస్కతిక ప్రతిబింబంగా, ప్రజల ఆత్మగౌరవ ప్రతిరూపంగా గెలిచింది, కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా జీవో నెంబర్‌ 2, తేదీ: 24.07.2014 ద్వారా ప్రకటించడమే కాకుండా, బతుకమ్మ పండుగని నిర్వహించడానికి రాష్ట్రంలోనూ, దేశం మొత్తం మీద, అలాగే అంతర్జాతీయంగా తెలంగాణ జాతి ప్రజలు ఎక్కడెక్కడ అయితే నివాసం ఉంటున్నారో వారందరినీ ఒకటి చేస్తూ బతుకమ్మ పండుగ నిర్వహించడానికి వీలుగా నిధులను కేటాయిస్తూ, ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నారు. పూల పండుగగా బతుకమ్మని, ప్రాకృతిక నివేదనగా బతుకమ్మని, ప్రపంచానికి చాటి చెబుతూ తెలంగాణ సాంస్కృతిక విశిష్టతను ఎలుగెత్తి చాటేలా చేస్తున్నారు. ఆ క్రమంలో భాషా సాంస్కృతిక శాఖ 2014 నుంచి అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగని మరింత విస్తృతస్థాయిలో నిర్వహిస్తూ, ఇప్పుడు బతుకమ్మ తెలంగాణకు ‘అస్మిత రూపం’ అనే స్థితికి వచ్చింది. ఒకప్పుడు కేవలం పల్లెలకు, గ్రామాలకు, జానపదులకు పరిమితమైన బతుకమ్మ పండుగ ఇప్పుడు ఒక సార్వజనీన ఉత్సవం (Universal Festival) గా, కుల, మత, ప్రాంతీయ, వర్గ, భాషా భేదాలకు అతీతంగా ఒక విశ్వజనీన దృక్పథాన్ని (Cosmopolitan outlook) సంతరించుకున్నది.
”A Festival may vary and differ from other festival, as every festival is special, unique and novel with each other in their ritual, practice, belief system, style of performance etc. But the main aim of any festival is to establish healthy and happy social environment within the frame work of a natural environment. Thatd’s why, all the festivals celebrated across the globe will have a latent intention of ecological balance and sustainable development on one hand, and regulation and order of human life on the other”.
బతుకమ్మ- సాంస్కృతిక శాఖ కృషి :
అదే క్రమంలో భాషా సాంస్కృతిక శాఖ ద్వారా బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ ఖ్యాతిని గడించే దిశగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాటిలో భాగంగా 10 వేల మంది మహిళలతో, లాల్‌ బహదూర్‌ స్టేడియంలో 8 అక్టోబర్‌, 2016 సంవత్సరంలో మహా బతుకమ్మ ప్రదర్శనని నిర్వహించారు. అలాగే ఆ తర్వాతి సంవత్సరం 22 సెప్టెంబర్‌, 2017 న తంగేడు పువ్వు ఆకతిలో మహిళలను నిలిపే విధంగా (Largest human formation in the form of Thangedu Flower) లాల్‌బహదూర్‌ స్టేడియంలో ఉత్సవాలను నిర్వహించారు. ఇవి ప్రపంచ స్థాయిలో గిన్నిస్‌ రికార్డుని సాధించడానికి చేసిన ప్రయత్నాలు. బతుకమ్మ పండుగను ప్రస్తుతం నిర్వహిస్తున్న సూరత్‌, భీవాండి, బొంబాయి, బెంగుళూరులోనే కాకుండా చెన్నై, కోల్‌ కత్తా, గౌహతి, తంజావూరు, దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే అంతర్జాతీయంగా 40 పైగా దేశాలలో బతుకమ్మ పండుగను ఇప్పుడు తెలంగాణ జాతి బిడ్డలు నిర్వహిస్తూ, బతుకమ్మకి ఒక విశ్వజనీన లక్షణాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి బతుకమ్మ పండుగ ఇప్పుడు తెలంగాణ జాతి హృదయ స్పందనగా మారింది. ప్రపంచ ప్రజలందరికీ ప్రాకృతిక నివేదనగా ఒక విశిష్ట స్థానాన్ని సాధించుకున్నది.
మరోవైపున భాషా సాంస్కృతిక శాఖ ప్రతీ ఏటా బతుకమ్మ పండుగ సమయంలో ‘బతుకమ్మ ఫిల్మోత్సవం’ పేరిట సినిమాల ప్రదర్శనను రవీంద్రభారతిలోని పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఏర్పాటు చేసి, బతుకమ్మ పండుకకు సినిమాలను కూడా జత చేశారు. ఈ ఫిల్మోత్సవంలో ఆ క్యాలెండర్‌ సంవత్సరంలో విడుదలైన సినిమాలలో తెలంగాణా దర్శక, రచయిత, నటీనట, సాంకేతిక నిపుణులు రూపొందించిన ఎంపిక చేసిన సినిమాలను ప్రదర్శించడమే కాకుండా ఆ సినిమా నటీనట, సాంకేతిక వర్గాన్ని ఆహ్వానించి సత్కారం కూడా చేస్తున్నారు.
బతుకమ్మ పాటలో భాష, కుటుంబ విలువలు :
ఇక బతుకమ్మ పండుగలో మరొక విశిష్టత, పాటలు, వాటిని పాడే విధానం! జానపదులు, గ్రామస్తులు పాడుకునే పాటలు తమ జీవన సరళికి అనుగుణంగా రూపొంది, వంశపారంపర్యంగా వందలాది సంవత్సరాల నుంచి ఒక తరం నుంచి మరొక తరానికి శ్రవణం ద్వారా మౌఖికంగా పరంపరలా కొనసాగుతున్న పాటలు ఎన్నో ఉన్నాయి. అలా బతుకమ్మ పాటలలో మనకు స్థూలంగా రెండు రకాలు కనిపిస్తాయి. 1) తెలంగాణాలోని అన్ని జిల్లాలు ప్రాంతాలలో పాడుకునే ప్రజాదరణ పొందిన పాటలు. 2) స్థానికంగా, ఆయా గ్రామాలు/ జిల్లాలకు మాత్రమే పరిమితమై స్థానికతని (local spirit) నిబిడీకృతం చేసుకున్న పాటలు. వీటిలో భాష, పదాలు అన్నీ ‘ఉపమాండలికాలు’ (Sub-dialects)  కోవకు చెంది, ఆ స్థానిక ప్రాంతంలో తప్ప మరో చోట వాటి వాడుక అంతగా ఉండదు. లేదా వేరే పదాలతో వాడుకలో ఉంటాయి. కాగా బతుకమ్మ పాటలలో, ఎన్నో జీవన సత్యాలు, మరెన్నో కుటుంబ అనుబంధాలు, సామాజిక సంబంధాలు, ప్రకృతి మానవుడికి మధ్య ఉండే అనుబంధ, బాంధవ్యాలు ఇలా ఎన్నో అంశాలు భౌతిక, అధ్యాత్మిక , సామాజిక, తాత్విక స్పూర్తితో మనకు దర్శనమిస్తాయి.
ఇలాంటి పాటల పరంపరను ఖచీజుూజఉ వారు చెప్పినట్లు ×అ్‌aఅస్త్రఱbశ్రీవ హెరిటేజ్‌ గా భావించవచ్చు. భవనాలు, నిర్మాణాలు, కట్టడాలు దేవాలయాలు ఇవి మనకు కనిపించే, మనం స్పర్శించగలిగిన UNESCO హెరిటేజ్‌ గా భావిస్తే, మనకు కనిపించకుండా మన జీవితములో అంతర్భాగమై, మన జీవనశైలిలో కొనసాగుతూ, పరంపరగా మౌఖిక సంప్రదాయం రీత్యా వేలాది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వారసత్వ సంపదగా ఈ పాటలు, వీటిలో వెల్లడయ్యే జీవన సత్యాలు, ఈ పాటల్లో అంతర్భాగంగా ఉన్న తెలంగాణ జాతి జీవన శైలులు అన్నీ ‘Intangible హెరిటేజ్‌’ గా భావించవచ్చు.
అయితే ఇప్పటివరకూ బతుకమ్మ పండుగకు సంబంధించిన అన్ని పాటలని ఊరూరా తిరిగి సేకరించి రికార్డు చేసి, డాక్యుమెంట్‌ చేయాల్సిన బృహత్‌ యత్నం, దొరికిన మేరకు గ్రంథస్థం చేసి భద్రపరిచే ప్రయత్నం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా, జాగృతి, ఇతర సంస్థలు, పత్రికల ద్వారా జరిగింది. అయినప్పటికీ ఇంకా ప్రతి గ్రామంలోని ప్రజల నాల్కలమీద నడయాడే పాటలు, ఇప్పటికీ తెలియని ఎన్నెన్నో విభిన్నమైన పాటలు, వైవిధ్యభరితమైన పాటలు, బతుకమ్మ నేపథ్యంలోని పాటలు, ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని రికార్డు చేసి భవిష్యత్‌ తరాలకు అందించాల్సి వుంది!
డా|| మామిడి హరికృష్ణ 8008005231

Spread the love