సరిపడా ఆహారం దొరుకుతోందా..!

Is there enough food?ఈ ప్రపంచంలో తగినంత పోషకాహారం తీసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాగరిక సమాజంలో మానవులు తమకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునే వీలు కూడా లేని ప్రదేశాలు ఇంకా ప్రపంచంలో ఉండడం శోచనీయం. ఓ పక్క పెరుగుతున్న జనాభా, మరో పక్క తగ్గుతున్న వ్యవసాయం. దీంతో ఆకలి చావులు. ఈక్రమంలో 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆహార ఉత్పత్తుల డిమాండ్‌ నిరంతరం పెరుగుతుంది. కానీ, అందుకు తగ్గట్టు సాగు విస్తీర్ణం పెరగకపోగా, క్రమేపీ తగ్గుతూ వస్తుంది. నీటి లభ్యత, భూసార క్షీణత, వాతావరణ మార్పు, వాతావరణ వైవిధ్యాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు ఋణగ్రస్తతలో కూరుకుపోతున్న తరుణంలో ప్రతిఏటా రైతులు సేద్యం చేయడం తగ్గిపోవడం, యువతరానికి వ్యవసాయం పట్ల అనాసక్తి వంటి అనేక కారణాల వల్ల సాగు విస్తీర్ణం తగ్గిపోతూ వస్తున్నది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ పరిస్ధితులను అధిగమించడానికి ఆహారం విలువ ఏంటో చాటిచెప్పడం అత్యవసరం. ఆహారాన్ని ఆదా చేయడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివద్ధిని పెంచడం అనేది ప్రధాన ఆశయం. భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహార లోపం, ఆహార భద్రత, ఆహార వృధా వంటి సమస్యలను నిర్మూలించడమనే ప్రధాన లక్ష్యంతో ప్రతీ సంవత్సరం అక్టోబర్‌ 16 వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచంలో దాదాపు 150 దేశాలు జరుపుతున్నాయి. 1945 వ సంవత్సరం ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయక సంస్థ ఏర్పాటైన అక్టోబరు 16నే ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్కృతంగా నిర్వహించుకుంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని మొదటిసారి 1981లో నిర్వహించిన్నప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఓ ప్రత్యేక ధీమ్‌ తో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
2023 యొక్క థీమ్‌ పరిశీలిస్తే
”నీరు జీవితం, నీరు ఆహారం. ఎవ్వరినీ వదిలిపెట్టకు” ఈ థీమ్‌ ఆహార ఉత్పత్తి, ఆహార భద్రతలో నీటి ప్రాధాన్యతను తెలియచేస్తుంది. విత్తు నాటిన దగ్గర నుండి పంట పెరుగుదల, దాని ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ వరకు నీటి ఆవశ్యకత చెప్పనలవి కాదు. నీరే లేకపోతే ఆహార ఉత్పత్తి లేదు. ఆహార ఉత్పత్తి లేకపోతే ప్రాణకోటి మనుగడే లేదు.
ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆహార వృథా కారణంగా ఏటా 250 క్యూసెక్కుల మేరకు నీటి వథా పరోక్షంగా జరుగుతుంది. కావున నీటిని తెలివిగా నిర్వహించడం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహనను పెంచే ప్రధాన లక్ష్యంతో ఈ సంవత్సరం ఈ ధీమ్‌ ప్రకటించారు. ఆహార సమస్యకు గల ప్రధాన కారణాలు పరిశీలిస్తే..
పోషకాహార లోపం
ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం మెరుగై, జీవన ప్రమాణం వృద్ధి చెందుతుందో.. ఏ ఆహారం తీసుకుంటే అనారోగ్యాలు మన దరిచేరవో.. ఆ ఆహారమే పోషకాహారం. ఈ పోషక ఆహారంలో మాంసకృత్తులు, పిండిపదార్ధాలు, కొవ్వు పదార్ధాలు, పీచుపదార్ధం, విటమిన్లు, ఖనిజలవణాలు, నీరు అనే 7 రకాలైన పోషకాలు ఉంటాయి. సమతౌల్యంగా వీటిని తీసుకోగలిగితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.
శరీరం తగినంతగా ఈ పోషకాలను అందుకోకపోతే కలిగే పరిస్థితినే ‘పోషకాహార లోపం’ అంటారు. ఇది ప్రపంచ సమస్య. ప్రపంచంలోని అత్యధిక దేశాలు పోషకాహార లోపం సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పోషకాహార లోపం అనే సమస్యకు బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే బీజం పడుతుంది. ఇందుకు కారణం గర్భం దాల్చిన అనేకమంది మహిళలు రక్తహీనతతో బాధపడటమే. దీనికి మూలం పేదరికం. పోషకాహారం తీసుకునే సామర్థ్యం లేక పోవడం వల్ల, ఆ ప్రభావం బిడ్డలపై పడుతుంది. అంతేకాదు ఆర్ధిక స్ధోమత ఉన్నప్పటికీ పోషక ఆహారంపై అవగాహన లేకపోవడం వలన కూడా అనేకమంది తల్లులు రక్తహీనతకు గురవుతున్నారు. ఈ కారణంగానే తక్కువ బరువుతో శిశువులు జన్మిస్తున్నారు. దీని వల్ల ఆరేళ్ళలోపు చిన్నారులలో ఎదుగుదల సరిగా ఉండటం లేదు. విద్యావంతులై ఆర్ధిక స్ధోమత కలిగిన వారు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అంటే కారణం ఎలాంటి పోషణ లేని జంక్‌ ఫుడ్‌కు వారు అలవాటు పడడమే. పోషకాహార లోపం అనేది పల్లెలకే పరిమితం కాలేదు. పట్టణాల్లోకీ అధికంగా విస్తరిస్తోంది. అవగాహన ఉన్నా ఆచరణలో చూపక పోవడమే దీనికి కారణం.
ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న మొత్తం పిల్లల్లో 3వ వంతు మంది మన దేశంలోనే ఉన్నారు. వీరిలో 46 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉంటున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 52 శాతం మరణాలు సంభవిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి దేశంలో పోషకాహారంపై అవగాహనా రాహిత్యమే ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు.
దేశంలో ఆకలితో అలమటిస్తున్నవారు కొందరైతే, పోషకాల సంగతి పట్టించుకోకుండా దొరికినదేదో తిని కడుపు నింపుకుంటున్న వారే ఎక్కువ. ఆహార నిపుణుల సూచనల మేరకు పోషకాహారం తీసుకునే పరిస్థితి చాలామందికి లేదు. తీసుకుంటున్న ఆహారానికీ, పోషక ప్రమాణాలకు వ్యత్యాసం మన గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం ఉంటోంది. ఇటువంటి పరిస్ధితుల వల్లనే పోషకాహార లోపంతో మరణాలు సంభవిస్తున్నాయి.
నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ వ్యాఖ్యానించినట్లు ఆఫ్రికా దేశాల మాదిరిగా హృదయ విదారకమైన ఆకలిచావులు మన భారతదేశంలో లేవు. కానీ, అర్ధాకలి, పోషకాహార లోపంతో జీవిస్తున్నవారి సంఖ్య మాత్రం భారత్‌లోనే ఎక్కువ.
ప్రపంచ సమస్యగా నెలకొన్న ఈ పోషకాహార లోపం విషయంలో ఐక్యరాజ్య సమితి మాత్రం 2030 నాటికి ఆకలి బాధలకు, పోషకాహార లోపాలకు తావులేని సౌభాగ్య ప్రపంచాన్ని సాకారం చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నది.
ఆహార అభద్రత
ప్రజలందరికీ నిరంతరం తమ ఆర్థిక, శారీరక అవసరాలకు తగినంతగా సురక్షితమైన ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండడమే ఆహార భద్రత.
రోజుకు 2,100 కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకుంటే పోషకాహార లోపం, ఆహార అభద్రత ఉన్నట్టు గుర్తించాలి. వాస్తవంగా క్షేత్ర స్ధాయిలో పరిశీలిస్తే సమాజంలో మహిళలు, అట్టడుగు వర్గాలు, వెనకబడ్డ ప్రాంతాల్లో అయితే 2100 కేలరీల ఆహారం తీసుకునే వారు తక్కువే. కరోనా వంటి మహమ్మారులు విజంభించినప్పుడు ఈ పరిస్థితి మరింత తీవ్రమై ఆకలి మరణాలు పెరిగి పోతున్నాయి.
మన దేశం విషయానికి వస్తే…
స్వాతంత్య్రం అనంతరం కూడా ఆహార ధాన్యాల విషయంలో కొంత కాలం దిగుమతులు చేసుకున్నాం. అయితే ఆహార ధాన్యాల విషయంలో స్వయంసమృద్ధి సాధించే దిశగా 1965 తరువాత తీసుకువచ్చిన హరిత విప్లవ ప్రభావంతో ఆహార ఉత్పత్తిలో గణనీయ మెరుగుదల సాధించడంతో దిగుమతులు ఆగిపోయి ఎగుమతులు చేసే స్ధితికి చేరుకున్నాం. కరువు కాటకాలను ధీటుగా ఎదుర్కొన్నాం. కరోనా వంటి మహమ్మరిని కూడా నిల్వ ధాన్యాలతో ఎదుర్కోగలిగాం. అయినప్పటికి 75 ఏండ్ల అమృతోత్సవాల వేళ కూడా ఇంకా ఆకలి కేకలు, ఆకలి మరణాలు చూస్తున్నామంటే కారణం ఆహార పదార్ధాల కొరత కాదు. ఆహార భద్రత లేకపోవడమే.
ఆహార భద్రత లోపిస్తే ఆకలి ఏర్పడుతుంది. ఆకలి పేదరికానికి సూచిక మాత్రమే కాదు, పేదరికాన్ని తీసుకు వస్తుంది కూడా. ఆహారానికి పరిమాణం ప్రధానం కాదు. ఆహారం పరిమాణంలో తక్కువ అయినా గుణాత్మకంగా ఉండాలి. అప్పుడే ఈ ఆకలి మరణాలు అరికట్ట గలుగుతాం. ఏదేమైనా ఆహార భద్రత ఒక దేశ ఆర్థిక శక్తికి, ఆరోగ్య స్థితికి సూచిక. ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించిన దేశం సమర్ధవంతమైనది. దీనికి భిన్నంగా దేశంలో ఆహార అభద్రత నెలకొంటే అది పూర్తిగా ఆ దేశ ప్రభుత్వ వైఫల్యమే. ఆహార భద్రత ప్రజల ప్రాధమిక హక్కు అయితే, ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ మార్గంలోనే ఆహార భద్రతకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కారణంగా రెండు దశాబ్దాల ముందు కంటే ప్రస్తుతం ఆకలి సమస్య చాలావరకు తగ్గింది. అయినా, ఇప్పటికీ చాలా చోట్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 81.5 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పేదరికం, ఉద్యోగ భద్రత కొరవడటం, ఆహార కొరత, ఆహార పదార్థాల వృథా, సాధనా సంపత్తి లోపాలు, అస్థిరమైన మార్కెట్లు, భూతాపం కారణంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, యుద్ధాలు, సంఘర్షణలు, అట్టడుగు వర్గాలపై వివక్ష వంటివి ఆకలి సమస్యకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
ఎడారీకరణ.. ఆహార అభద్రత
పెరుగుతున్న ఆహార అవసరాల కోసం భూమి సేద్యానికి రసాయనక ఎరువులు, క్రిమి సంహారక మందులు విచ్చలవిడిగా వాడటం మొదలయ్యింది. దీనివల్ల నేలను గుల్లపరిచి సహజంగా భూసారాన్ని పెంచే వానపాములు, తేనెటీగలు వంటి పంట సహాయకారులు నశించిపోతున్నాయి. దీంతోపాటు వరదల సమయంలో భూమిపై గల సారవంతమైన మట్టి కొట్టుకుపోవడంతో ఎడారీకరణ పెరిగిపోతుంది. అంతేకాదు, నేడు ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. ఈ సమయంలో పట్టణీకరణకు భూములు అధికంగా ఉపయోగించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇది కూడా భూ క్షీణతకు ప్రధాన దోహదకారిగా చెప్పవచ్చును. ఈ విధంగా ఒక వైపు అధిక దిగుబడులు కోసం ఆధునిక ఉత్పత్తి పద్ధతులు అవలంభించడం, మరొక వైపు అభివృద్ధి పేరిట చోటుచేసుకుంటున్న మానవ కార్యకలాపాలు, పర్యావరణ మార్పులు భూమిపూ జీవ సంబంధమైన సామర్థ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఫలితంగా భూమి క్రమంగా ఎడారిగా రూపాంతరం చెంది, భూతాపం పెరిగింది. భూ ఉత్పాదక సామర్ధ్యం దెబ్బతిని కరువు కాటకాలు సంభవిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఎడారీకరణ సమస్య ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారింది. మానవ చర్యలు, వాతావరణ మార్పుల కారణంగా నికర ప్రాథమిక ఉత్పాదకత తగ్గిపోతోంది. ఎడారీకరణ ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుందని, ప్రతి నాలుగు హెక్టార్ల భూమిలో ఒక హెక్టారు భూమి సాగుకు పనికిరాకుండా పోతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తున్నది. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యునైటెడ్‌నేషన్స్‌ కన్వెన్షన్‌ టు కాంబట్‌ డెజర్టిఫికేషన్‌ (యూఎన్‌సీసీడీ) ప్రకారం వ్యవసాయానికి అనుకూలం కాని భూములను వ్యవసాయానికి వినియోగిస్తుండడం, నేల, నీటి పరిరక్షణ చర్యలు తగినంతగా లేకపోవడం, పరిమితికి మించి సాగు చేయడం, జల యాజమాన్యం సక్రమంగా లేకపోవడం.. భూగర్భ జలాల అపరిమిత వినియోగం ఎడారీకరణకు ప్రధాన కారణాలని పేర్కొంది. దీనికి తోడు మృత్తికా క్రమక్షయం కారణంగా ఏటా 530 కోట్ల టన్నుల సారవంతమైన మట్టి, 80 లక్షల టన్నుల వృక్ష పోషకాలను నేల కోల్పోతోంది. భూక్షీణత వల్ల ప్రత్యక్షంగా 25 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. రోడ్లు, భవనాల నిర్మాణం, గనుల తవ్వకం వంటి కారణాల వల్ల వ్యవసాయం, చెట్ల పెంపకానికి భూమి తగ్గిపోతోంది. ఫలితంగా ఎడారీకరణ మరింత వేగవంతమవుతోందని తమ నివేదికలో ప్రస్తావించింది. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతకు తీవ్ర అవరోధం కలిగే పరిస్థితులు ఏర్పడనున్నాయని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఇవే పరిస్థితులు కొనసాగితే విశ్వవ్యాప్తంగా వ్యాధులతో మరణించినవారి కంటే కరవుల కారణంగా చనిపోయేవారే ఎక్కువమంది ఉంటారని తెలిపింది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల హెక్టార్ల భూమి సారాన్ని కోల్పోయిందని, ఇది చైనా భూభాగం కంటే రెండింతలు ఎక్కువని ఇది అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది సేకరించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 360 కోట్ల హెక్టార్ల భూమి ఎడారీకరణ ప్రభావానికి లోనైనట్లు అంచనా. మూడోవంతు భూభాగం ఎడారీకరణ ప్రమాదంలో ఉంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ధోరణి కొనసాగితే వచ్చే పదేళ్లలో మనుషులకు ఆహారం పండించడానికి అదనంగా 30 కోట్ల హెక్టార్ల పంట భూమి అవసరం అవుతుందని అంచనా. ఈ భూక్షయం వల్ల 2010 లోనే ప్రపంచ స్థూల ఉత్పత్తి 10 శాతం తగ్గిందని ఆర్ధిక సర్వేలు చెబుతున్నాయి.
సేద్యపు భూమి తగ్గుదల
ఓ పక్క పెరుగుతున్న జనాభా, మరో పక్క లాభదాయకంగా లేని వ్యవసాయం తగ్గుదల, దీనితో రానున్న రోజుల్లో మరలా ఆహార కొరత ఏర్పడవచ్చనే భయం వెంటాడుతోంది. ఈక్రమంలో పెరుగుతన్న జనాభా 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో ఆహార ఉత్పత్త పెంచడం అంటే తక్కువ ప్రాంతంలోనే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. ఇప్పటికే హరిత విప్లవం ద్వారా మనదేశంలో ఆధునిక ఉత్పత్తి పద్ధతులు అవలంబించి, అత్యధిక దిగుబడులు సాధించి ఆహార కొరత అధిగమించాం. అయితే ప్రస్తుతం సేద్యం చేసే భూవిస్తీర్ణం మరింత తగ్గుతూపోతే ఎదురయ్యే ఆహార కొరతకు వేరొక పరిష్కారం కానరావడం లేదు. భూ పరిమాణం స్థిరం. అందులో సేద్యపు భూమి మరింత తగ్గడం, మరోవైపు జనాభా పెరగడం చూస్తే మరలా ఆహార సమస్య ఎదురు కావచ్చనే భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి.
ఆహారపు వధాలు
ఆహారం విలువ కొంతమందికే తెలుసు. ఎందుకంటే ఆహారం తినే వారికన్నా దానిని పండించే వారికే దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. ఆహారం పారేయడానికి ఒక్క క్షణం చాలు, కాని ఆ ఆహారాన్ని పండించడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పెద్దలు అన్నం పరబ్రహ్మా స్వరూపం, దాన్ని వృధా చేయకూడదు అంటారు. ఈ విషయం తెలిసినప్పటికీ చాలామంది ఆహారాన్ని వృధా చేస్తున్నారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఆధునిక ఉత్పత్తి విధానాల ద్వారా ఆహార ఉత్పత్తి మెరుగైనప్పటికీ ఆకలి మరణాలకు మరొక ప్రధాన కారణం ఆహారపు వథాగా చెప్పవచ్చు. ప్రపంచంలో ఒక వైపు కొందరు ఆకలితో అలమటిస్తుంటే, మరొకవైపు కొందరు నిర్లక్ష్యంగా ఆహార పదార్థాలను వృథా చేస్తున్నారు. ఈ వృథా భారీ స్థాయిలో నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆహార వృథాల పరిమాణం చూస్తే ప్రతిఏటా 931 మిలియన్‌ టన్నులు కాగా, ఇందులో 569 మిలియన్‌ టన్నులు గృహ వ్యర్థాలు (61 శాతం), 244 మిలియన్‌ టన్నులు ఆహార సేవల వ్యర్థాలు (26 శాతం), 118 మిలియన్‌ టన్నుల రిటేల్‌ ఆహార వ్యర్థాలు (13 శాతం) ఉన్నాయని విశ్లేషించారు. ప్రపంచ దేశాల వార్షిక తలసరి వ్యర్థాలు 121 కేజీలు ఉండగా, అందులో 74 కేజీలు గహ వ్యర్థాలు, 32 కేజీలు ఆహార సేవల్లో వ్యర్థాలు, రిటేల్‌లో 15 కేజీల ఆహారం వ్యర్థమవుతున్నది.
భారత దేశంలో పరిశీలిస్తే…
68.7 మిలియన్‌ టన్నుల ఆహారాన్ని వ్యర్థ పదార్థంగా ఇంట్లోంచి చెత్తకుప్పలో వేస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌ ‘ఆహార వ్యర్థాల సూచిక-2021 (ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌-2021)’ నివేదిక బహిర్గతం చేసింది. అంతేకాదు సంపన్న దేశాలతో పాటు నిరుపేద దేశాల్లో సైతం ఆహార వృథా దాదాపు ఒకే స్థాయిలో జరుగుతోందని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఏటా దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం వథా అవుతోంది. జనాభా వినియోగించే ఆహార పరిమాణంలో ఇది దాదాపు మూడో వంతు. వృథా అవుతున్న ఆహారం విలువ సుమారు 2.6 లక్షల కోట్ల డాలర్లు. ఎఫ్‌ఏఓ లెక్కల ప్రకారం సంపన్న దేశాల్లో సగటున ఏటా 67 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతుంటే, పేద దేశాల్లో సగటున 63 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. మనదేశంలో పెరుగుతున్న జనాభాతో పాటు ఆహార ఉత్పత్తి కూడా అనూహ్యంగా పెరిగింది. అయితే మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో 40శాతం వృథాగా మట్టిపాలవుతోందని, దాని విలువ ఏడాదికి దాదాపు లక్ష కోట్ల రూపాయలని ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ లోగడే లెక్కగట్టింది! పేద దేశాల్లో తగిన కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడం, పంట కోతలో ఆధునిక పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల భారీస్థాయిలో ఆహార నష్టం వాటిల్లుతోంది.
నిరుపేదలకు రెండు పూటల ఆహారం దొరక్క ఆకలి కేకలు పెడుతున్న దేశాలలో ఆహారం వ్యర్థ పదార్థ రూపంలో డస్ట్‌బిన్‌ పాలు కావడం ఎంతైనా శోచనీయం. ప్రత్యేకించి మన దేశంలో వివాహాలు, వేడుకలు వంటి సందర్భాలలో వృథా అయ్యే ఆహార పదార్ధాలను మనం చూస్తూనే ఉన్నాం. ఆహార పదార్థాల వృథాను సమర్థంగా అరికట్టగలిగితే ఆకలి సమస్యను చాలావరకు అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆహార వృథాను అరికడితే ఆహారాన్ని ఉత్పత్తి చేసినట్లే.
పర్యావరణంపై వ్యర్ధ పదార్థాల ప్రభావం
వథా అవుతున్న ఆహార పదార్థాల కారణంగా ఏటా 330 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ పర్యావరణంలో కలుస్తోంది. వృథాగా పడేసిన ఆహార పదార్థాలు కుళ్లిపోయే దశలో విడుదలయ్యే మీథేన్‌ వాయువు కూడా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కేవలం బొగ్గు, చమురు ఇంధనాల వల్ల మాత్రమే కాదు, ఆహార వృథా కారణంగా కూడా భూతాపం పెరిగి పర్యావరణానికి తీవ్రహాని కలిగిస్తుంది.
గిడ్డంగి సౌకర్యాల లేమి
ఆహార ధాన్యాలను భవిష్యత్‌ అవసరాల కోసం నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలాదేశాల్లో దాదాపు 40శాతం తిండి గింజలు వినియోగానికి పనికిరాకుండా పోతున్నాయి. ఈ పరిస్థితి ఆకలి సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. యుద్ధ పరిస్థితులు, సంఘర్షణలతో అతలాకుతలమవుతున్న దేశాల్లోనూ జనం ఆకలితో అలమటిస్తున్నారు.
ధరల అస్ధిరత్వం
మార్కెట్లలో అస్థిరతల వల్ల ఆహార ధాన్యాలు, ప్రధానమైన పంటల ధరలు ఒక్కోసారి విపరీతంగా పెరగడం, లేదా విపరీతంగా పడిపోవడం వల్ల తాత్కాలికంగా చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. కోవిడ్‌ మహమ్మారి ప్రభావం, రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం, కట్టడి చేయలేని నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార సంక్షోభం, ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం అన్నీ కలిసి నేడు ఆకలి బాధితుల సంఖ్య పెరిగేలా చేస్తున్నాయి. ఇదే కాకుండా ఆహార ధాన్యాలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల మౌలిక ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి లాభదాయకమైన వాణిజ్య పంటలవైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.
నాగరిక సమాజంలో కూడా ప్రత్యేకించి వెనుకబడిన ఆర్ధిక వ్యవస్ధలలోని కుటుంబాలలో ఆహారాన్ని అందించే విషయంలో మహిళల పట్ల వివక్షత నేటికీ కొనసాగుతోంది. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60 శాతం మంది మహిళలే ఉండటం ఈ మాటలకు నిలువెత్తు నిదర్శం. మహిళలు పోషకాహారం తీసుకోకపోవడం వల్ల సమాజానికి జరిగే నష్టం చెప్పనలవి కానిది. ముఖ్యంగా గర్భిణులకు పోషకాహార సమస్య ఉంటే పుట్టే పిల్లల మీద అత్యంత ప్రభావం చూస్తుంది. తద్వారా అనారోగ్య పిల్లలకు జన్మనిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారనే విషయం దీనికి నిదర్శనం. ఇందులో కూడా 96.5 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండటం గమనార్హం. 50 శాతం శిశు మరణాల్లో 5 సంవత్సరాల లోపు వారే ఉంటున్నారు. మరో ఆందోళన కరమైన విషయం ఏమిటంటే ఎయిడ్స్‌, మలేరియా, క్షయ వ్యాధుల వల్ల జరిగే మరణాల కంటే.. ఆకలి వల్ల పోషకాహార లోపం వలన జరిగే మరణాల రేటే ఎక్కువగా ఉంది. ఈ మరణాల స్థాయి ఎంతగా ఉందంటే.. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. వీటిన్నింటికీ పరోక్షంగా మహిళలకు పోషకాహార లోపమే ప్రధాన కారణం.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఆహారం విషయంలో కొనసాగుతున్న పోకడలను అంచనా వేయడానికి ప్రధానంగా రెండు రకాలైన సూచీలను ప్రవేశ పెట్టడం జరిగింది. వాటిలో ఒకటి…
ఆకలి సూచీ
మన దేశ కుబేరులు ప్రపంచ కుబేరుల జాబితాలో స్ధానం కోసం పోటీ పడుతున్నారు. అంతేకాదు, శాస్త్రీయ సాంకేతిక రంగాలలో నవకల్పనలలో భారత్‌ దూసుకుపోతోందని ఈ మధ్యనే ప్రపంచ ఆవిష్కరణల సూచీలో 40వ ర్యాంకు సాధించి మన గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటాం. ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్‌ చేరుకోనుందని మన నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ఆహార భద్రత కలిగి ఆకలి మరణాలు లేని దేశంగా మాత్రం మనం గుర్తింపు పొందనున్నామనేది మాత్రం చెప్పలేక పోతున్నారు.
ఈ మధ్యనే ప్రపంచ ఆకలి సూచీ నివేదిక కూడా ప్రకటించారు. దానిలో కూడా మన వెనుకబాటుతనం స్పష్టంగా కనిపించింది. మొత్తం 116 దేశాలను అధ్యయనం చేస్తే ఆకలి సూచీలో మన ర్యాంక్‌ 101గా ఉంది. ఇన్ని సంవత్సరాల స్వతంత్య్ర భారత చరిత్రలో ఇంకా ఇంత వెనుకబాటు తనం ఉందంటే ఎంతైనా విచారించాల్సిన విషయం. అయితే ఆహార లభ్యత, నాణ్యత, ఆహారోత్పత్తిలో సహజ వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో పాకిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక కంటే భారత్‌ మెరుగైన స్థానంలో ఉందని ఈ నివేదిక తెలిపింది. గత పది సంవత్సరాలుగా ఆహార భద్రత సాధనకు కృషి చేస్తున్న దేశాల అభివృద్ధి ఫలితాలు చూస్తే మనదేశం ముఖ్యంగా మన పొరుగు దేశాలైన పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌లు సాదించిన అభివృద్ధి కన్నా మనదేశం వెనుకంజలోనే ఉందని నివేదిక తెలిపింది.
ఆహార భద్రత సూచీ
ప్రతీ సంవత్సరం ప్రపంచ దేశాల ఆహార భద్రత పరిస్ధితులను సర్వే చేసి వాటికి ర్యాంకులు కేటాయిస్తున్నారు. దీనినే ఆహార భద్రత సూచీ అని అంటారు. దీనిలో భాగంగా లండన్‌కు చెందిన ఎకనమిస్ట్‌ ఇంపాక్ట్‌ సంస్థ కోర్టెవా అగ్రిసైన్స్‌ సాయంతో తయారు చేసిన 113 దేశాలతో కూడిన వార్షిక నివేదిక జీఎఫ్‌ఎస్‌ ఇండెక్స్‌ – 2021ను తాజాగా విడుదల చేసింది. ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, సహజ వనరులు వంటి అంశాల ఆధారంగా 113 దేశాల్లో ఆహార భద్రతను అంచనా వేసి తయారు చేసిన నివేదికలో భారత్‌ 71వ స్థానంలో వుంది. అంతే కాకుండా ఈ పరిశీలనలో ఆహార భద్రత సమగ్ర స్వరూపాన్ని అధ్యయనం చేసి, ఆదాయ అసమానతలు, ఆహార భద్రత, సహజ వనరులు, ఆహారానికయ్యే ఖర్చుతో పాటు మొత్తం 58 అంశాలను పరిగణలోనికి తీసుకుంది. ఆహార భద్రతలో పాయింట్ల దిశగా చూస్తే మన దేశానికి 57.2 పాయింట్లు దక్కాయి. ఈ విషయంలో భారత పొరుగు దేశాలైన పాకిస్తాన్‌ 52.6 పాయింట్లతో 75వ స్థానంలో, శ్రీలంక 62.9 పాయింట్లతో 77వ స్థానంలో, నేపాల్‌ 79, బంగ్లాదేశ్‌ 84వ స్థానంలో ఉన్నాయి. అంటే ఈ దేశాల కన్నా మన పరిస్ధితి కొంత మెరుగ్గానే ఉంది. ఒక్క చైనా మాత్రం మనకన్నా చాలా మెరుగ్గా 34వ స్థానంలో వుంది.
స్వాతంత్య్రానంతరం కరువు పరిస్థితులు ఏర్పడక పోయినప్పటికీ ఆకలినైతే ఇప్పటి వరకూ జయించలేదనే చెప్పాలి. అందుకే ఆహార భద్రత నివేదికలో పొరుగు దేశాలకన్న భారత్‌ మెరుగ్గానే ఉంది. కాకపోతే సరసమైన ధరలకు ఆహార ధాన్యాలు పొందడంలో మాత్రం పొరుగు దేశాల కన్నా వెనుకబడి ఉన్నాం. అంతే కాదు 10 ఏండ్ల ఆహార భద్రత విషయంలో భారత్‌ సాధించిన పురోగతి పొరుగు దేశాలకన్న వెనుకంజగా ఉంది అని గణాంకాలతో సహా చెప్పి ఆహార భద్రత విషయంలో ఎకనమిస్ట్‌ ఇంపాక్ట్‌ సంస్థ హెచ్చరించింది.
ఇటీవల భారత్‌ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అని గర్వంగా చెప్పుకునే మన నేతలు పై సూచికలు పేర్కొన్న వాస్తవాలను మాత్రం అంగీకరించడం లేదు.
స్వామినాధన్‌ సిపార్సులు
ఆహార ఉత్పత్తిలో దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించిన మహా దార్శనికుడిగా భారతీయుల మదిలో స్వామినాథన్‌ హరిత విప్లవ పితామహుడిగా చిరస్మరనీయంగా మిగిలాడు. ఆకలి మరణాల స్ధితి నుంచి ఆహార పదార్ధాలు ఎగుమతి చేసే స్ధితికి దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసాడు. హరిత విప్లవ సాధనే కాదు, ఆహార భద్రత సాధించే విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్‌లో ఎన్నో విలువైన సూచనలు చేసిన మహనీయుడు స్వామినాధన్‌.
ఆయన అధ్యక్షతన రైతులపై జాతీయ కమిషన్‌ 2004 నవంబర్‌ 18 న ఏర్పడింది. ఈ కమిషన్‌ డిసెంబర్‌ 2004, అక్టోబర్‌ 2006 మధ్య ఐదు నివేదికలను సమర్పించింది. రైతు పోటీతత్వం, వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల, ఉపాధి, ఆహార భద్రత, రుణం, బీమాకు సంబంధించిన కీలక సిఫార్సులను నివేదికలో పొందు పరిచారు. పంటలే కాదు, పంటలను పండించే రైతుల బాగోగుల గురించి కూడా ఆయన లోతుగా ఆలోచించేవారు. కనీస మద్దతు ధరకు సర్కారు అండగా నిలవాలని గట్టిగా వాదించిన వారిలో ఆయన అగ్రగణ్యులు. ఎరువులు, పురుగుల మందులు ఎడాపెడా వినియోగించడం వల్ల అంతిమంగా భూసారం తగ్గిపోతుందని భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా వాడుకుంటే ముప్పు తప్పదని ఏనాడో హెచ్చరించిన దార్శనికుడు ఆయనే. ప్రధానంగా సగటు ఉత్పాదక వ్యయానికి 50 శాతం అధికంగా చేర్చి మద్దతు ధర నిర్ణయించాలన్న ఆయన సూచన సర్వజనామోదం పొందినప్పటికి ప్రభుత్వాలు మాత్రం ఆ సూచనల అమలులో చిత్తశుద్ధి చూపడం లేదనేది సత్యం.
ప్రచారంలో మాత్రం ఆహార భద్రత చట్టాన్ని ఏర్పాటు చేశాం, పోషకాహారం అందించడంలో కృషి చేస్తున్నాం అని చెబుతున్నప్పటికీ ఆహారచట్టంలోని హక్కులను విస్తృత ప్రచారం చేయడం లేదు.
నిధులు వెచ్చించడమే కాదు, దానిపై సమగ్ర పర్యవేక్షణ చేయగలిగితేనే సత్ఫలితాలు సాధించగలుగుతాం. పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్దిదారులకు మాత్రమే చేరే విధంగా పటిష్ట చర్యలు చేపట్టగలిగితే ఆహార భద్రతను సాధించడం మనకు పెద్దకష్టం కూడా కాదు. ఇటువంటి స్థితిలో నిర్ణీత కాల వ్యవధిలో లభించిన ఆ ఉత్పత్తిని నిరంతర వినియోగం కొరకు జాగ్రత్తగా భద్రపరచి అందించడం ప్రధానంగా పేదరికపు దిగువున ఉన్న ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. అయితే ఈ విషయంలో ఉత్పత్తి దారులు, అదే సమయంలో వినియోగదారులు కూడా విభిన్న రీతులలో ఆహార భద్రతకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం సురక్షితమైనదా కాదా అని నిర్ణయించుకునే విషయంలో ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టే రైతు దగ్గర నుంచి ఆ ప్రక్రియలో కీలక పాత్ర వహించే శ్రామికులు, విధానాలు రూపొందించే ప్రభుత్వ నేతల వరకూ ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఎవరి పాత్ర వారు సక్రమంగా నిర్వరిస్తే గుణాత్మక ఆహారం వినియోగదారుల చెంతకు చేరుతుంది. మెరుగైన ఆహారం తీసుకున్న వారి శారీరక సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. అటువంటి వారిలో రోగ నిరోధకశక్తి మెరుగ్గా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. ఇటువంటి ఆరోగ్యంగా వున్న మనుషులు కలిగిన సమాజాలు మంచి ప్రగతిని సాధిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
– రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578 

Spread the love