హక్కుల ప్రాధాన్యత ప్రపంచానికి చాటుదాం

Let us show the importance of rights to the worldమానవ ప్రగతికి దోహదం చేసే పరిస్థితులే హక్కులు. సమాజ ఆమోదం పొంది, చట్టబద్ధమైనప్పుడే అవి అర్థవంతమవుతాయి. జాతి, మత, కుల, లింగ, ప్రాంతీయ తేడాలతో సంబంధం లేకుండా మానవులందరికీ హక్కులు వర్తిస్తాయి. వ్యక్తి గౌరవాన్ని (ఔన్నత్యాన్ని) పెంపొందించడానికి హక్కులు అవసరం. ఇవి మానవ నాగరికతకు నూతన ప్రమాణాలు.
హక్కులు లేని మనిషి బానిసతో సమానం. ఎందుకంటే మనిషి స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయి. ఎన్నో పోరాటాల ద్వారా, మరెన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న మానవ హక్కులకు నేడు రక్షణ లేకుండా పోయింది. మానవ హక్కులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే వాటిని హననం చేస్తున్నాయి. మానవుల మాన, ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవహక్కులు. పుట్టుకతో ప్రతి వ్యక్తికి లభించే ఈ హక్కులు జాతి, మత మౌఢ్యం వల్ల, రాజకీయాల వల్ల, వ్యక్తిగత ద్వేషం, కక్ష, కార్పణ్యాల వల్ల మనుషుల జీవితాలకు భరోసా లేకుండా పోతోంది. ఈ స్ధితిలో మానవహక్కుల ఉల్లంఘనలు అనేవి సర్వసాధారణమయ్యాయి.
ప్రపంచంలో మానవులందరూ ఒక్కటే అని మనం గొప్పగా చెప్పుకున్నా, నవ నాగరిక సమాజంలో మన ప్రయాణం సాగుతూ ఉన్నా అనేక సందర్భాలలో స్వార్థం, కుటిలత్వం, అమానుషత్వం వంటి అనేక కారణాల వల్ల మనిషి ప్రాణాలకు సాటి మనుషుల నుండే ముప్పు వాటిల్లుతోంది. అటువంటి పరిస్థితులలో మనిషి ప్రాణాలకు భద్రత కావాలంటే మానవ హక్కులు అవసరం. ఆ హక్కుల ద్వారానే మనిషి తనకు తాను రక్షణ కల్పించుకోవచ్చు. ఈ మానవ హక్కుల గురించి ఈనాడు చర్చ చేయడం, పోరాటాలు చేయడం అనేది గొప్ప విషయం కాదు. క్రీ.శ.1215లోనే ఈ మానవ హక్కుల సాధన విషయమై ఒక ప్రకటన జరిగింది అంటే ఆశ్చర్యకరమే. అప్పటి ఇంగ్లాండ్‌ రాజు జాన్‌ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటనగా భావించవచ్చు.
న్యాయబద్ధమైన తీర్పు ద్వారా తప్ప, మరేవిధమైన పద్ధతుల్లోనూ పౌరుల స్వేచ్ఛను హరించడం నిషేధం’ అని హక్కులకు సంబంధించిన చారిత్రక శాసనం ‘మాగ్నాకార్టా’ స్పష్టం చేసింది.
ఈ భూమ్మీద ఒకానొకప్పుడు పాలన సాగించిన నియంతలు, చక్రవర్తులు, రాజులు మా మాటే వేదం, మేం దైవాంశ సంభూతులం, తిరుగులేని అధికారం మాకే స్వంతం, చట్టానికి మేం అతీతులం అంటూ పాలన సాగించిన పాలకుల అధికారానికి మొట్ట మొదటిసారిగా అడ్డుకట్ట వేసిన ఘటనకు మరో పేరే మాగ్నాకార్టా.
ఎవరైతే ప్రజల హక్కులను అణచివేసి, అతనే తప్పనిసరి పరిస్ధితులలో హక్కుల పత్రంపై సంతకం చేసిన క్షణాలు… ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి పునాది పడిన ఆ ఘడియల నుండే న్యాయం, స్వేచ్ఛ అనే మహత్తర భావాలకు పునాదులు పడ్డాయి. రాజే సర్వాధికారి అని ప్రబలంగా నాటుకుపోయిన అభిప్రాయం ఆ రాజు సంతకంతోనే కొట్టుకు పోయింది. నియంతలపై ప్రజా సంక్షేమం పట్టని వారిపై ఈ రోజున ఉద్యమాలు చేయడం గొప్ప విషయం కాదు. ఏనాడో 800 సంవత్సరాల క్రితమే సర్వాధికారాలు చెలాయిస్తున్న అప్పటి ఇంగ్లాండ్‌ రాజు జాన్‌ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఫలితమే మాగకార్టా. నియంత రాజు మెడలు వంచి స్వేచ్ఛ, సమానత్వం అనే భావాలు మానవుల హక్కు అని నిరూపించి ప్రపంచానికి అందించిన వ్యక్తి స్వేచ్ఛల హక్కుల పత్రం.. ఇది చరిత్రలో ఓ కీలక ఘట్టం. చట్టానికి ఎవరూ అతీతులు కాదు రాజైనా పేదైనా చట్టం ముందు అందరూ సమానులే అంటూ ఇంగ్లాండ్‌ ప్రజానీకం పోరు బాట పట్టింది.
రాజే సర్వాధికారి అనే వేల సంవత్సరాల అభిప్రాయాన్ని కేవలం ఆ ఒక్క సంతకం తో తల్లకిందులు చేసింది. తిరుగులేని ఇంగ్లాండ్‌ రాజే చట్టానికి లోబడి వ్యవహరించే అనివార్య పరిస్థితిని ఈ చారిత్రక ఒప్పందం కల్పించింది. ఆ పరిణామంతో నియంతత్వ, తిరుగులేని అధికారాలు క్రమంగా పలుచబడుతూ, ప్రస్తుతం ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆవిర్భావానికి దారితీసింది. ప్రపంచ మానవాళికే గొప్ప బహుమతిని అందించింది. మానవ హక్కులకు పట్టం కట్టింది. భావితరాల వారికి ఈ వ్యక్తి స్వేచ్ఛ హక్కుల పత్రం నాందీ ప్రస్తావనగా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ పత్రం స్వేచ్ఛా హక్కుల పరిరక్షణోద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ తదుపరి 1789 వ సం||లో ఫ్రెంచ్‌ డిక్లరేషన్‌ పేరిట మానవ హక్కుల గురించి పేర్కొన్నారు. కాలక్రమేణా అనేక మంది మేధావులు ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుండాలని, సాటి మనిషిని మనిషిగా కూడా చూడాలని అది హక్కుల కల్పన ద్వారానే సాధ్యపడుతుందని అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది.
మనుషుల్లో జాతి, భాష, కులమతాల జాఢ్యం వీడని కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. మానవ హక్కులు లేని నాడు, మానవ జీవనం మరింత హీనంగా పరిణమిస్తుందని అనేక మంది సాంఘిక సంస్కర్తలు తమ భావాలను వ్యక్త పరుస్తూ అనేక గ్రంధాలు, ప్రసంగాలు చేపట్టి ఈ హక్కుల ప్రాధాన్యత ప్రపంచానికి చాటి చెప్పారు. వీటిని పురస్కరించుకునే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల రూపకల్పనకై ముందడుగు వేసింది.
మానవహక్కుల ప్రధాన లక్ష్యాలు..
– జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ కారణాలతో వివక్ష లేని జీవనం.
– చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడటం.
– వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ.
– నిర్బంధం లేని జీవన విధానం.
– స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు.
– సురక్షిత ప్రాంతాలలో జీవించే హక్కు.
– బలవంతపు పనుల నుంచి విముక్తి.
– విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ.
– భావప్రకటన, స్వాతంత్య్రపు హక్కు.
– ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు.
ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి ఇబ్బందులకు గురి చేసినపుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడుతాయి.
విశ్వమానవ హక్కుల ప్రకటన:
భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులు ఉంటాయి. కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కూడా చూడటం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరిస్తోంది. పరువుహత్య, జాతి వివక్ష హత్య, అత్యాచార ఘటనలు.. ఇలా అనేకరకాల వార్తలు రోజూ మనం చూస్తునే ఉన్నారు. కొంతమంది ఇంకా జాతి, భాష, కులమతాల జాఢ్యాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘసంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పిచేందుకు 1948 డిసెంబర్‌ 10న ఐక్యరాజ్యసమితి ‘విశ్వమానవ హక్కుల ప్రకటన’ చేసింది.
మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈరోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తోంది. ఎందుకంటే ఐరాస ఆధ్వర్యంలో పారిస్‌ కేంద్రంగా ప్రపంచ దేశాలన్నీ ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. అందుకే అప్పటి నుంచి ఏటా డిసెంబరు 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
దీనిలో భాగంగా ఒక్కో ఏడాది ఒక్కో అంశాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధానంగా తీసుకుని పనిచేస్తుంది. ఈ ఏడాది (2023) ధీమ్‌ ”భవిష్యత్తులో మానవ హక్కుల సంస్కృతిని ఏకీకృతం చేయడం మరియు నిలబెట్టుకోవడం”
ఈ థీమ్‌ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను పునరుద్ధరించడానికి, రక్షించడానికి అందరం కలిసి పని చేయాలని నొక్కి చెబుతుంది. భవిష్యత్తులో, మనం విభిన్న సంస్కృతులు, వ్యక్తిగత నమ్మకాల నుండి వచ్చిన వ్యక్తులను కలిగి ఉండాలనుకుంటే, మనం మానవ హక్కులపై ఒక ఏకీకృత సంస్కృతిని ఏర్పరచుకోవాలి. ఈ సంస్కృతిని నిలబెట్టడానికి, మనం మానవ హక్కుల గురించి అవగాహన పెంపొందించడం, హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం, హక్కుల ఉల్లంఘనల బాధితులకు సహాయం చేయడం వంటివి చేయాలి.
మనం కలిసి పని చేస్తే, మనం ప్రపంచంలో మానవ హక్కులను మెరుగుపరచగలమని ఈ ధీమ్‌ తెలియ చేస్తుంది.
మనం అంతా కలసి పని చేయాలి అంటే సమానత రావాలి. అంతరాలు తగ్గాలి. భిన్న వర్గాల మధ్య అసమానతలు అంత మొందించాలి. హక్కుల రక్షణకు ఆనాడే బలమైన పునాది ఏర్పడుతుంది.
భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ సమానమేనన్నది ఐక్యరాజ్యసమితి సంపూర్ణ విశ్వాసం కూడా. ప్రతి వ్యక్తికీ పుట్టుకతోనే కొన్ని హక్కులు లభించినా, వాటికి పూర్తి పరిరక్షిణ జరగడం లేదన్నది జగమెరిగిన సత్యం. మానవ హక్కులు పరిరక్షించడం అనేది ఆయా దేశాల్లోని ప్రభుత్వాల బాధ్యత. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం పనికిరాదని ఐక్యరాజ్యసమితి నొక్కి వక్కాణించింది. ఈ నేపద్యంలో ఐక్యరాజ్యసమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్య్రాలకు విశ్వజనీన గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్యదేశాలు ప్రతిన బూనాయి. ఈ కారణం చేతనే సర్వప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటించింది. దీనిని ప్రాతిపదికగా తీసుకుని 1992లో జరిగిన జెనీవా మానవహక్కుల సదస్సులో హక్కుల పరిరక్షణకై అన్ని దేశాలు కలిసి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
జాతీయ మానవ హక్కుల కమిషన్‌
మానవ హక్కులు వ్యక్తులకు, సమాజానికి, రాజ్యానికి మధ్య సరిహద్దులా ఉంటాయి. తోటి వ్యక్తులు, సమాజం, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థల నుంచి (రాజ్యం) సగటు మనిషిని మానవ హక్కులు కాపాడుతాయి. ప్రజాస్వామ్యం ప్రాచుర్యంలోకి రావడంతో మానవులంతా సమానమనే భావనకు ప్రాధాన్యం పెరిగింది. ప్రతి సమాజంలో కొన్ని వర్గాలకు చెందిన వారు చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాల వల్ల వెనుకబడి ఉంటారు. వీరు మిగిలిన వారితో సమానంగా రాజ్యం, సమాజం అందించే సదుపాయాలను (హక్కులను) అనుభవించలేరు. దీనికి తోడు ఆధునిక కాలంలో శక్తివంతమైన వ్యవస్థగా రూపొందించిన ఉద్యోగిస్వామ్యం సమాజానికి సేవ చేయడానికి బదులు, ఆ నెపంతో సగటు పౌరుని హక్కులను తన అధికార దుర్వినియోగం ద్వారా కాలరాస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ పౌరుని కనీస హక్కులను కాపాడటానికి స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే యంత్రాంగం అవసరమైంది. అదే మానవ హక్కుల కమిషన్‌. భారతదేశంలోని మానవ హక్కుల సంస్థలు హక్కుల పరిరక్షణకు ఒక సంస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ క్రమంలో జెనీవా సదస్సు పిలుపుననుసరించి భారత్‌లో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993లో ఆమోదించారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1993 అక్టోబర్‌ 12న మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినా రాజ్యాంగబద్ధత లేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సక్రమంగా సాగించడానికి, జీవనాభివృద్ధికి అనేక హక్కులు తోడ్పడతాయి. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చట్టబద్దమైన, స్వయం ప్రతిపత్తి గల సంస్థ మాత్రమే కాని రాజ్యాంగబద్దమైన సంస్థ కాదు. అలాగే రాష్ట్రాల స్థాయిలో పనిచేసే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేశారు. మన దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరంగా జరిగే లోటుపాట్లను వేలెత్తి చూపేందుకు, సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ఈ కమిషన్లు ఏర్పాటైనప్పటికి ప్రతీ ఏటా ఈ సంఘాలు ఇచ్చే నివేదికలను, వివిధ సందర్భాల్లో ఇవి చేసే సిఫార్సులనూ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. చాలా సందర్భలలో వీటి అమలుకు తిరిగి న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సివస్తోంది. మానవ హక్కుల సంఘాలు చేసే సిఫార్సులు అమలుపరచాలా లేదా అనే అంశంపై చాలా కాలం నుంచి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మానవ హక్కుల సంఘాల అధికారాలు కానీ విచారణలు కానీ న్యాయపరమైన కార్యకలాపాలుగానే పరిగణించాలని, వాటికి సివిల్‌ కోర్టులకుండే అధికారాలుంటాయని సుప్రీంకోర్టు వేరే సందర్భంలో చెప్పినా ప్రభుత్వాల నైజంలో పెద్దగా మార్పు రాలేదు.
పైగా మానవ హక్కుల చట్టాలను నిర్వీర్యం చేయడానికి పోటా, ఉపా వంటి కొన్ని ప్రత్యేక చట్టాలు కూడా భారత ప్రభుత్వం తీసుకు వచ్చింది. పోలీస్‌స్టేషన్‌ లలో ఎన్నో లాకప్‌డెత్‌లు జరుగుతున్నా నిర్ధారణ జరిగి శిక్షలు పడేది కొందరికే.
ఈ మధ్య దేశంలో చాలా మందిపై ప్రభుత్వాలు రాజ ద్రోహం కేసులను పెట్టడం చూస్తున్నాం. ప్రభుత్వంపై విమర్శ చేయడం అంటే అది రాజద్రోహం క్రింద పరిగణలోనికి తీసుకుంటారా? ప్రభుత్వం తీరు తెన్నులు ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సందర్భంలో ప్రజల హక్కులకు భంగం ఏర్పడే సమయంలో ప్రజలు తమ ఆగ్రహాన్ని వివిధ నిరసనల రూపంలో చూపడం అనేదానికి ఉగ్రవాద ముద్ర వేసి కేసులు బనాయించడంపై మానవ హక్కుల సంఘాలు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాయి. దేశమేదైనా హక్కులకు దిక్కులేని పరిస్థితులు నేడూ అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. మానవ హక్కులు దేవతావస్త్రాల్లా తయారయ్యాయి.
మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి బలహీనులే బాధితులుగా మిగులుతున్నారు. సమాజంలోని బలహీనులు తరచుగా హక్కుల అణచివేతకు గురవుతున్నా, వారికి న్యాయం దక్కుతున్న సందర్భాలు మాత్రం అరుదుగానే ఉంటున్నాయి. చాలా ప్రభుత్వాలు మానవ హక్కుల పరిరక్షణకు కంటితుడుపుగా అధికారిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నా, అలాంటి చోట్ల ప్రభుత్వాల అధీనంలో పనిచేసే శాంతిభద్రతల బలగాలు, రక్షణ బలగాలు ప్రజల కనీస మానవ హక్కులను కాలరాస్తున్నాయి.
ప్రపంచంలోనే అతి పాత ప్రజాస్వామ్య దేశంగా జబ్బలు చరుచుకునే అగ్రరాజ్యం అమెరికాలో సైతం నల్లజాతి వారికి సమాన హక్కులు ఇప్పటికీ దక్కడం లేదు. అక్కడి చట్టాల ప్రకారం పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నా, అమెరికన్‌ పోలీసులు మాత్రం నల్లజాతి ప్రజల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. కేవలం ‘అనుమానం’తో నల్లజాతి వారిపై ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్న ఉదంతాలు తరచుగా వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఉత్తర ఇరాక్‌, సిరియా ప్రాంతాలను గుప్పిట్లో పెట్టుకున్న ‘ఐసిస్‌’ పాల్పడుతున్న ఘాతుకాల గురించి చెప్పుకుంటే పెద్ద గ్రంథమే తయారవుతుంది.
ఇండోనేసియా జాతీయ పోలీసు దళంలోకి మహిళలు ఎవరైనా చేరాలనుకుంటే వారు తప్పనిసరిగా కన్యత్వ పరీక్షలను ఎదుర్కోవాల్సిందే.
కాంగో, గాంబియా వంటి ఆఫ్రికా దేశాలైతే పౌరుల పాలిట ప్రత్యక్ష నరకాలే!
ఉత్తర కొరియాలో పరిస్థితి మరీ దారుణం. అక్కడ అధ్యక్షుడి ఆగ్రహానికి గురైతే ఎంతటి వారైనా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే! అక్కడి మహిళా సైనికులపై జరుగుతున్న ఘాతుకాలపై వెలుగులోకి వచ్చిన కథనాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
మయన్మార్‌లో బలగాలు రోహింగ్యాలకు కనీస హక్కులను నిరాకరించడమే కాకుండా, బలప్రయోగంతో దేశం నుంచి వెళ్లగొట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన సంగతీ తెలిసిందే.
నేడు జరుగుతున్న రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో, ఇజ్రాయేల్‌ పాలస్తీనా యుద్ధంలో జరుగుతున్న మానవ హక్కుల హననం చూస్తూనే ఉన్నాం. యుద్ధాల పరిణామం మానవ హక్కుల ఉల్లంఘనే అని చరిత్ర చూపుతూ ఉంది. వీటి రక్షణకై తపించే ఐక్యరాజ్య సమితి మాత్రం ఆచరణ లేకుండా నీతులు చెపుతూ అగ్ర రాజ్యాల విషయంలో మౌనంగా ఉండి పోతుంది.
యుద్ధం.. మానవ హక్కులు
ఏమైనప్పటికీ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగితే బలైపోయేది నిస్సహాయులైన సామాన్య పౌరులే. తాజా వార్తలు వింటుంటే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎందరో శవాలుగా మారుతున్నారని అర్థమవుతుంది. ఇది హృదయం ఉన్న ఏ మనిషినైనా కలచివేస్తుంది. అమాయకులే యుద్ధాలలో బలైపోతారు. ఇళ్ళ మధ్య గోడలు.. దేశాల మధ్య సరిహద్దులు.. ఎవరికి వారు తమ జీవితాలను ప్రశాంతంగా గడుపుకోవడానికే గాని ఒకరినొకరు ద్వేషించడానికి, నిర్మూలించడానికి కాదు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనత చాటుకునే మన మన దేశంలో కూడా యధేచ్చగా హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మన దేశ రాజ్యంగంలో ప్రాథమిక హక్కులు పేర్కొనడమే కాదు, ఈ హక్కులకు భంగం వాటిల్లితే రాజ్యాంగ పరిధిలో చట్టపరంగా రక్షణ పొందే హక్కును కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది.
దేశంలో మానవ హక్కులకు రక్షణ కల్పించడానికి 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పడింది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్రాల్లోనూ మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పడ్డాయి. ఇలా మన రాజ్యాంగంలో హక్కులు, మన చట్టాల్లో హక్కుల పరిరక్షణ మార్గాలు చాలా పకడ్బందీగానే ఉన్నా, మానవ హక్కులకు భరోసా కల్పించడంలో మన దేశంలో పెద్దగా సాధించినదేమీ లేకపోగా, ఎక్కడో ఒకచోట సామాన్యుల హక్కులకు తరచుగా విఘాతం కలుగుతూనే ఉంది. యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి.
బానిసత్వం
ఆధునిక బానిసత్వంలో, వెట్టిచాకిరిలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. కట్టుబానిసలుగా వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న అమాయకుల సంఖ్య మన దేశంలో 1.83 కోట్లు అని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వెట్టి చాకిరీ
ప్రపంచవ్యాప్తంగా వెట్టి చాకిరిలో మగ్గుతున్న వారి సంఖ్య 4.58 కోట్లు అయితే, వారిలో దాదాపు మూడోవంతుకు పైగా వెట్టి కార్మికులు మన దేశంలోనే ఉన్నారు. దోపిడీకి గురికాకుండా ఉండే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిన మన దేశమే శ్రమ దోపిడిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుండటం విషాదకర వాస్తవం.
విద్యా హక్కు
విద్యా హక్కు అమలులో ఉన్నా, దాదాపు 1.26 కోట్ల మంది చిన్నారులు ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేస్తున్నారు. పేదరికం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను వెట్టిచాకిరికి పెడుతున్నారు. వెట్టిచాకిరి కోరల్లో చిక్కుకుంటున్న బాలికల్లో చాలామంది లైంగిక దోపిడీకి కూడా గురవుతున్నారు.
భావప్రకటనా స్వేచ్చకు సంకెళ్లు
స్వతంత్ర భారతదేశంలో భావ ప్రకటనకూ దిక్కులేకుండా పోతోంది. ఎమర్జెన్సీకాలంలో భావప్రకటనకు పూర్తిగా సంకెళ్లు పడ్డాయి. ఆ తర్వాత ఇటీవలి కాలంలో భావప్రకటనా స్వేచ్ఛకు తరచుగా అవరోధాలు ఏర్పడుతున్నాయి. కార్టూన్లు వేసినందుకు, వ్యాసాలు, పుస్తకాలు రాసినందుకు, చివరకు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేసినందుకు కటకటాల వెనక్కు వెళ్లే పరిస్థితులు, కేసుల్లో చిక్కుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వంపైన, ప్రభుత్వాధినేతలపైన విమర్శలు చేసే వారికి బెదిరింపులు, భౌతిక దాడులు ఎదురవుతున్నాయి. అవినీతి బాగోతాలను బట్టబయలు చేసేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయిస్తున్న వారిలో కొందరికి ఏకంగా ప్రాణాలకే ముప్పు ఎదురవుతోంది.
రక్షకులే భక్షకులు
మానవ హక్కుల పరిరక్షణలో, శాంతిభద్రతల అమలులో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసు బలగాలు యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. పోలీసుల కస్టడీలోను, జుడీషియల్‌ కస్టడీలోను చిత్రహింసలకు తాళలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
2015 సంవత్సరంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 46 మంది మహిళలు పోలీసుల చేతిలో అత్యాచారాలకు గురయ్యారని, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులపై గత ఏడాది 36 వేలకు పైగా కేసులు నమోదైనట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రకటించింది.
భౌతిక దాడులు
ఒక వర్గం అభిప్రాయాలకు భిన్నంగా మరోవర్గానికి చెందిన వారెవరైనా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే, వారిపై భౌతిక దాడులకు తెగబడే మూకలు పేట్రేగిపోతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరించడానికి కూడా అలాంటి మూకలు వెనుకాడటం లేదు. వీళ్ల తాకిడికి ఎక్కువగా రచయితలు, కళాకారులు, అవినీతి పాలనపై విమర్శలు సంధించే వాళ్లు, నిబంధనలకు కట్టుబడి నిజాయతీగా విధులు నిర్వర్తించే ప్రభుత్వాధికారులు బాధితులవుతున్నారు.
మానవ హక్కుల గురించి మాట్లాడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, దేశద్రోహంగా పరిగణిస్తున్న పరిస్ధితులు చూస్తున్నాం. హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతూ ఉంటే మానవహక్కుల కోసం పోరాడే వాళ్ళు జైళ్లలో మగ్గుతున్నారు.
ఎన్‌ కౌంటర్లు
ఎన్‌కౌంటర్ల పేరిట భద్రతా బలగాలు పొట్టన పెట్టుకుంటున్న వారి సంఖ్య తక్కువేం కాదు. జమ్ము కశ్మీర్‌లోను, ఈశాన్య రాష్ట్రాల్లోను భద్రతా బలగాలు సామాన్యులపై సాగించే దమనకాండకు సంబంధించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎవరిపైనైనా ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనే అనుమానం వస్తే చాలు, కాల్చి పారేయడమే పనిగా పెట్టుకున్న పోలీసులు ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందే ఉన్నారు.
కస్టడీ మరణాలు
పోలీసు కస్టడీ, జుడీషియల్‌ కస్టడీల్లో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి బాధ్యులకు శిక్షలు పడుతున్న సందర్భాలు దాదాపు రెండు శాతం మాత్రమే ఉంటున్నాయి. కస్టడీ మరణాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు ఒక ఎత్తయితే, మరోవైపు… బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడటం, కూంబింగ్‌ ఆపరేషన్ల పేరిట అత్యాచారాలకు తెగబడటం, చట్ట విరుద్ధంగా సెటిల్‌మెంట్లు చేయడం, పౌరుల పట్ల నిష్కారణంగా దురుసుగా ప్రవర్తించడం, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడం వంటి ‘ఘన’కార్యాలు కూడా మన దేశంలో పోలీసులకు చాలా మామూలు విషయాలే.
నిరంకుశ శాసనాలు
శాంతియుతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న లేదా నిరసనలు వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులు, పాత్రికేయులు, రచయితలు, రాజకీయ కలాపాలు సాగించే వారిని నిరంకుశ చట్టాల కింద ఎటువంటి విచారణ లేకుండా అరెస్ట్‌ చేసి, దీర్ఘకాలం జైలులో ఉంచడం పట్ల మొన్న జెనీవాలో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. భావప్రకటన స్వాతంత్య్రాన్ని బలోపేతం చేయడం కోసం ఉగ్రవాద కట్టడి చట్టాలను సమీక్షించాలని పలు దేశాలు సూచించాయి. ఆ చట్టాల పేరుతో మానవ హక్కుల కార్యకర్తలు, శాంతియుతంగా నిరసన తెలిపేవారిని, రచయితలు, పాత్రికేయులను అణచివేతకు గురి చేస్తున్నారని సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.
హక్కులు హననం చేసే చట్టాలు
1958లో నాగా వేర్పాటువాదం దృష్టిలో ఉంచుకుని సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (అఫ్సా) ఏర్పాటు చేశారు. ఆ చట్టాన్ని తదుపరి కాలంలో కశ్మీరానికి, కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు వర్తింపజేశారు. ఈ చట్టం వల్లనే కొందరు సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నాగాలాండ్‌ లోని మోన్‌ జిల్లాలో ఇంటికి తిరిగివెళ్తున్న ఆరుగురు గనికార్మికులపై భద్రతా బలగాలు కాల్పులకు మరణించిన సంఘటన మానవ హక్కుల ఉల్లంఘనకు అద్దం పడుతుంది. కేంద్ర హోమ్‌ శాఖామంత్రి జరిగిన సంఘటనకు చింతిస్తూ సంతాపం ప్రకటించడం నాగాలాండ్‌ ప్రభుత్వం మరణించిన వారికి 5 లక్షలు పరిహారం ప్రకటించడం చేశారు తప్ప ఈ చట్టం వలన ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు అనేది మాత్రం పట్టించుకోవడం లేదు.
రాజ్యాంగం ప్రకారం దేశ సంక్షేమం కోసం మూడు వ్యవస్థలను సృష్టించారు అవి శాసన వ్యవస్థ, పాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ మూడు సమన్వయంతో పనిచేస్తేనే ఏ దేశమైనా సంక్షేమ రాజ్యంగా ఆవిర్భవించి హక్కులు పరిరక్షించబడతాయి. కానీ దురదృష్టకరంగా ఇవి జవాబుదారీ తనంగా వ్యవహరించకపోవడంతో సమాజంలో వివక్ష, అణచివేత, అసమానత, హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. రాచరికపు దేశాలలో హక్కుల హననం సహజం అయితే ప్రజాస్వామ్య దేశాల్లో కూడా మానవ హక్కులకు భరోసా లేని పరిస్థితులు కనిపించడం దురదృష్టకరం.
కేవలం లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ పౌరుడి ప్రాథమిక హక్కులను కాపాడలేదని ఏనాడో అంబేద్కర్‌ హక్కుల ప్రస్తావనపై ఇలా తెలియ చేసాడు…
ఒక నిరుద్యోగికి కొంత వేతనమున్న, నిర్దిష్టమైన పనిగంటలు లేని ఒక ఉద్యోగం ఆఫర్‌ చేశారు. అతడికి ఒక షరతు పెట్టారు. ఉద్యోగ సంఘంలో చేరే హక్కు, భావ ప్రకటనా హక్కు, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, ఇతర హక్కులు ఉండవని చెప్పారు. ఇప్పుడు ఆ నిరుద్యోగి ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టం. ఆకలి భయం, ఇల్లూవాకిలీ కోల్పోతాననే భయం, ఏమైనా పొదుపు చేసుకొనుంటే ఖర్చయిపోతుందేమోనన్న భయం ఆ నిరుద్యోగికి కలుగుతాయి. ఈ భయాందోళనలు చాలా బలమైనవి. వీటివల్ల ఎవరూ తమ ప్రాథమిక హక్కుల కోసం నిలబడలేరు. అంటే ఆర్థిక వ్యవస్ధలు రాజ్యాంగ హక్కులను కేవలం ఆశయాలు, అలంకారాలుగా పెట్టుకుని మానవతా విలువలకు, రాజకీయ ప్రజాస్వామిక సూత్రాలకు, సంక్షేమానికి తిలోదకాలు ఇస్తున్నాయి. ఇటువంటి ఆర్ధిక వ్యవస్ధలలో వ్యక్తుల జీవితాలను రాజ్యవ్యవస్థ కాకుండా, ప్రైవేటు యాజమాన్యాలు నిర్దేశిస్తాయని, శ్రమ జీవుల దోపిడీనే లక్ష్యంగా పని చేస్తాయని ఈ నేపథ్యంలో జీవనోపాధి కోసం పౌరులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పోవాల్సి రావొచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతున్నది కూడా అదే. మనదేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నా మరలా హక్కుల ఉల్లంఘన పునరావృతం అవుతూనే ఉంది. రాజ్యాంగంలో వీటి పరిరక్షణకు కూడా న్యాయస్ధానాలు, హక్కుల కమీషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎంత మందికి ఈ విషయం తెలుసు ఎంతమంది ఇక్కడకు వరకు వెళ్లగలరు అనేది గమనించాలి.
హక్కులు అనేవి ఎన్నో సుధీర్ఘ పోరాటాల ఫలితంగా ఎందరో త్యాగాల ఫలితంగా లభించాయి తప్ప ఆయాచితంగా వచ్చినవి కాదని ప్రజలలో చైతన్యం తీసుకు రావడానికి మానవ హక్కుల సంఘాలు కృషి సల్పుతూనే ఉన్నాయి. హక్కుల సాధనకు కావలసింది అభ్యర్ధనలు కాదు పోరాటాలే శరణ్యం. ఎందుకంటే పోరాటం ద్వారా సాధించుకున్న హక్కుల అమలుకు కూడా పోరాట మార్గమే సరైన మార్గం అని గ్రహించాలి. అయితే ఆ పోరాటానికి ప్రజలలో కుల, మత, వర్గ ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ సంఘటితంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే ప్రభుత్వాలు దిగి వస్తాయి. హక్కులకు రక్షణ కల్పిస్తాయి. పోరాటం దేశ ద్రోహం ఎన్నటికీ కాదు, కారాదు. పోరాటం కూడా హక్కే.. పజల మానవ హక్కులను కేవలం ప్రభుత్వాలే హననం చేస్తున్నాయి అనడం కూడా సరైనది కాదు. దేశంలో ఏ పౌరుడైనా తన తోటి పౌరుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడినా కూడా అది మానవ హక్కుల ఉల్లంఘనే అని పౌరులందరూ గుర్తెరగాలి. జాతి, మతం, ప్రాంతం, లింగం, కులం, రంగు, రూపు పేరుతో వివక్షత చూపడంపై మనమందరం పోరాటం జరిపిననాడు మాత్రమే మానవ హక్కులను కాపాడుకోగలుగుతాం.
వీటి అన్నింటి కన్నా ముందు వ్యక్తులలోను ప్రభుత్వాలలోను నైతిక పరివర్తన పరమావిధిగా భావించే వాతావరణం రావాలి. అన్నింటికీ చట్టాలు పరిష్కారం కాదని గుర్తించాలి. ఆనాడే న్యాయస్ధానాల జోక్యమే అవసరం లేకుండా అందరి హక్కులు పరిరక్షింప బడతాయి.
మానవ హక్కుల కోసం పోరాడటం అనేది కేవలం మానవ హక్కుల సంఘం వారి బాధ్యత మాత్రమే కాదు. ఇది అందరి బాధ్యత సమిష్టిగా పోరాడి మానవ హక్కులను సంరక్షించుకుందాం.
– రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578

Spread the love