వికలాంగుల సంక్షేమం జరిగేనా!

రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక అంశాలలో వికలాంగులను చైతన్య పరిచేందుకు ఏర్పడినదే డిసెంబర్‌ 3. వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులురాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక అంశాలలో వికలాంగులను చైతన్య పరిచేందుకు ఏర్పడినదే డిసెంబర్‌ 3. వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కలిపించి వారిని సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 1981 ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది. వికలాంగులు సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తూ, సకలాంగులతో సమానంగా అన్ని హక్కులు పొందే విధంగా వికలాంగులను చైతన్య పరిచేందుకు 1992 డిసెంబర్‌ 3 నుండి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాం. 1998 నుండి ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు ఒక్క సందేశాన్ని ఇస్తూ వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి కృషి చేస్తుంది.
ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ వికలాంగుల సంక్షేమానికి చర్యలు తీసుకునే విధంగా వికలాంగుల హక్కుల ఒప్పంద పత్రం తయారుచేసి, దాని అన్ని సభ్య దేశాలు అమలు చేసే విధంగా కృషిచేసింది. భారతదేశం కూడా ఐక్యరాజ్యసమితి వికలాంగుల హక్కుల ఒప్పందంపై సంతకం చేసింది. 2007 అక్టోబర్‌ 1న భారత ప్రభుత్వ క్యాబినెట్‌ సిఫార్సులతో రాష్ట్రపతి ఆమోదించారు.
ప్రపంచ జనాభాలో 1.3 బిలియన్ల మంది వికలాంగులు ఉన్నారు. ఇది ప్రపంచ జనాభాలో 16 శాతం. ఆరోగ్య అసమానతల వలన చాలామంది వికలాంగులు చనిపోతున్నారు. సమాజంలో వివక్ష, అసమాన విధానాలు ప్రజల ఆరోగ్యాన్ని నిర్ణయించే అంశాలుగా ఉన్నవి. ఆరోగ్య సంరక్షణలో నాణ్యత లేకపోవడం, ఆరోగ్య కార్యకర్తలు తక్కువ మంది ఉండడం వంటివి వికలాంగుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆరోగ్య అసమానతల వలన వికలాంగులు మెరుగైన వైద్యం పొందడంలో వెనకబడి ఉంటున్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు సాధించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 6 మందిలో ఒక్కరికి అంగవైకల్యం ఉంది. వీరికి ఆరోగ్య సమానత్వం కనీస హక్కు. కానీ హింస, అవమానాలు, అన్యాయాలకు గురవుతున్నారు. ప్రపంచంలో పిలిప్పిన్స్‌, ఖతార్‌, బలుచిస్తాన్‌, పాకిస్తాన్‌, దుబారు, యూఏఈ దేశాల్లో చేస్తున్న మోడల్‌ డిజేబులిటీ సర్వే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో చేయవలసిన అవసరం ఉంది మోడల్‌ డిసబిలిటీ సర్వేలో సహాయ పరికరాలు ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని తేలింది. ఔనఉ 2030 నాటికి సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ లక్ష్యాలను నిర్దేశించింది. వీటి ద్వారా వికలాంగులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులో రావడానికి అవకాశం ఉంది. వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల్లో నివసిస్తున్నారు. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధుల్లో 46% మందికి వైకల్యం ఉందని అంచనా. ప్రతి ఐదుగురు తమ జీవిత కాలంలో వైకల్యానికి గురయ్యే అవకాశం ఉందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి.
రాజ్యాంగ ఫలాలు పొందడం వికలాంగుల హక్కు కాదా?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తయ్యింది. రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం సౌబ్రాతృత్వం వంటివి వికలాంగులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఆర్టికల్‌ 14 నుండి 19 వరకు సమాజంలో పౌరులందరూ సమానమేనని, ఎలాంటి వివక్ష ఉండరాదని పేర్కొంది. ఇవేవీ వికలాంగులకు దక్కడం లేదు. సమాజంలో నేటికీ వీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిన వస్తుంది. వికలాంగులు అంటేనే చిన్న చూపు చూస్తున్నారు. విద్యా ఉద్యోగాల్లో సైతం వివక్షత కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆదివాసి, గిరిజనులు, వికలాంగుల హక్కుల కోసం గళం విప్పిన 90 శాతం వైకల్యం కలిగిన ప్రొఫెసర్‌ సాయిబాబాను అరెస్టు చేసి జైల్లో పెట్టిన వైన్యం రాజ్యాంగ కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ వికలాంగులకు ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఆర్టికల్‌ 41 ప్రకారం వికలాంగులకు ఆర్థిక స్వావలంబన కల్పించి వారిని అభివృద్ధి చేయాలని, పని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొంది. ఇవేవీ అమలు కాకపోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం.
విద్యా, ఉద్యోగాల్లో వికలాంగులకు వాటా ఎక్కడీ
విద్య, ఉద్యోగాల్లో న్యాయమైన వాటా వికలాంగులకు దక్కకపోవడం ద్వారా అనేకమంది ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా మారుతున్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వికలాంగులకు ప్రత్యేక స్కూల్స్‌, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అమలు కావడం లేదు. ఆటిజం, అందత్వం, వినికిడి సమస్యతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని 2017 అక్టోబర్‌ 30న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వికలాంగులకు చదువు చెప్పేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఒకవైపు ఆదేశిస్తుంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోలేనటువంటి ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయమే తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందుతుంది. ప్రభుత్వ శాఖల్లో కేడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం ఖాళీగా వికలాంగుల పోస్టులను ప్రకటించాలి. కానీ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలో మరెక్కడా వికలాంగుల బ్యాక్లాగ్‌ పోస్టులను భర్తీ చేయలేదు. 33 జిల్లాల ప్రకారం వికలాంగుల బ్యాక్లాగ్‌ పోస్టులను గుర్తించి, భర్తీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా, వికలాంగులకు దక్కాల్సిన నాలుగు శాతం ఉద్యోగాలు ఎందుకు కేటాయించడం లేదు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల ఉద్యోగుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగంలో కేవలం 0.04% కంటే తక్కువ మంది వికలాంగుల ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్‌ టీచర్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు.
పాలకుల నిర్లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.48 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. తెలంగాణ డిజబుల్స్‌ స్టడీ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం 43.02 లక్షల మంది వికలాంగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని సర్వే పేర్కొంది. రాష్ట్ర జనాభాలో 12.2% వికలాంగులు ఉన్నారు. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. 2023 సెప్టెంబర్‌ నాటికి రాష్ట్రంలో 5.16 లక్షల మందికి ఆసరా పింఛన్లు వస్తున్నవి. రాష్ట్ర ప్రభుత్వం గడచిన తొమ్మిదేళ్ల కాలంలో వికలాంగులకు ఆసరా పెన్షన్‌ తప్ప మరే ఇతర సౌకర్యాలు కల్పించలేదు. వికలాంగులలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీయకుండా కేవలం ఆసరా పింఛన్ల లబ్ధిదారులుగానే గుర్తిస్తున్నారు. ఉపాధి కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది దరఖాస్తులు చేసుకుంటే, పదుల సంఖ్యలో మాత్రమే స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది టిసిపిసి సెంటర్స్‌ ని మూసివేశారు. మూసివేసిన వాటిని పునప్రారంభించవలసిన అవసరం ఉంది. నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుంది. సకలాంగుల సంక్షేమం కోసం అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో వికలాంగుల కోసం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రకటించలేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతుంది
ఇరవై ఒక్క రకాల వైకల్యాలకు గుర్తింపు ఎప్పుడు?
2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 21 రకాల వైకల్యాలను గుర్తించింది. కానీ వైకల్య ధవీకరణ పత్రాలు మాత్రం 1995 ూఔణ చట్టం గుర్తించిన 7 రకాల వైకల్యాలకు మాత్రమే సర్టిఫికెట్స్‌ ఇస్తున్నారు. కండరాల క్షీణత, తలసేమియా, ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సి వంటి తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులు సర్టిఫికెట్స్‌ రాక ఇబ్బందులు పడుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఏడు రకాల వైకల్యాలకు మాత్రమే వైకల్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారు
అమలుకు నోచుకోని చట్టాలు
వికలాంగుల పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అనేక చట్టాలను చేసింది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017 ఇంటర్‌ హెల్త్‌ కేర్‌, నేషనల్‌ ట్రస్ట్‌, ఆటిజం యాక్ట్‌ ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం వంటి అనేక చట్టాలు దేశంలో వికలాంగుల సంక్షేమం కోసం అమలులో ఉన్నాయి. కానీ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులకు చట్టాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు. పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం కల్పించాలనే పేరుతో క్రిమినలైజింగ్‌ మైనర్‌ అపెక్స్‌ అంటూ కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్‌ కోర్సుగా అమల్లోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, వికలాంగుల చట్టాలను కూడా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 2016 వికలాంగుల హక్కులు పరిరక్షించటం సెక్షన్‌ 89, 92, 93 రద్దు చేయాలని, 1999 నేషనల్‌ ట్రస్టు సవరించాలని, దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది నేషనల్‌ ఇన్స్టిట్యూషన్స్‌ను విలీనం చేయాలని చేసిన ప్రయత్నాలను దేశ వ్యాప్తంగా చేసిన పోరాటాల ద్వారా తిప్పి కొట్టింది.
సుగమ్య అభియాన్‌ భారత్‌ ప్రచారం కోసమేనా?
కేంద్ర ప్రభుత్వం సామూహిక ప్రాంతాలని వికలాంగులు వినియోగించుకునే విధంగా మార్చాలనే ఉద్దేశంతో సుగమే అభియాన్‌ భారత్‌ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. 2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో 50% పట్టణాలు అవరోధరహితంగా మార్చాలని నిర్దేశించిన లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఇప్పటికీ సామూహిక ప్రాంతాలు వికలాంగులకు అందనంత దూరంలో ఉన్నాయి. ప్రధానమంత్రి వికలాంగులకు దివ్యాంగులుగా నామకరణం చేశారు. పేరు మార్చినంత మాత్రాన వికలాంగులకు ఒరిగింది ఏమీ లేదని విషయం ప్రభుత్వాలు గుర్తించాలి.
ఐక్య పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవాలి
ప్రపంచ వికలాంగుల దినోత్సవం స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వికలాంగుల వ్యతిరేక విధానాలపై ఉద్యమించవలసిన అవసరం వికలాంగులపై ఉంది. దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్‌ విధానం, రైల్వేలో సౌకర్యాలు, అంత్యోదయ రేషన్‌ కార్డులు, నామినేటెడ్‌ పదవులలో రిజర్వేషన్స్‌, సామాజిక భద్రత, స్వయం ఉపాధి, మహిళా వికలాంగుల రక్షణ వంటి సమస్యలపై ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

కుటుంబానికి భారం కాకూడదనే…
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బద్దారం గ్రామానికి చెందిన మంగమ్మ నెల వయసు ఉన్నప్పుడు కాలుకు పోలియో సోకింది. తాను వికలాంగురాలు అయినప్పటికీ కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో చిన్నపాటి కిరాణా షాపును నడుపుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తుంది పుట్టుకతోనే వైకల్యం ఏర్పడుతున్న చిన్నపిల్లలకు నైబర్వుడ్‌ సెంటర్స్‌ ద్వారా ఫిజియోథెరపీ, బుద్ధి మాంధిత పిల్లలకు థెరపీ ఇస్తూ అంగవైకల్యం నిర్మూలనలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఐదువేల గౌరవ వేతనం ఏమాత్రం సరిపోకుండా తనలాంటి వారు అంగవైకల్యంతో ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో పని చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో వికలాంగులకు ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించే గుణం మంగమ్మకుంది. తనతో పాటు సెంటర్లో పనిచేస్తున్న వందలాదిమంది కార్యకర్తలను సమీకరించి సంఘం పెట్టి ప్రభుత్వంపై పోరాడుతుంది.
అమ్మానాన్న సపోర్టుతోనే
నా పేరు కె. గౌతమ్‌, మాది నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామం. నేను ఏడు నెలలకు పుట్టడం, బలహీనంగా ఉండటం, ప్రత్యేక సంరక్షణలో చికిత్స ఇవ్వకపోవడం వల్ల సెరిబ్రల్‌ ప్లసి వ్యాధికి గురయ్యాను. దాంతో కండరాలు శక్తిని కోల్పోయి వికలాంగుడిగా మారాను. ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మానాన్న చికిత్స చేయించారు. మాది ధనవంతుల కుటుంబం కాదు. మధ్యతరగతి రైతు కుటుంబం. చాలా శ్రద్ధతో చికిత్స చేయించారు. దాంతో నేను బతికి జీవితంలో కొంత సాధించగలిగాను. నాకు మూడు ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగాయి. ఒక ఆపరేషన్‌ ప్రభుత్వ సహాయంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగింది. నేను రెగ్యులర్‌గా వెళ్లి చదువుకోవడానికి వీలు కాలేదు. పదవ తరగతి వరకు ఎలాగోలా రెగ్యులర్‌ విధానంలో చదివాను. ఆ తర్వాత అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ డబల్‌ పీజీ పూర్తి చేశాను. ఇవి చదువుతున్న క్రమంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నా. ప్రయాణాలు చేస్తున్న సమయంలో చాలాసార్లు దెబ్బలు తగిలాయి. అయినా అన్నింటికి ఓర్చుకొని చదువు కొనసాగించా. కంప్యూటర్‌ కూడా బేసిక్స్‌ అలాగే కష్టపడి నేర్చుకున్న. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డిగ్రీ రెగ్యులర్‌గా పూర్తి చేశా. పాలమూరు యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ తీసుకున్న. ఎన్పిఆర్‌.డి వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సంఘంతో పరిచయం నా అనుభవాన్ని మరింత విస్తృతం చేసి, ధైర్యాన్ని పెంచింది. ప్రభుత్వం ఇచ్చిన అనాలోచిత జీవో వల్ల నాకు వికలాంగుల పెన్షన్‌ కూడా రాదు. పెన్షన్‌ కోసం పోరాడుతున్న. త్వరలో న్యాయ పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. డిగ్రీలో బాలయ్య సారు నరసింహారెడ్డి సార్‌ ఇచ్చిన ప్రోత్సాహం, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ లో కనకదుర్గ మేడం గారి ప్రోత్సాహం, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డిగ్రీలో వీరయ్య సారు వెంకటేశ్వర్లు సారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేనిది. జిల్లాలో అనేక సాహిత్య సంస్థల్లో సభ్యుడిగా ఉన్నాను. సోషల్‌ మీడియా వేదికల్లో విస్తృతంగా కవిత్వం రాస్తున్నాను. కవిత్వంలో ముత్యాల కష్ణయ్య సార్‌, వనపట్ల సుబ్బయ్య సార్‌, యాదగిరి చారి సార్‌ తదితరులు ఇస్తున్న ప్రోత్సాహం నన్ను మరింత ఉత్సాహపరిస్తున్నది. మా నాన్న కమ్యూనిస్టు పార్టీలో 15 సంవత్సరాలు పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన పుస్తకాలు చదువుతూ పెరిగాను. జీవితంలో ఎదురైన కష్టాలను తట్టుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ సాహిత్యం నాకు ఉపయోగపడింది. నా ఐదు సంవత్సరాల వయసు అప్పుడే మా నాన్న మార్క్సిజం గురించి చెప్పారు. చరబండ రాజు కొండలు పగిలేసినం పాట వింటూ పెరిగాను. 8 సంవత్సరాల వయసులో నవీన్‌ అంపశయ్య చదివాను. 11 సంవత్సరాల వయసులో ప్రశాంత ప్రత్యూషలు, అజేయ సైనికుడు, రెడ్‌ ఆర్మీ లాంగ్‌ మార్చ్‌ పుస్తకాలు చదివాను. కమ్యూనిస్టు పార్టీతో పరిచయం, ముఖ్యంగా సిపిఎం పార్టీలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, ఆ సాహిత్య అధ్యయనం నాలో ధైర్యాన్ని పెంచాయి. జీవితంలో ఇప్పటి వరకు మానవత్వంతో ఉన్నవారు, నిజాయితీకి విలువ ఇచ్చే వారే దొరికారు. ఎన్‌.పి.ఆర్‌.డి వికలాంగుల సమ్మెలో గోరింకల నరసింహా ద్వారా సంఘం లోకి వచ్చాను. అడివయ్య సార్‌ ప్రోత్సాహం నన్ను మరింత ముందుకు నడిపిస్తున్నది.
జీవనోపాధి కల్పిస్తూన్నాను
మా అమ్మ నాన్నల గ్రామం టేక్మాల్‌ మండల్‌ తంపులూరు. మేం నలుగురం అన్నదమ్ములము ఒక చెల్లెలు. తంపులూరు గ్రామంలో జీవనోపాధి సరిపోక దగ్గరలో ఉన్న కాదులూరు గ్రామానికి వలస రావడం జరిగింది. అక్కడ మేం మూడో తరగతి వరకు చదువుకుని అక్కడ కూడా పని సక్రమంగా లేకపోవడంతో మా అమ్మ వ్యవసాయ కూలీ పనికి వెళ్లేది. అయినా కూడా తినడానికి ఇబ్బందిగా ఉండేది. అక్కడ నుంచి రామ్సన్‌ పల్లి అనే గ్రామానికి వచ్చాం. అక్కడ సుమారుగా 10 సంవత్సరాలు ఉన్నాం. అప్పుడు నేను ఐదో తరగతి జోగిపేట ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. హాస్టల్లో వసతి సక్రమంగా లేని కారణంగా చదువుకు దూరం అయిపోయాను. ఆ తర్వాత చిన్న చిన్నగా టైలర్‌ పని నేర్చుకొని పని స్టార్ట్‌ చేశాను. అక్కడ కూడా పని సరిపోనందున జోగిపేట గ్రామానికి రావడం జరిగింది జోగిపేట గ్రామానికి వచ్చిన తర్వాత మా ఇద్దరి తమ్ముళ్ళకి వివాహం మా చెల్లెలు వివాహం చేశాం. జోగిపేటలో బట్టల షాప్‌ పైన కుట్టు మిషన్‌ పెట్టుకొని జీవనోపాధి సాగించాం. కొంతకాలం తర్వాత చిన్నగా టైలర్‌ షాప్‌ పెట్టుకున్నా. ప్రస్తుతానికి టైలర్‌ షాప్‌లో మా పెద్దబ్బాయి నేను పని చేసుకుంటూ, మాతో పాటు అనేక మందికి జీవనోపాధి కల్పిస్తూన్నాను. నేను స్వయం ఉపాధి చేసుకుంటూనే నాతోటి వికలాంగులు పడుతున్న సమస్యలపై వారందరినీ చైతన్యవంతం చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జరిగిన ఉద్యమాలకు నాయకత్వం వహించాను. ప్రస్తుతం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాను.
సమస్యల పరిష్కారం కోసం…
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగుర్‌ కే గ్రామానికి చెందిన ఆలురే నాగమ్మ, శంకరప్ప దంపతులకు నలుగురు సంతానం. వీరిలో మహానంద పుట్టిన 8 నెలల వయస్సులో ఉన్నప్పుడు కుడికాలుకి పోలియో వ్యాధి సోకింది. తలిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న మహనందను పోలియో వ్యాధి నుండి కాపాడేందుకు చేయని ప్రయత్నం లేదు. వారు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా ఏమాత్రం కుంగిపోకుండా అందరితో పాటు సమానంగా ఆడుతూ పడుతూ పెరిగింది. అంగవైకల్యం ఉన్నా, ఏమాత్రం భయపడకుండా డిగ్రీ వరకు చదివినారు. చదువుకునే సమయంలోనే వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహాయం చేస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలిచింది. కంగ్తి మండలంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృధి చెందడానికి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేపించి మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. 2010 నుండి చీూ=ణ సంఘంలో పని చేస్తూ వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న అనేక ఉద్యమాలలో భాగస్వామ్యం అవుతూ ముందుకు వెళ్తున్నారు.
నా తోటివారిని చైతన్యం చేస్తున్నా
సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ కిష్టయ్య దంపతులకు మూడవ సంతానం సిహెచ్‌ సాయమ్మ. పోలియో వ్యాధితో అంగవైకల్యం ఏర్పడింది. పదవ తరగతి వరకు గ్రామంలోని చదివి అదే గ్రామంలో అంగన్వాడి టీచర్‌ గా ఉద్యోగం సాధించింది. అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూ జిల్లాలోనే ఉత్తమ అంగన్వాడి టీచర్‌గా ఎంపికయ్యారు. నేను వికలాంగురాలు అయినప్పటికీ ఏనాడూ నాకు అంగవైకల్యం ఉందని బాధపడలేదు. అంగవైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదని నా తోటి వికలాంగులందరినీ ఐక్యం చేసి, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను. 2011 సంవత్సరం నుండి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘంలో సభ్యురాలుగా చేరి నేడు ఎన్‌.పి.ఆర్‌.డి కేంద్రకమిటి సభ్యురాలుగా కొనసాగుతున్నాను. సంఘంలోకి రాకముందు నాకు ఏమి తెలిసేవి కాదు సంఘంలో చేరిన తర్వాత సమాజంలో వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి, వారు పడుతున్న బాధల గురించి తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నిరంతరం కషి చేస్తున్నాను. వికలాంగులతో పాటు మహిళా వికలాంగుల సమస్యలు వర్ణనాతితంగా ఉంటాయి. మహిళా వికలాంగుల సమస్యలు, వారు పడుతున్న అవమానాలు, వివక్షత, లైంగిక వేధింపులు, అత్యాచారాలు వంటి వాటికి వ్యతిరేకంగా మహిళా వికలాంగులు సమీకరించి పోరాటం చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మహిళా వికలాంగుల సంఘాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నాను. అందోల్‌ ప్రాజెక్టు పరిధిలో 390 అంగన్వాడి సెంటర్స్‌ ఉన్నాయి. ఇందులో పనిచేసే టీచర్లు, ఆయాలంతా సకలాంగులే అయినా కానీ నేను వికలాంగురాలిగా అంగన్వాడి టీచర్‌ గా పని చేసూ, ప్రాజెక్టులోనే ఉత్తమ అంగన్వాడి సెంటర్‌గా నా సెంటర్‌ ని తీర్చిదిద్దుతున్నాను. ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో వికలాంగులు ఎదుర్కొన్న అనేక సమస్యల పైన జరిగిన ఉద్యమాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించాను. మా గ్రామంలో ఉన్న వికలాంగుల అందరికీ ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం కృషి చేస్తూ, వికలాంగుల చట్టాలు సంక్షేమ పథకాల పైన నా తోటి వికలాంగులను చైతన్యం చేస్తున్నాను. ఈరోజు ఇంత ధైర్యంగా వికలాంగుల సమస్యలపై పని చేస్తున్నానంటే దానికి కారణం ఎన్పీఅర్డి సంఘమే. సంఘంలోకి రాకంటే ముందు మాట్లాడాలంటే నేను భయపడేదాన్ని. కానీ నేడు సమస్యలపై మాట్లాడుతూ, నా తోటి వికలాంగులను పోరాటంలోకి తీసుకొస్తున్నాను
యం. అడివయ్య, 9490098713
NPRD రాష్ట్ర కార్యదర్శి 

Spread the love