నేలమ్మ

Nelammaనేల లేనిదే మనం లేం. కానీ వాతావరణ మార్పులు, భూతాపం, కాలుష్యం.. మన భూమినీ, నేలనూ నానాటికీ క్షీణింప చేస్తున్నాయి. గాలి, నీరు కాలుష్యమయమై మట్టిలోని సారం, వివిధ రకాల లవణాలు నాశనమవుతున్నాయి. ఫలితంగా మొక్కలు, జీవరాశుల మనుగడకు ప్రమాదంగా మారుతోంది. కాలుష్య కోరల నుండి మన నేలమ్మను ఎలా కాపాడుకోవాలి? ప్రమాద రహిత మనుగడను ఎలా పెంపొందించుకోవాలి? వంటి ప్రశ్న నుంచి వచ్చిన ఆలోచనే నేల దినోత్సవం. ఇప్పుడు నేలను ఎలా కాపాడుకోవాలి అన్నదే మనముందున్న సవాల్‌. ప్రపంచమంతా ఇదే పరిస్థితి.
‘నేలమ్మ నేలమ్మ నేలమ్మా… నీకు వేల వేల వందనాలమ్మ… నేలమ్మ నేలమ్మ నేలమ్మా… సాలేటి వానకె తుళ్ళింత సాలు సాలుకు నువ్వు బాలింత’ అనే గీతం నేటికీ ప్రజల ఆదరణ పొందుతూనే ఉంది. ఎందుకంటే మనిషికీ, నేలకూ విడదీయరాని బంధం వుంది. ఒక్క మనిషికేంటీ ప్రతి జీవికీ నేలతో అనుబంధం అపురూపమైనది. కోట్ల జీవరాసులు నేలలోనే పుడతాయి. నేలలోనే జీవిస్తాయి. ఆ నేలలోనే కలిసిపోతాయి. అందుకే నేల అంత విలువైనది. అంతెందుకు మనిషి జీవించి వున్నపుడు ఎంతటి సిరిసంపదల్లో తులతూగినా, ఎంతటి విలాసవంతమైన జీవితాన్ని గడిపినా గుప్పెడు ప్రాణం పోయిన తర్వాత పోవల్సింది ఆ నేలలోకే కదా..!
ఇక రైతు జీవితమైతే నేలతోనే పెనవేసుకొని ఉంటుంది. నేలను నమ్ముకుంటేనే రైతుల జీవితం. రైతుకే కాదు మనుషులందరి కడుపు నింపి ఆకలి తీర్చేది ఆ నేలనే. అందుకే నేలను అమ్మతో పోల్చి ‘నేలమ్మా..’ అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటాం. అటువంటి నేల కలుషితమైతే మానవ మనుగడ అసాధ్యం. కాబట్టి నేలను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అందుకే నేలకూ ఓ దినోత్సవం కేటాయించారు. ధరిత్రి దినోత్సవం జులై 22న, చిత్తడి నేల దినోత్సవం ఫిబ్రవరి 2న ఉన్నట్టే నేల దినోత్సవం డిసెంబర్‌ 5న ప్రపంచమంతా జరుపుకుంటోంది. నేల అంటే భూమి పైపొర. ఇక్కడ నీళ్ళు, మొక్కలు, జీవరాశులు అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ మూడింటి మీద ఆధారపడి మానవ సమాజం అభివృద్ధి చెందుతోందని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టే మనం నివసించే నేల ఆరోగ్యంగా ఉంటే మనమూ ఆరోగ్యంగా ఉంటాం.
ఎవరైనా సాధ్యం కాని పనిని చేయబోతుంటే ‘నేల విడిచి సాము చేయడం’ అనే లోకోక్తిని వాడుతుంటాం. అంటే ప్రతీ పనికీ నేలయే మూలాధారం. నేల లేనిదే మనం లేం. కానీ వాతావరణ మార్పులు, భూతాపం, కాలుష్యం.. మన భూమినీ, నేలనూ నానాటికీ క్షీణింప చేస్తున్నాయి. గాలి, నీరు కాలుష్యమయమై మట్టిలోని సారం, వివిధ రకాల లవణాలు నాశనమవుతున్నాయి. ఫలితంగా మొక్కలు, జీవరాశుల మనుగడకు ప్రమాదంగా మారుతోంది. కాలుష్య కోరల నుండి మన నేలమ్మను ఎలా కాపాడుకోవాలి? ప్రమాద రహిత మనుగడను ఎలా పెంపొందించుకోవాలి? వంటి ప్రశ్న నుంచి వచ్చిన ఆలోచనే నేల దినోత్సవం. ఇప్పుడు నేలను ఎలా కాపాడుకోవాలి అన్నదే మనముందున్న సవాల్‌. ప్రపంచమంతా ఇదే పరిస్థితి.
మనుషులుగా మనం నేల నుంచి అన్నీ పొందుతున్నాం. కానీ ఆ నేలను నాశనం చేస్తున్నాం. వ్యవసాయానికి భూసారం పేరుతో కృత్రిమ ఎరువులు వాడుతున్నాం. పంటను కాపాడే పేరుతో కీటక నాశనానికి వేసే మందులతో నేల కాలుష్యానికి కారణమవుతున్నాం. పరిశ్రమలు, వాటి నుండి వచ్చే రసాయనాలు, ప్లాస్టిక్‌ వాడకం ఇలా ఎన్నో మన నేలను పనికిరాకుండా చేస్తున్నాయి. ఇదంతా తెలిసినా కొంతమంది తమ స్వార్ధం కోసం నేలను వాడుకుంటున్నారు. ఇలాంటి అతితక్కువ మంది రోజురోజుకు ధనాన్ని మూటగట్టుకు పోతుంటే మెజారిటీ ప్రజలు కల్తీ ఆహారాన్ని తింటూ అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యల్ని ప్రస్తావించేందుకే ప్రపంచ నేల దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతీ ఏడాది ఈరోజున వ్యవసాయ, మట్టి, పర్యావరణ శాస్త్రవేత్తలతో రైతులకు, విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే నేల గురించి ఈ ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతి రోజూ చర్చించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన నేలమ్మను మనం కాపాడుకోగలం.

Spread the love