బాలిక‌లు దేశ భ‌విష్య‌త్తు

Girls are the future of the countryబాలికలు భారతదేశ భవిష్యత్తు
– కొండవీటి సత్యవతి
”పాపం పుణ్యం ప్రపంచ మార్గం
కష్టం సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా
ఐదారేడుల పాపల్లారా
మెరుపు మెరిస్తే వాన కురిస్తే
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే కూనల్లారా”
                                – శ్రీశ్రీ

ఈ కవిత చదివినప్పుడు బాల్యంలోని అమాయకత్వం గురించి ఎంతో ఆర్ధ్రంగా అనిపిస్తుంది. శ్రీశ్రీ పిల్లల పట్ల తనకున్న ప్రేమనంతా ఈ కవితలో రంగరించి రాశాడు. అయితే ఇప్పటి సామాజిక నేపధ్యానికి అన్వయించి చూస్తే బాల్యం కోల్పోతున్న లక్షలాది మంది పిల్లలు కళ్లముందు కదలాడతారు. ఆకుపచ్చని ఆకులమీద వాన చినుకులు చిందేసినంత స్వచ్ఛంగా, చైతన్యంతో తుళ్లిపడే పిల్లల మీద ముఖ్యంగా ఆడపిల్లల మీద అమలయ్యే వివక్ష ఎన్నో రూపాల్లో కనబడుతుంటుంది. గర్భంలోని ఆడపిండం మీద కత్తులు దూసి హతమార్చే అమానుష సమాజం, పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎన్నో ఆంక్షల్లో బిగించి ఊపిరాడకుండా చేస్తుంది. నవ్వితే తప్పు, వడివడిగా నడిచేస్తే తప్పు, తలెత్తితే తప్పు, తల దించకపోతే మరింత తప్పు. కుటుంబం, కమ్యూనిటీ, సమాజం ఒక్కటై ఆడపిల్లల మీద నిరంతర నిఘా నేత్రాన్ని ప్రసరిస్తూ వాళ్ల ఎదుగుదలని క్రమబద్దంగా కుదించేస్తుంది. వాళ్ల ఆత్మగౌరవం మీద, ఆత్మ విశ్వాసం మీద చావు దెబ్బ కొడుతుంది. ఫలితంగా తాము అన్నింటా తక్కువే, తమకు అసలు విలువ లేదు. తమ మీద అమలయ్యే హింస సహజమే అనుకోవడంతో పాటు, హింసని మౌనంగా సహించాలి తప్ప ఎదురుతిరగకూడదు. ఎవ్వరికీ చెప్పకూడదు అని నూరిపోయడం వల్ల ఈ రోజు చిన్నారి బాలికలు, యవ్వనారంభంలో వున్న అమ్మాయిలు ఇంటా బయటా భయంకరమైన హింసకి గురౌతున్నారు.
పితృస్వామ్య భావజాలపు వికృత పార్శ్వం ఏమిటంటే తల్లి గర్భంలో మొదలయ్యే వివక్ష పుట్టుకలో, పెరుగుదలలో, కుటుంబంలో పాఠశాలలో వెరసి సమాజంలోని అన్ని రంగాలలోనూ విషవృక్షంలాగా విస్తరించి ఆడపిల్లలకి ఊపిరాడకుండా చేయడం, ఎదగనీయకుండా సంకెళ్లు బిగించడం. వీని పర్యావసానం ఆడపిల్లల మీద విపరీతంగా పెరిగిపోతున్న లైంగిక హింస. ఈ హింస కారణంగా వారి కదలికల మీద, వారి వస్త్రధారణ మీద ఎక్కువౌతున్న కట్టడులు, ఆంక్షలు.. వీటి కారణంగా చదువుకు దూరమవ్వడం, బాల్య వివాహాలకు బలవ్వడం జరుగుతున్నది. కోవిడ్‌ విపత్తు తర్వాత దేశంలో పెరిగిపోయిన బాల్య వివాహాల గణాంకాలు చూస్తే చిధ్రమైపోతున్న ఆడపిల్లల కలలు, జీవితాలు స్పష్టంగా కనబడతాయి. వారికున్న సర్వహక్కులకు భంగం కలగడం, వారు బాల్య వివాహాల కారణంగా ఎదుర్కొంటున్న గృహహింస తీవ్రత ఏ పోలీస్‌ స్టేషన్‌కో, సఖీ సెంటర్లకో, భరోసాలకో వెళ్లి చూస్తే అర్ధమవుతుంది. చదువుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ స్వతంత్రంగా బతకాల్సిన ఆడపిల్లలు అన్ని రకాల హింసలని ఎదుర్కొంటూ, బాల్య వివాహం కారణంగా గృహహింసకి కూడా గురౌతున్న విషాదకర పరిస్థితులు సర్వత్రా విస్తరించిన సందర్భమిది.
పైన ప్రస్తావించిన నేపధ్యానికి కారకులెవరు? పితృస్వామ్య భావజాలమా? అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనలోరాజకీయ నాయకుల పట్టనితనమా? నిజానికి అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ ఉల్లంఘనలు, పిల్లల హక్కుల ఉల్లంఘనలు యద్ధేచ్చగా, ఎలాంటి జంకూ, గొంకూ లేకుండా జరిగిపోతున్నాయనేది వాస్తవం. కంటి తుడుపుగా కొన్ని చట్టాలు తీసుకొచ్చినా, వాటి అమలులో చిత్తశుద్ది లేదు. ఎన్నో సహాయ సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి గురించి అవగాహన కల్గించిన దాఖలాలు లేవు. పి.సి.పి.ఎన్‌.డి.టి. చట్టం అమలులో వున్నా లక్షలాది ఆడపిండాల హత్యలు అనుక్షణం జరుగుతూనే వున్నాయి. ఇన్ని హత్యలు జరుగుతున్నా ఒక్క డాక్టరుకూ శిక్ష పడదు. బాల్య వివాహాలు నిర్భయంగా జరిగిపోతున్నాయి. బాల్య వివాహాల నిరోధక చట్టం అమలు కాదు. బాలికల మెళ్లో తాళి పేరుతో ఉరితాళ్లు పడుతూనే వున్నాయి.
ఢిల్లీలో జరిగిన నిర్భయ విషాద సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిల్లల రక్షణ కోసం తీసుకొచ్చిన పిల్లలపై లైంగిక అత్యాచారాల నిరోధక చట్టం 2012 (పి.ఒ.సి.ఎస్‌.ఒ) లో ఉన్న కఠినమైన సెక్షన్లు పిల్లలపై లైంగిక అత్యాచారాలను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి. నిజానికి పాక్సో చట్టం గురించి ఎలాంటి ప్రచారమూ లేదు. అవగాహన కల్గించే కార్యక్రమాలు లేవు. ఈ చట్టం ప్రకారం మారిన రేప్‌ నిర్వచనం, పెరిగిన శిక్షాకాలం ఆఖరికి మరో శిక్ష కూడా నేరస్తుల్లో ఎలాంటి భయాన్ని కల్గించకపోగా లైంగిక హింసకి పాల్పడి, బాధితుల్ని హతమారుస్తున్న దారుణ ఉదంతాలు పెరిగిపోయాయి. బాధితుల్ని చంపేస్తే శిక్షల్నించి తప్పించుకోవచ్చనే భయానక ధోరణి కూడా పెరిగినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని కేసుల్ని చూస్తే అర్ధమవుతోంది. కఠినమైన చట్టాలు నేరస్తుల్ని విక్షించకుండా బాధితుల ప్రాణాలు తీస్తున్నదా అనే ఊహ కూడా భయం కల్గిస్తున్నది.
ఇలాంటి పరిస్థితుల్లో మనం జాతీయ బాలికా దినోత్సవం, అంతర్జాతీయ బాలికా దినోత్సవాలను జరుపుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ ముందు ముందు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే ఆలోచనలు చేస్తున్నాం. పితృస్వామ్య, సనాతన భావాలను యదాతధంగా వుంచి, వాటి మీద పని చెయ్యకుండా ఎన్ని కాన్ఫరెన్స్‌లు జరిపినా ఎన్ని చట్టాలు తెచ్చినా ఫలితం వుండదనేది ఎన్నో దారుణ ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. సంప్రదాయాలు, కట్టుబాట్ల ముందు చట్టాలు వెలవెల పోతున్నాయి. ‘పున్నామ నరకం’ అనే అభూత కల్పన మగపిల్లనే కనాలి, ఆడపిల్లల అవసరం లేదు అనే తల్లిదండ్రుల మౌఢ్యపు ఆలోచనల వల్లనే కోట్లాది మంది ఆడపిల్లలు పిండ దశలోనే చనిపోతున్నారు. దీనివల్ల సెక్స్‌ రేషియో రోజు రోజుకి దిగజారిపోయి ఆడపిల్లల భద్రత మరింత ప్రమాదకరంగా తయారవుతున్నది. ‘బేటి బచావో, బేటీ పడావో’ లాంటి శుష్క నినాదాల వల్ల ఎలాంటి మార్పు సమాజంలో కనబడడం లేదు.
మన విద్యావ్యవస్థ కూడా సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మాతురున్న దాఖలాలు లేవు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ లో యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన టెక్ట్స్‌బుక్‌ రివ్యూ కమిటీలో నేను కూడా సభ్యురాలిగా వున్నాను. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ అన్ని సబ్జెక్ట్‌ పుస్తకాలను సమీక్షించినప్పుడు కాలానుగుణంగా ఎలాంటి మార్పులకు నోచుకోని టెక్ట్స్‌ పుస్తకాలు చదివి నిర్ఘాంతపోవడం నా వంతైంది. తెలుగు వాచకాల నిండా రామాయణ, భారత, భాగవత పద్యాలు, అర్ధం పర్ధంలేని పాఠాలు దర్శనమిచ్చాయి. అలాగే సోషల్‌, ఇంగ్లీష్‌, సివిక్స్‌… వీటిల్లో కూడా ప్రస్తుత సమాజాన్ని అర్ధం చేయించే పాఠాలు కానీ, వారు నేర్చుకోవాల్సిన జీవన నైపుణ్యాలు గానీ, కొత్తగా వచ్చిన చట్టాల గురించిన అవగాహన మచ్చుకైనా కనబడలేదు. పాచిపోయిన పాఠాల నుండి పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఆధునిక సమాజ సంక్షోభాల గురించి, వాటిని ఎదుర్కోగలిగిన నైపుణ్యాలను, కఠినమైన చట్టాల గురించి, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి ఈ పిల్లలకి ఎవరు చెప్పాలి? అమ్మ వంట చేయును, నాన్న సంపాదించును దగ్గరే పాఠాలు ఆగిపోతే పిల్లలకి ఏమర్ధమవుతుంది? ఓహో! ఇంటి ప్రపంచం ఆడవాళ్లది, బయటి ప్రపంచం మగవాళ్లది అనే ఆలోచన మగ పిల్లల బుర్రలో స్ధిరపడిపోతుంది. ఆడపిల్లలు అన్నింటా అణిగిమణిగి ఇంట్లో వంట చేసుకోవాలి. బయటికొస్తే మేం వేధించొచ్చు. లైంగిక హింసకి పాల్పడొచ్చు అనే సిగల్‌ చదువు ద్వారానే వాళ్లకి అందుతుంటే మార్పు ఎలా సాధ్యమవుతుంది? పాక్సో లాంటి కఠినమైన చట్టాల వల్ల కూడా ఆడపిల్లలకి భద్రత లేకుండా పోవడానికి ముఖ్య కారణం బూజుపట్టిన మన విద్యావిధానం కూడా. ఇప్పుడిప్పుడే కొన్ని మార్పులు, చేర్పులు పాఠ్య పుస్తకాల్లో చేరుతుండడం ఆహ్వానించదగిన పరిణామం.
ఈ రోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించి, ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాల గురించి కూడా ప్రస్తావించుకోవాలి. 1995లో బీజింగ్‌లో జరిగిన ప్రపంచ మహిళల సదస్సులో ‘బీజింగ్‌ డిక్షరేషన్‌ మరియు ప్లాట్‌ఫారం ఫర్‌ యాక్షన్‌’ డాక్యుమెంటును అన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇది మహిళలకు మాత్రమే కాకుండా బాలికల హక్కులను కూడా ముందుకు తీసుకెళ్లే అత్యంత ప్రగతిశీలమైన డాక్యుమెంటరీ. బీజింగ్‌ డిక్షరేషన్‌ నుండి ప్రత్యేకంగా బాలికల హక్కుల కోసం వెలువడిన మొట్టమొదటి డాక్యుమెంటు. అన్ని దేశాలు బాలికల హక్కుల అమలులో తమ తమ కార్యాచరణలు రూపొందించుకునేలా దిశా నిర్దేశం చేసిన చాలా ముఖ్యమైన డాక్యుమెంటుగా అర్ధం చేసుకోవచ్చు.
అంతే కాకుండా 2011, డిసెంబర్‌ 19న యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ అక్టోబర్‌ 11 తేదీని ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’ గా ప్రకటించడానికి తీర్మానం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను అంతర్జాతీయ వేదిక మీద గుర్తించిన తీర్మానమిది. ఈ తీర్మానం ముఖ్య వుద్దేశ్యం బాలికల మానవ హక్కులను గుర్తించి ముందుకు తీసుకుపోవడం. అలాగే భద్రమైన జీవితం పొందడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, మంచి ఆరోగ్యం పొందడానికి వారికి సర్వహక్కులూ వున్నాయని జీబింగ్‌ డిక్షరేషన్‌ నిర్ధారించింది. 2030 నాటికి పూర్తి చేయాలని ఎజండాగా రూపొందిన ‘సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌’ రోడ్‌ మ్యాప్‌లో కూడా ప్రపంచ నాయకులందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన అంశాల్లో బాలికల మానవ హక్కులు అంశం కూడా ఇమిడి వుంది.
2030 నాటికి అన్ని సమాజాలు జండర్‌ సమానత్వాన్ని సాధించాలని మహిళల, బాలికల మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి జరగాలని అన్ని దేశాలూ ఆకాంక్షిస్తున్నప్పటికీ ఎంత వరకు ఆచరణ సాధ్యమో ఆలోచించాలి. భారత దేశానికి సంబంధించి మహిళా సాధికారత, జండర్‌ ఈక్వాలిటీ సాధించడానికి ఆచరణాత్మకమైన కృషి జరగాలి కానీ శుష్కవాగ్దానాల వల్ల ప్రయోజనం ఉండదు. ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదం చాలా ప్రభావయుతమైందే కానీ ఆచరణలో ఆ ప్రభావం కనబడడం లేదు. బాలికలు ఈ దేశ భవిష్యత్తు. లింగ సమానత్వం అంటే మగపిల్లల్నే కని, ఆడపిల్లల్ని చంపేయడం కాదు అనే అంశం ప్రధాన స్రవంతిలోకి బలంగా వెళ్లినప్పుడే మార్పు సాధ్యమౌతుంది. పిల్లలు ఈ దేశ భవిష్యత్తు. పిల్లలంటే మగ పిల్లలు మాత్రమే అని నమ్మే పితృస్వామ్య సమాజానికి పిల్లలంటే బాలికలు కూడా. బాలికలు తగ్గిపోయే సమాజం అంధకారంలోకి నడుస్తుంది తప్ప ప్రగతి వైపు కాదు.. ఈ దేశ బాలికలు కూడా ఈ దేశ భవిష్యత్తు.
– కొండవీటి సత్యవతి 9618771565

Spread the love