ఇజ్రాయిల్‌ యుద్ధకాండ ఇక ఆపండి

Stop the war on Israel”విజయం పొందాలనే ఉత్సాహంతో ఉండండి, వారిని తుదముట్టించండి, ఒక్కరిని కూడా వదలవద్దు. వారి జ్ఞాపకాలను నామ రూపాల్లేకుండా చేయండి, వారి కుటుంబాలు, తల్లులు, పిల్లలు ఎవర్నీ వదల వద్దు, ఈ జంతువులు ఏ మాత్రం ప్రాణాలతో ఉండకూడదు. ప్రతి ఒక్క యూదు ఆయుధంతో బయటకు వెళ్లాలి, వారిని చంపాలి. మీ పొరుగున ఎవరైనా అరబ్బులుంటే ఏ మాత్రం ఆలశ్యం చేయవద్దు, వారి ఇంటికి వెళ్లండి, కాల్చిపారేయండి” ఈ మాటలు మాట్లాడింది 95 ఏండ్ల ఎజ్రా యాచిన్‌ అనేవాడు. ఇజ్రాయెల్‌ సైనికులను ఎంతగానో ఉత్సాహపరచినట్లు అమెరికా, ఐరోపాలోని మీడియా వీడి గురించి ఆకాశానికి ఎత్తింది. 1948 ఏప్రిల్‌ తొమ్మిదిన జెరూసలెం సమీపంలోని ఆరువందల మంది అరబ్బులున్న ఒక గ్రామంపై దాడి చేసి పిల్లలు, మహిళలతో సహా 107 మందిని కాల్చి చంపిన యూదు ఉగ్రవాద ముఠాలోని ఒకడు.
నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా ప్రాంతంలోని అరబ్బుల మీద దాడులు చేస్తూ వారిని హతమారుస్తూ, వారి ప్రాంతాలను ఆక్రమించుకుంటున్న ఇజ్రాయెల్‌ దుర్మార్గాలు కొనసాగుతూనే ఉన్నాయి. దానిలో భాగమే అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో సాగిస్తున్న మారణకాండ. ఇలాంటి దాడులను కొనసాగించండి అంటూ ‘అపర మానవతావాదులు, మానవహక్కుల పరిరక్షకులు’ అమెరికా అధినేత జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రెంచి ప్రధాని ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ ఇప్పటికే టెల్‌ అవీవ్‌ను సందర్శించి ఇజ్రాయెల్‌కు మద్దతు పలికి వెళ్లారు. బైడెన్‌, రిషి కంటే ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచమంతా కలసి హమస్‌ను అణచివేయాలని మక్రాన్‌ చెప్పాడు.
బ్రిటన్‌ ఆక్రమణలో 1920 నుంచి 1948 వరకు ఉన్నపుడు యూదులు జరిపిన దాడుల్లో ఇరవైవేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించగా అరబ్బుల ప్రతిఘటనలో వెయ్యిమంది లోపు యూదు దుండగులు చనిపోయారు. నాటి నుంచి 2021వరకు అరవై మూడువేల మంది వరకు పాలస్తీనియన్లు మరణించారు. తాజా దాడుల్లో గురువారం ఉదయానికి మరో ఆరున్నరవేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరవైవేల మంది గాయపడ్డారు. బుధవారం నాడు పాలస్తీనాకు చెందిన గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ భూతల దాడులకు దిగింది. ఎందుకీ మారణకాండీ ఏం చేయదలచుకున్నారు? పూర్వ చరిత్రలోకి వెళ్లకపోతే మీడియాలో వస్తున్న వక్రీకరణలను నిజమే అనుకొనే అవకాశం ఉంది.

పాలస్తీనా – ఇజ్రాయెల్‌ ఉనికి!
ఈ రోజు మనం పాలస్తీనా అని చెబుతున్న ప్రాంతం లేదా చరిత్రలో ఉందని భాష్యం చెబుతున్న ఇజ్రాయెల్‌ గానీ ఎన్నడూ ఒక స్వతంత్ర దేశంగా లేవు. ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలుగా, సామంత దేశాలుగా చేతులు మారుతూవచ్చాయి. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో అస్సీరియన్లు దాడి చేసి యూదు మతానికి చెందిన వారు పాలకులుగా ఉన్న జుడా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూదులను తరిమివేశారు. తరువాత క్రీస్తుశకం మధ్యయుగాల్లో మత యుద్ధాల్లో యూదులు అనేక ప్రాంతాలకు పారిపోయారు. ఏసుక్రీస్తును సిలువ వేసింది యూదులు గనుక వారిని బతకనివ్వకూడదని క్రైస్తవులు పాలకులుగా ఉన్న ఐరోపా దేశాల్లో కూడా వారి మీద ఎక్కడో ఒకచోట దాడులు జరిగాయి. దాన్ని అవకాశంగా తీసుకొని హిట్లర్‌ రెండవ ప్రపంచయుద్ధానికి ముందు, యుద్ధకాలంలో అనేక చోట్ల లక్షలాది మంది యూదులను అంతంచేసిన చరిత్ర తెలిసిందే. బ్రిటన్‌లో కూడా యూదుల మీద దాడులు జరిగాయి, కానీ అదే బ్రిటన్‌ తరువాత కాలంలో అదే యూదులను పావులుగా చేసుకొని తమ ప్రయోజనాల కోసం వారి రాజ్యం ఇజ్రాయెల్‌ పునరుద్దరణ పేరుతో వారిని చేరదీసింది. చరిత్రలో రోమన్‌, లేదా ఒట్టోమన్‌ మాదిరి యూదుల సామ్రాజ్యం అనేది లేదు. పాలస్తీనా-ఇజ్రాయెల్‌ ప్రాంతం చివరిగా టర్కీ కేంద్రంగా పాలన సాగించిన ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ప్రపంచమంతటినీ ఆక్రమించిన బ్రిటీష్‌, ఫ్రెంచి ఇతర సామ్రాజ్యవాదులకు అది స్వాధీనం కాలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాన్ని విచ్చిన్నం చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు అనేక పాచికలను వాడారు. వాటిలో ఒకటి ఒట్టోమన్‌ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం కోరుతున్న అరబ్బులకు పాలస్తీనాను ఏర్పాటు చేస్తామని ఒక వైపు ఆశచూపారు. మరోవైపు యూదులకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని వారి మద్దతును కూడగట్టేందుకు పూనుకున్నారు. బ్రిటీష్‌, తరువాత వారి స్థానాన్ని ఆక్రమించిన అమెరికన్‌ సామ్రాజ్యవాదులు పెట్టిన చిచ్చే పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదం.
మొదటి ప్రపంచ యుద్దంలో ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనమైన తరువాత సామ్రాజ్యవాదుల పంపకాల్లో పాలస్తీనా ప్రాంతాన్ని బ్రిటీష్‌వారు తీసుకున్నారు. అప్పటికే పశ్చిమాసియాలో చమురు నిల్వలు, ఇతర ప్రాంతాల్లో సహజ సంపదలను గమనించి ఆ ప్రాంతంలో తమకు నమ్మకమైన బంటు ఉండాలంటే ఇజ్రాయెల్‌ ఏర్పాటు ఒక సాధనంగా భావించిన బ్రిటీష్‌ పాలకులు అనేక దేశాల్లో ఉన్న యూదులను పాలస్తీనాకు అక్రమంగా రప్పించారు. ఆయుధాలు, డబ్బు ఇచ్చారు. అక్కడ వారు నివాసాలను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. స్థానికంగా ఉన్న అరబ్బులను వారి ప్రాంతాల నుంచి గెంటివేయటం అప్పుడే ప్రారంభమైంది. బ్రిటీష్‌ వారి కుట్రను గమనించేలోగా రెండవ ప్రపంచ యుద్దం, తరువాత యూదుల వలసలు మరింత పెరిగాయి. తరువాత పాలస్తీనా ప్రాంతాన్ని మూడుగా విభజించి పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాలుగా ఏర్పాటు, జెరూసలెం పట్టణం, పరిసరాలను ఐరాస ఆధీనంలో ఉంచాలంటూ చేసిన ప్రతిపాదనకు ఐరాస సాధారణ అసెంబ్లీలో 1947 నవంబరు 29న మెజారిటీ ఆమోదం వచ్చేట్లు సామ్రాజ్యవాదులు చూశారు. దానిని ఆ ప్రాంత దేశాలు, అరబ్బులు అంగీకరించలేదు. ఐరాస తీర్మానం సాకుతో అప్పటికే సిద్దంగా ఉన్న యూదు సాయుధులు తీర్మానాన్ని పక్కన పెట్టి పాలస్తీనా ప్రాంతాలను కూడా ఆక్రమించి అరబ్బులను తరిమివేశారు. దాంతో అరబ్బులు ప్రతిఘటన ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా ఏర్పడలేదు. ఇజ్రాయెల్‌ ముందు వేసుకున్న పధకం ప్రకారం పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణకు పూనుకోవటంతో పక్కనే ఉన్న ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌, ఇరాక్‌ పాలస్తీనా ప్రాంతాలను దురాక్రమణ నుంచి కాపాడి కొన్నింటిని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఐరాస తీర్మానాన్ని గుర్తించేందుకు ఇజ్రాయెల్‌ నిరాకరిస్తోంది. తన భద్రతకు కొన్ని పాలస్తీనా ప్రాంతాలు కావాలని చెబుతోంది. దానికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఇవే దేశాలు ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకొని తమ భద్రతకు ముప్పు తేవద్దన్న రష్యా కోరికను పెడచెవిన పెట్టాయి.
హమస్‌ ఎప్పుడు ఏర్పడింది?
హమస్‌ సంస్థ గురించి అనేక తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. దాన్ని ఉగ్రవాద సంస్థ అనటానికి వీల్లేదని తాజాగా టర్కీ ప్రకటించింది. ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా విముక్తి కోసం అనేక సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. వాటన్నింటినీ కలిపి 1964లో ఈజిప్టు రాజధాని కైరోలో పాలస్తీనా విముక్తి సంస్థ (పిఎల్‌ఓ)ను ఏర్పాటు చేశారు. అది శాంతియుత, సాయుధ పద్ధతుల్లో పోరాడుతోంది. 1980 దశకం నాటికి అరబ్బుల్లో అసహనం పెరిగింది. దురాక్రమణలను పిఎల్‌ఓ సమర్దవంతంగా ఎదుర్కోవటం లేదనే అసంతృప్తి ఉంది. ఈ పూర్వరంగంలో హమస్‌ అనే కొత్త సంస్థ 1987లో ఉనికిలోకి వచ్చింది. దాన్ని ఏర్పాటు చేయటంలో మత పెద్దలు కూడా ఉన్నారు. 1973లో ముస్లిం బ్రదర్‌హుడ్‌ అనే సంస్థ ఈజిప్టులో ఏర్పడింది. దానిలో పాలస్తీనా ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఆ సంస్థలో చీలిక వచ్చి హమస్‌ ఏర్పడింది. 1988 ఆగస్టున హమస్‌ ప్రణాళిక పేరుతో తొలిసారిగా ఆ పేరును వెలుగులోకి తెచ్చారు. అప్పటి నుంచి అది ఇజ్రాయెల్‌ పోలీసులు, భద్రతా దళాల దుశ్చర్యలకు ప్రతిగా తానూ దాడులు జరుపుతోంది. తమ మీద పోరాడే ప్రతివారినీ ఉగ్రవాద ముద్రవేసి ఇజ్రాయెల్‌ అణచివేస్తున్నది. అంతకు ముందు పిఎల్‌ఓ, తరువాత హమస్‌ ఇతర సంస్థలనూ అదే మాదిరి పరిగణించింది. 1994 ఫిబ్రవరిలో రంజాన్‌ ప్రార్ధనలు చేస్తున్న 29 మంది ముస్లింలను గోల్డ్‌ స్టెయిన్‌ అనే యూదు దురహంకారి మిలిటరీ దుస్తులతో వెళ్లి పశ్చిమ గట్టు ప్రాంతంలోని హెబ్రాన్‌ నగరంలోని ఒక మసీదులో కాల్చి చంపాడు. తరువాత జరిగిన ఉదంతాలలో మరో 19 మంది పాలస్తీనియన్లను భద్రతా దళాలు చంపి వేశాయి. సామాన్య పౌరులు, మిలిటెంట్లకు తేడా చూపకుండా ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నందున తాము కూడా అదే బాట పడతామని హెబ్రాన్‌ ఉదంతం తరువాత హమస్‌ ప్రకటించింది.
ఇదే సమయంలో పిఎల్‌ఓ- ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన ఓస్లో ఒప్పందాన్ని అది వ్యతిరేకించింది. దానిలో భాగంగానే 1996లో జరిగిన పాలస్తీనా ఎన్నికలను, 2005లో పాలస్తీనా అధ్యక్ష ఎన్నికను బహిష్కరించింది. యాసర్‌ అరాఫత్‌ మరణించిన తరువాత 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. గాజా ప్రాంతంలో మెజారిటీ సీట్లు తెచ్చుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వెస్ట్‌ బాంక్‌ ప్రాంతంలో ఫతా అధికారంలో ఉంది. ఏ దేశంలోనైనా ప్రాంతీయ ప్రభుత్వాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉండదు. పాలస్తీనా ప్రభుత్వానికే ఇంతవరకు ఐరాసలో గుర్తింపు లేదు. హమస్‌, వెస్ట్‌బాంక్‌ ప్రభుత్వాలకు మిలిటరీ లేదు. గాజా కేంద్రంగా హమస్‌ గెరిల్లాలు మాత్రమే దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ మిలిటరీ ఆ గెరిల్లాలను అణచే పేరుతో జనావాసాలపై దాడులు చేసి పౌరులను హతమారుస్తున్నది. విమానాలతో బాంబులు వేస్తున్నది. గాజా వాసులకు మంచినీరు, విద్యుత్‌, ఆహారం, ఔషధాల సరఫరాలను నిలిపివేసిందంటే సామాన్య పౌరుల మీద దాడి తప్ప మరొకటి కాదు. గాజా ప్రాంతం నుంచి తప్పుకున్న 2006 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ పదిసార్లు మిలిటరీదాడులు జరిపింది.
ఇజ్రాయెల్‌ నిఘా వైఫల్యమా! కుట్రా!!
గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఒక నిర్బంధశిబిరంగా మార్చివేసింది. దాని చుట్టూ మనుషులు దాటటానికి వీలులేని ఆరు మీటర్ల ఎత్తున పెద్ద ఇనుప ముళ్ల కంచెను ఏర్పాటు చేసింది. దాని పొడవు 65 కిలోమీటర్లు, డ్రోన్లు, రిమోట్‌ కంట్రోలు మెషిన్‌ గన్లు, కెమెరాలు దానికి అమర్చి ఉంటాయి. ఏదైనా అలజడి సమాచారం ఉంటే ఐదు నిమిషాల్లో దాడులు చేసేందుకు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంటాయి. బుల్డోజర్లతో తప్ప ఆ కంచెను ధ్వంసం చేయలేరు. దాన్ని దాటి వందలాది మంది హమస్‌ గెరిల్లాలు బుల్డోజర్లు, ట్రాక్టర్ల మీద వచ్చారని చెబుతున్నారు. ఒకవైపు ఈజిప్టు, మరోవైపు మధ్యధరా సముద్రం, రెండు వైపులా ఇజ్రాయెల్‌ మిలిటరీ ఉంటుంది. గాజా వాసులు వెలుపలికి రావాలంటే ఇజ్రాయెల్‌ అనుమతి లేకుండా కుదరదు. హమస్‌ గెరిల్లాలు కంచెను దాటి కొందరు క్షిపణులు ప్రయోగించారు. కొన్నిచోట్ల కంచెలోపలి నుంచే వదిలారు. దీన్ని ఇజ్రాయెల్‌ పసిగట్టలేకపోయింది. ఏదో జరగబోతోందని ముందే తాము హెచ్చరించామని ఈజిప్టు నిఘా అధికారులు చెప్పారు. తాము కూడా మిలిటరీని హెచ్చరించామని ఇజ్రాయెలీ గూఢచారులు కూడా చెబుతున్నారు. తమకెలాంటి సమాచారమూ లేదని మిలిటరీ చెప్పింది. ఇన్ని రోజుల తరువాత కూడా ఇది ఒక రహస్యంగా మిగిలిపోయింది.
గాజాలో ఎంత మందిని చంపారు?
అక్టోబరు ఏడవ తేదీన హమస్‌ సాయుధులు జరిపిన దాడులలో 1400 మరదికి పైగా మరణించారు. దానికి ప్రతీకారం పేరుతో ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ, యూదు దురహంకార సాయుధులు పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై జరుపుతున్న దాడుల్లో బుధవారం నాటికి గాజాలో 2,055 మంది పిల్లలు, 1,119 మంది మహిళలతో సహా 5,087 మంది మరణించారు. గాయపడిన వారు 15,273 మంది. వీరుగాక పాలస్తీనాలో ఆక్రమించిన పశ్చిమ గట్టు ప్రాంతంలో ఇజ్రాయెలీ మూకలు మరో 95 మందిని చంపగా 1,650 మంది గాయపడ్డారు. గురువారం నాటికి గాజాలో మరణాల సంఖ్య ఆరున్నరవేలు దాటింది. ఇక హమస్‌ జరిపిన ఒక రోజు దాడిలో 1,405 మంది మరణించగా, 5,431 మంది గాయపడ్డారు. వీరుగాక గాజాలో 720 మంది పిల్లలతో సహా 1,400 మంది కనిపించటం లేదు. పశ్చిమ గట్టు ప్రాంతంలో 1,215 మందిని ఇజ్రాయెల్‌ అరెస్టు చేసింది.
ఐరాస విఫలం-అమెరికా వీటో!
ఇజ్రాయెల్‌ దాడులు, మారణకాండ నివారణలో ఐక్యరాజ్యసమితి విఫలమైంది. భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించిన ఒక తీర్మానంలో ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఉందంటూ సమర్ధనకు పూనుకుంది. దీన్ని రష్యా, చైనా వీటో చేశాయి. దాడుల విరమణకు ఇది సమయం కాదంటూ అమెరికా ప్రకటించింది. గాజాలో జరుపుతున్న కొన్ని దాడులు ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బ కావచ్చని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హెచ్చరించాడు. మానవతా పూర్వకంగా దాడులను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించేందుకు భద్రతా మండలిలో బ్రెజిల్‌ పెట్టిన తీర్మానాన్ని మొత్తం 15కు గాను 12 మంది సమర్ధించగా దాన్ని చెల్లకుండా అమెరికా వీటో చేసింది. అంతకు ముందు రష్యా ప్రవేశపెట్టిన తీర్మానానికి చైనా మరో మూడు దేశాలు మద్దతు పలకగా నాలుగు దేశాలు వ్యతిరేకించాయి. ఆరుగురు ఓటింగ్‌లో పాల్గొనకపోవటంతో అది వీగిపోయింది. బ్రెజిల్‌ ప్రవేశపెట్టిన తీర్మానంలో పౌరులపై దాడులు ఆపాలని, కాల్పులను విరమించాలనే అంశం లేదంటూ వాటిని చేర్చాలని రష్యా ప్రతిపాదించిన రెండు సవరణలు వీగిపోయాయి. దాంతో తీర్మానం వృధా అంటూ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణ హక్కు గురించి పేర్కొనలేదు గనుక తాము వీటో చేస్తున్నట్లు అమెరికా పేర్కొన్నది. ఆ సాకునే చెబుతూ బ్రిటన్‌ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందా!
ప్రస్తుతం ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులు, ఒకవేళ వాటి తీవ్రతను పెంచితే రాగల పరిణామాలు, పర్యవసానాల గురించి అమెరికా మదింపు వేస్తోంది. తొందరపడవద్దని హెచ్చరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్‌ వాటిని పరిగణనలోకి తీసుకొని భూతల దాడులను కొద్దిరోజులు ఆపవచ్చని కూడా వార్తలు వచ్చినప్పటికీ బుధవారం నాడు పెద్ద ఎత్తున దాడులకు దిగి మారణకాండ జరిపింది. వాటిని కొనసాగించినా, తీవ్రత పెంచినా పర్యవసానాలను ఊహించలేం. ఇరాన్‌ అందచేసిన డ్రోన్లు, ఇతర ఆయుధాలతో హమస్‌ కంటే పెద్ద శక్తిగా లెబనాన్‌లో ఉన్న హిజబుల్లా గనుక పోరుకు దిగితే తీవ్ర పరిస్థితి ఏర్పడుతుంది. దాని వద్ద స్వల్పశ్రేణి ఖండాంతర క్షిపణులు, డ్రోన్లు, మానవరహిత ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి. ప్రస్తుతం అది యుద్ధాన్ని కోరుకోవటం లేదని, అమెరికా, ఇజ్రాయెల్‌ గనుక వారిని ఆవైపుకు నెడితే రంగంలోకి దిగుతుందని పరిశీలకులు అంటున్నారు. బహుశా దానిలో భాగంగానే లెబనాన్‌ సరిహద్దులో ఉన్న హిజబుల్లా సాయుధులపై ఇజ్రాయెల్‌ దాడులు చేసి కవ్విస్తున్నది. 2019లో అమెరికా మిలిటరీ గూఢచారుల సమాచారం మేరకు హిజబుల్లా వద్ద లక్షా 50వేల రాకెట్లు, ఇజ్రాయెలీ సంస్థ ఒకటి గతేడాది చెప్పినదాని ప్రకారం రెండువేల మానవరహిత ఆయుధ ప్రయోగ వాహనాలు ఉన్నాయి. వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే ఆయుబ్‌, షాహేద్‌ వంటి క్షిపణులు కూడా ఉన్నాయి. 2006లో జరిగిన రెండవ లెబనాన్‌ పోరులో హిజబుల్లా పెద్దసంఖ్యలో ఇజ్రాయెల్‌ సైనికులను హతమార్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకుంది. ప్రస్తుతం లక్షమంది యోధులున్నట్లు అంచనా. ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణకాండకు ప్రపంచమంతటా తీవ్ర నిరసన వెల్లడి అవుతోంది. శాంతి శక్తులు పాలస్తీనియన్లకు మద్దతుతో పాటు వారిమీద సాగుతున్న దాడులను మరింతగా ఖండిస్తూ వత్తిడిని పెంచాల్సి ఉంది.
– ఎం కోటేశ్వరరావు,
83310 13288

Spread the love