రోల్‌ మోడల్‌

A role modelజీవితంలో మనం విజయాలు సాధించాలన్నా, ఓ స్థాయికి ఎదగాలన్నా మనకంటూ ఓ రోల్‌ మోడల్‌ చాలా ముఖ్యం. సాధారణంగా అందరం మన చిన్నతనంలో మొదటగా మన అమ్మానాన్నలను, ఆ తర్వాత గురువులను రోల్‌ మోడల్‌గా భావిస్తాం. వయసు పెరిగే కొద్ది మన ఆలోచనలు, ఆశయాలు మారిపోతుంటాయి. వాటికి తగ్గట్టుగానే రోల్‌ మోడల్‌గా ఉండే వ్యక్తులు కూడా మారిపోతుంటారు.
పిలే, మారడోనాలు కొందరికి ఆదర్శమైతే సచిన్‌ మరికొందరికి ఆదర్శం. గాంధీని ఆదర్శంగా ఎందరో ఎంచుకుంటే, గాడ్సే తమకు ఆదర్శం అనేవారు, ఇంకా ముందుకెళ్లి హిట్లర్‌ తమ ఆరాధ్య దైవంగా చెప్పుకునేవారూ వున్నారు. ఏ దారిలోనైనా డబ్బు సంపాదనే ఆదర్శంగా వుండాలనేది ‘ఆధునిక సైన్స్‌’.
అయితే మనం ఎవరిని రోల్‌ మోడల్‌గా ఎంపిక చేసుకోవాలి అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. మన ఎంపికను బట్టే మనం వెళ్లే మార్గం సరైనదా కాదా అని అంచనా వేయవచ్చు. సాధారణంగా జీవితంలో విజయాలు సాధించడానికే ఎక్కువ మంది రోల్‌ మోడల్‌ను ఎంచుకుంటారు. వారు సెలబ్రిటీ కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మనకు పరిచయం లేని సమాజ సేవకులు కావొచ్చు. వారిని ఆదర్శంగా తీసుకుని మనం సాధించాల్సిన విజయాల కోసం ఓ ప్రణాళికను రూపొందించుకుంటా. వారిని అనుసరిస్తూ జీవితంలో ఓ స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తాం. ఇలాంటి రోల్‌ మోడల్స్‌ ఉండడం ప్రతి వ్యక్తికి చాలా అవసరం.
అయితే దేశం కోసం, పేదల కోసం త్యాగాలు చేసిన వారిని ఆదర్శంగా తీసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. రోల్‌ మోడల్‌ అంటే గొప్ప విజయాలు, డబ్బు సాధించిన వారు మాత్రమే కాదు. నలుగురి మేలు కోరి త్యాగాలు చేసిన వారు కూడా గొప్పవారే. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగడం ఎంత ముఖ్యమో మంచి మనిషిగా ఉండటం కూడా అంతే ముఖ్యం. అప్పుడు త్యాగాలు చేసిన వారు కూడా మన రోల్‌ మోడల్‌గా మారిపోతారు.
అంటరాని కుటుంబంలో పుట్టి, ఎన్నో బాధలు అనుభవించి, ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగ నిర్మాతగా గుర్తింపు పొందిన అంబేద్కర్‌ ఎందరికో ఆదర్శం. దేశం కోసం ఇరవై మూడేండ్లకే ప్రాణాలర్పించిన భగత్‌సింగ్‌ మరికొందరికి ఆదర్శం. నిరుపేదల జీవితాలు మార్చేందుకు జీవితాంతం శ్రమించిన కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శంగా భావించి సమసమాజం కోసం తపిస్తున్నవారు చాలామంది ఉన్నారు. ముందే చెప్పుకున్నట్లు అంటరాని తనాన్ని వ్యతిరేకించి, అహింసా మార్గాన్ని చూపిన గాంధీని ఎందరో రోల్‌ మోడల్‌గా భావిస్తారు. అయితే ఇక్కడ బాధ పడాల్సిన విషయం ఒకటి ఉంది. గాంధీని చంపిన గాడ్సేను రోల్‌ మోడల్‌గా భావించే వారు నేడు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
కాబట్టి విలువలున్న వ్యక్తిని రోల్‌మోడల్‌గా ఎంచుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మనం వెళ్ళే మార్గం కూడా విలువలతో నిండి ఉంటుంది. అలాగే మనం ఏ రంగంలో రాణించాలనుకుంటున్నామో ఆ రంగంలో విజయాలు సాధించిన వారిని రోల్‌ మోడల్‌గా తీసుకోవాలి. అయితే రోల్‌ మోడల్‌ని ఎంపిక చేసుకున్నంత మాత్రాన మనం గొప్పవారైపోము. వారు జీవితంలో ఏం చేశారో, ఎలాంటి విలువలకు కట్టుబడి ఉన్నారో, ఎలాంటి త్యాగాలు చేశారో తెలుసుకోవాలి. మనం కూడా అలా ఉండటానికి శాయశక్తుల కృషి చేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం.

Spread the love