కాంగ్రెస్ ను గెలిపించాలి : డీకే శివకుమార్‌

నవతెలంగాణ తాండూరు: తెలంగాణ ప్రజలమీద ప్రేమతోనే సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పట్ల తెలంగాణ ప్రజలు కృతజ్ఞత చూపాలని  కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ రెండో విడత విజయభేరి బస్సుయాత్ర శనివారం వికారాబాద్‌ జిల్లా తాండూరు నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొన్న శివకుమార్‌ మాట్లాడుతూ… కర్ణాటకలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ అమలు చేస్తోందన్నారు. అనుమానం ఉంటే సీఎం కేసీఆర్‌ కర్ణాటకకు వచ్చి చూసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రమే పేదల గురించి ఆలోచిస్తుందన్నారు.
‘‘కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. గృహలక్ష్మి పథకం ద్వారా 1.10కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2వేలు ఇస్తున్నాం. హామీ ఇచ్చిన ప్రకారం పేదలకు 10కిలోల సన్నబియ్యం కూడా ఉచితంగా ఇస్తున్నాం. కర్ణాటకలో మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కాంగ్రెస్‌ ఏదైనా హామీ ఇచ్చిందంటే.. తప్పక నెరవేరుస్తుంది. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఈ పదేళ్లలో నెరవేరాయా? కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రతి మహిళకు కాంగ్రెస్‌ ఉచిత బస్సు ప్రయాణం అందించనుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది. డిసెంబరు 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం’’ అని డీకే శివకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘తెలంగాణలో ఎక్కడా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడంలేదు. కేవలం 8..9 గంటలు మాత్రమే ఇస్తున్నారు. హైదరాబాద్‌కు ఔటర్‌ రింగురోడ్డు, మెట్రో రైలు తెచ్చింది, మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్‌ పార్టీనే. కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రాజెక్టుల వల్లే హైదరాబాద్‌ ఖ్యాతి పెరిగింది. లంచాలు ఇవ్వని స్థిరాస్తి వ్యాపారులను అణిచివేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో రుణమాఫీ పూర్తి చేయలేదు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. 12 శాతం ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం.. మైనార్టీలను మోసం చేసింది. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాల్సిందే’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Spread the love