అధికారమే లక్ష్యంగా… టీపీసీసీ వ్యూహం

‘ఆరు గ్యారంటీ’లపై విస్తృత ప్రచారం
‘ఆరు గ్యారంటీ’లపై విస్తృత ప్రచారం

– 28, 29 తేదీల్లో రాష్ట్రానికి కర్ణాటక సీఎం!
– 30న ఖర్గే, 31న ప్రియాంక
– నవంబరు 1, 2 తేదీలలో రాహుల్‌
– రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు
నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు టీపీసీసీ కసరత్తును ముమ్మరం చేస్తోంది. కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆ పార్టీ అగ్రనేతలతో వరసగా రోడ్‌షోలు, కూడలి సమావేశాల తోపాటు, బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళిక రచిస్తోంది. వచ్చే నెల 3 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతున్నందున ఈలోపు మరో విడత బస్సుయాత్ర పూర్తిచేసేందుకూ వ్యూహన్ని సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ప్రధానంగా ఆరు గ్యారంటీ హామీలను అగ్రనేతలతో ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు మహిళల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి వరసగా వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని టీపీసీసీ ప్రాథమికంగా నిర్ణయించింది. తెలంగాణలో ప్రచారం చెయ్యాల్సిందిగా రాష్ట్ర నేతలు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ఇటీవల కోరారు. ఆయన షెడ్యూల్ కరారు అయితే 28న సిద్దరామయ్యతో రెండో విడత బస్సుయాత్ర ప్రారంభించి, 29న కూడా కొనసాగించాలనే ఊపులో ఆ పార్టీ ఉంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే 30న బస్సు యాత్రలో పాల్గొనడంతోపాటు, 31న ప్రియాంకా గాంధీ కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలోనూ ప్రసంగించేలా కార్యాచరణ రూపొందింది. వచ్చేనెల 1, 2 తేదీల్లో రాహుల్‌గాంధీ మరోసారి రాష్ట్రంలో బస్సుయాత్ర, రోడ్‌షోలలో పాల్గొననున్నారు. అలాగే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంలతోనూ రాష్ట్రంలో ప్రచారం చేయించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తుండగా.. వీరు పాల్గొనే సభలు, రోడ్‌షోలకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను సిద్ధంచేసే పనిలో రాష్ట్ర ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. త్వరలోనే రెండో విడత బస్సుయాత్ర రూట్‌మ్యాప్‌ విడుదల చేస్తామని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మంగళవారం తెలిపారు.

Spread the love