‘మిరాకిల్ మంత్‌’గా డిసెంబర్‌ : రేవంత్ రెడ్డి

హరిహర కళాభవన్‌లో మాట్లాడుతున్న రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో మైనార్టీలు కాంగ్రెస్‌ వైపు నిలబడి ఓట్లు వేయడంతోనే అక్కడ అధికారంలోకి వచ్చినట్టు రేవంత్‌ రెడ్డి అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సి ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో హంగ్‌ వస్తుందని..బీజేపీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని బీజేపీ నేత బీఎల్ సంతోష్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ ఒకటి కావు. ఆ విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో హంగ్‌ వస్తే కలవబోయేది బీజేపీ, బీఆర్ఎస్ అని సంతోష్‌ చెప్పకనే చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీని కేటీఆర్‌, కేసీఆర్‌, బీజేపీ నేతలు దూషిస్తున్నారు. పదవులు త్యాగం చేసినందుకా? లేక ఒక దళితుడిని పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసినందుకా? ఎందుకు సోనియా గాంధీని తిడుతున్నారు? డిసెంబర్ నెల ‘మిరాకిల్ మంత్‌’గా నిలిచిపోతుంది. 2009 డిసెంబర్‌ 9న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రకటన వచ్చింది. ఇప్పుడు మళ్లీ 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు మేలు జరుగుతుంది’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Spread the love