కుమారుడితో ఓటు వేయించిన బీజేపీ నేత..మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ నేత ఒకరు తన కుమారుడితో ఓటు వేయించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బీజేపీ నేత చర్యను కాంగ్రెస్‌ పార్టీ నేత తప్పుపట్టారు. చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌(ఈసీ)ను డిమాండ్‌ చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌లోని బెరాసియా లోక్‌సభ నియోజకవర్గానికి మంగళవారం పోలింగ్‌ జరిగింది. బీజేపీకి చెందిన పంచాయితీ నాయకుడైన వినయ్ మెహర్ తన కుమారుడితో కలిసి పోలింగ్‌ బూత్‌కు వెళ్లారు. తన తరుఫున కుమారుడితో ఓటు వేయించారు. ఈవీఎంపై బీజేపీ గుర్తు ఉన్న బటన్‌ను ఆ బాలుడు నొక్కాడు. తర్వాత ఓటు నమోదైందా? లేదా? అన్నది వీవీపాట్‌లో చూసుకున్నారు. కాగా, బీజేపీ నేత వినయ్‌ మెహర్ మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ను ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్ నాథ్ మీడియా సలహాదారుడైన పీయూష్ బాబెలే ఆరోపించారు. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో ఆయన షేర్‌ చేశారు. తండ్రితోపాటు పిల్లవాడ్ని, మొబైల్ ఫోన్‌ రికార్డింగ్‌ను పోలింగ్ బూత్‌లో ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ)ను పిల్లల ఆట వస్తువుగా బీజేపీ మార్చిందని విమర్శించారు. దీనిపై ఏమైనా చర్య తీసుకుంటారా? అని నిలదీశారు. మరోవైపు సోషల్‌ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ స్పందించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. ఆ పోలింగ్ బూత్‌ వద్ద ఉన్న ప్రిసైడింగ్ అధికారి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ వీడియో క్లిప్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) ఇంకా స్పందించలేదు.

Spread the love